Abn logo
Sep 25 2021 @ 04:08AM

‘కృష్ణపట్నం’లో బియ్యం ఎగుమతులు బంద్‌

కంటైనర్లు ఇవ్వని కొత్త యాజమాన్యం

అదానీ చేతుల్లోకి వెళ్లాక మారిన ప్రాధాన్యాలు

నెల్లూరు, పరిసర జిల్లాల నుంచి కాకినాడ పోర్టుకు రవాణా


నెల్లూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లాక కృష్ణపట్నం పోర్టు ప్రాధాన్యాలు మారిపోతున్నాయి. నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమ, తెలంగాణ జిల్లాలకు ఉపయోగకరంగా ఉన్న కృష్ణపట్నం పోర్టు ఇప్పుడు నిష్ప్రయోజనంగా మారుతోంది. సొంత జిల్లాలో పండిన పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా వీల్లేకుండా పోర్టు యాజమాన్యం నుంచి కొత్త నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతులు జరుగుతుండడంతో ధాన్యానికి డిమాండ్‌ పెరిగింది. దీంతో ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా రైతుకు కొంతవరకైనా గిట్టుబాటు ధర లభిస్తుండగా ఇకపై ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ పోర్టు నుంచి ఒక్కసారిగా బియ్యం కంటైనర్లను నిలిపేయడంతో ఎగుమతులకు కాకినాడ పోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరులో 80 శాతానికిపైగా వరి పండిస్తారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బియ్యంలో కొంతవరకే ప్రభుత్వం తీసుకుంటుండగా మెజారిటీ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అలానే రాయలసీమ, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని నల్గొండ ప్రాంతం నుంచి కూడా బియ్యాన్ని కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతులకు వీలుండడంతో మిల్లర్లు కూడా పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనేవారు. అప్పుడు ధాన్యం విక్రయాలకు రైతులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అయితే ఇప్పుడు కృష్ణపట్నం పోర్టులో ఎగుమతులు ఆపేయడంతో ధాన్యాన్ని కొనేందుకు మిల్లర్లు వెనకడుగు వేస్తున్నారు. బియ్యాన్ని ఎగుమతి చేయాలంటే కాకినాడ పోర్టునే మార్గం. ఎక్స్‌పోర్టర్లు కాకినాడకు తీసుకొస్తేనే తీసుకుంటామని చెబుతుండడంతో విధిలేని పరిస్థితుల్లో అక్కడకు చేర్చాల్సి వస్తోంది. నెల్లూరు, రాయలసీమ ప్రాం తాల నుంచి అంత దూరం బియ్యాన్ని తీసుకెళ్లాలంటే భారీగా రవాణా ఖర్చులవుతున్నాయి. నెల్లూరు నుంచి కాకినాడ పోర్టుకు బియ్యాన్ని తరలిస్తుంటే మెట్రిక్‌ టన్నుకు సుమారు రూ.2 వేలకుపైగా రవాణా ఖర్చు అవుతున్నట్లు మిల్లర్లు వాపోతున్నారు. ఈ ప్రభావం అంతిమంగా రైతులపై పడుతోంది. 


కంటైనర్లు ఇవ్వడం లేదు 

గత యాజమాన్యం చేతుల్లో కృష్ణపట్నం పోర్టు ఉన్నప్పుడు బియ్యం ఎగుమతులకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ కొత్త యాజమాన్యం వచ్చాక బియ్యం ఎగుమతులకు కంటైనర్లు ఇవ్వలేమని చెప్పింది. ఈ విషయాన్ని ఎక్స్‌పోర్టర్లు మాకు తెలియజేశారు. జిల్లాలో ఉత్పత్తి అయిన బియ్యాన్ని ఇప్పుడు కాకినాడ పోర్టుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి బియ్యం ఎగుమతులకు అనుమతిచ్చేలా చర్యలు తీసుకోవాలి. 

- యాలమూరి రంగయ్యనాయుడు, నెల్లూరు జిల్లా రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు


అందుకే ప్రైవేటైజేషన్‌ వద్దన్నాం

బియ్యం ఎగుమతులు నిలిపేయడం అన్యాయం. ప్రైవేటైజేషన్‌పై గడిచిన ఏడాదన్నరగా రైతులు పోరాడుతున్నది కూడా ఇటువంటి సమస్యలు వస్తాయనే. నవయుగ యాజమాన్యం ఉన్నప్పుడు కొనసాగిన ఎగుమతులు ఇప్పుడెందుకు ఆపేయాల్సి వచ్చింది? జిల్లా రైతాంగం ఏమవ్వాలి?  పోర్టు యాజమాన్యం దీనిపై పునరాలోచించాలి. రైతులను దృష్టిలో పెట్టుకొని ఎగుమతులకు అనుమతివ్వాలి.

 - చిరసాని కోటిరెడ్డి, రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి