Abn logo
Sep 27 2021 @ 03:02AM

అస్మదీయులకే.. సంపూర్ణ పోషకం!

పిల్లలు, గర్భిణుల సొమ్ము నలుగురికే దోచిపెడుతున్న సర్కారు

ప్రతి జిల్లాలో ఆ కాంట్రాక్టర్లకే టెండర్లు

 వాస్తవానికి ఇది కేంద్ర పథకం

వైఎస్‌ పేరుపెట్టి సొంత ప్రచారం

ప్రభుత్వంపై 70 కోట్ల భారం


పిల్లలకు అందించే పౌష్టికాహారంపైనా గద్దలు వాలుతున్నాయి. కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ‘పోషణ్‌ అభియాన్‌’ పేరిట బలవత్తరమైన ఆహారం అందించడానికి రూ.వందల కోట్లు ఇస్తోంది. అయుతే జగన్‌ సర్కారు ఆ పేరును ‘వైఎ్‌సఆర్‌ సంపూర్ణ పోషణ’గా మార్చి సొంత ప్రచారం చేసుకుంటోంది. పౌష్టికాహార కిట్ల పంపిణీకి ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా రేట్లు నిర్ణయించి పేద పిల్లలు, తల్లుల సొమ్మును అప్పనంగా కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌, రివర్స్‌ టెండర్‌ అంతా ఫార్స్‌. రాష్ట్రంలో ఎక్కడ టెండర్లు జరిగినా నలుగురు కాంట్రాక్టర్లే దక్కించుకుంటున్నారు.. తాము మాత్రమే టెండర్లు వేసేలా అర్హత నిబంధనలు మార్చుకుంటున్నారన్న విమర్శలొస్తున్నాయి.


(అమరావతి/నెల్లూరు-ఆంధ్రజ్యోతి)

వైఎ్‌సఆర్‌ సంపూర్ణ పోషణ పథకం కింద ప్రభుత్వం ఆరు పోషకాహార సరుకులతో కిట్స్‌ను పంపిణీ చేస్తోంది. అరకిలో బెల్లం, కిలో చొప్పున రాగిపిండి, జొన్నపిండి, అటుకులు.. పావుకిలో చొప్పున ఎండు ఖర్జూరం, వేరుశనగ చిక్కీలు కలిగిన కిట్లను మహిళలకు, పిల్లలకు ఇస్తున్నారు. అయితే ఈ కిట్ల పంపిణీకి రాష్ట్రమంతా ఒకే నిబంధనలు లేకపోవడంతో ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా రేట్లను నిర్ణయిస్తున్నారు. ఇది నలుగురు కాంట్రాక్టర్లకు బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. మధ్యాహ్న భోజన పథకం, ప్రజాపంపిణీ, సంక్షేమ హాస్టళ్లు, టూరిజం తదితర రంగాల్లో నిత్యావసరాల సరఫరాకు ఏ టెండర్లు పిలిచినా ఆ నలుగురి కనుసన్నల్లో జరగాల్సిందేనని, ప్రభుత్వాన్ని వారు శాసిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరిలో నెల్లూరుకు చెందిన ఇద్దరు.. విశాఖ, రావులపాలెంకు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. ప్రభుత్వ రంగంలో ఏ టెండర్లు పిలిచినా నిబంధనలను వాళ్లకు అనుకూలంగా మార్చేస్తున్నారని చెబుతున్నారు. గత ఏడాది కూడా వారి హవాయే నడచిందని.. కిట్ల పంపిణీ టెండర్లలో ప్రభుత్వంపై రూ.70 కోట్ల దాకా అదనపు భారం పడిందని అంటున్నారు. వారు నిరుడు రాష్ట్రమంతా టెండర్లు దక్కించుకున్నా.. నెల్లూరు జిల్లాలో మాత్రం కుదరలేదు. అక్కడ గుంటూరు జిల్లాకు చెందిన ఓ సరఫరాదారు ఒక్కో కిట్‌ రూ.192కే సరఫరా చేస్తామని టెండర్లు వేసి పంపిణీ చేస్తున్నారు. మిగిలిన 12 జిల్లాల్లో ఆ నలుౄగురు కాంట్రాక్టర్లు రూ.245 నుంచి రూ.249 దాకా నిర్ణయించి సరఫరా చేస్తున్నారు. ఒక్కో కిట్‌ మీద సుమారు రూ.53-57 దాకా స్వాహా చేస్తున్నారు. 


అర్హతలు మారిపోతాయ్‌..

ఈ ఏడాది కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ టెండర్లు దక్కించుకునేందుకు నలుగురు కాంట్రాక్టర్లు సిండికేట్‌ అయ్యారని.. వారి ప్రోద్బలంతో జిల్లాల్లో అధికారులు టెండరు నిబంధనలను, అర్హతలను మార్చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లాలో గత ఏడాది ఈ కిట్స్‌ పంపిణీకి కాంట్రాక్టరుకు ఉండాల్సిన వార్షిక టర్నోవర్‌ రూ.10 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈ ఏడాది అనూహ్యంగా టర్నోవర్‌ విలువను రూ.19.11 కోట్లకు పెంచారు. అది కూడా రూ.9.50 కోట్ల టర్నోవర్‌ సింగిల్‌ ఆర్డర్‌పై ఉండాలని నిబంధన పెట్టారు. ఇది చాలదౄన్నట్లు.. 2,400 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇది వరకే పౌష్టికాహారం పంపిణీ చేసిన అనుభవం కలిగిన సంస్థలే టెండర్లలో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు జిల్లాలో ఈ టెండర్లు నిర్వహించనున్నారు. ఇంకో కాంట్రాక్టరు పోటీలో పాల్గొనకుండా తమకున్న అర్హతలనే నిబంధనలుగా పెట్టి.. తాము మాత్రమే బిడ్లు వేసేలా ఆ నలుగురు సెట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం టెండర్ల నిబంధనలకు రూపకల్పన చేసే అధికారులను మంచి చేసుకున్నారని.. మంత్రులు, ఎమ్మెల్యేల చేత సిఫారసులు చేయించుకుని.. తాము అనుకున్నట్లు చిత్తూరు జిల్లాలో జరిగేలా చూసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. బిడ్లు  దాఖలు చేసినవారిలో తక్కువకు కోట్‌ చేసిన వారికే సాధారణంగా టెండర్‌ దక్కుతుంది. వ్యూహాత్మకంగా ఆ నలుగురు ఎక్కువ రేట్లను కోడ్‌ చేస్తారు. పోటీలో ఉన్న ఆ నలుగురినీ పిలిచి జాయింట్‌ కలెక్టర్‌ రివర్స్‌ టెండర్‌ నిర్వహిస్తారు. అంతకు ముందు కంటే ఒక రూపాయి గానీ, రెండు రూపాయిలు గానీ తగ్గించి రివర్స్‌ టెండర్లలో ప్రజాధనం కాపాడామని కలరింగ్‌ ఇస్తారు. ఇటీవల అనంతపురం, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల్లో జరిగిన టెండర్లను ఆ నలుగురే దక్కించుకోవడం విశేషం. ఇలా ఏ జిల్లాలో పోషకాహార టెండర్లు పిలిచినా వారు వాలిపోతున్నారని.. కలెక్టర్లు దృష్టి సారించి పారదర్శకంగా నిబంధనలు రూపొందించి.. ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా అడ్డుకోవాలని పలువురు సూచిస్తున్నారు.