Abn logo
Sep 27 2021 @ 03:09AM

విహారయాత్రలో విషాదం

తేనెటీగల దాడిలో యువకుడు మృతి

మరో నలుగురికి గాయాలు

మారేడుమిల్లి, సెప్టెంబరు 26 : ప్రకృతి అందాలను చూడడానికి స్నేహితులతో వచ్చిన ఓ యువకుడు తేనెటీగల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి పర్యాటకప్రాంతంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన ఏడుగురు, తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరానికి చెందిన నలుగురు యువకులు ఆదివారం మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి వచ్చారు. వీరంతా జలతరంగిణి జలపాతం నుంచి అమృతధార జలపాతం వద్దకు వెళుతుండగా అబ్దుల్‌ మాలిక్‌ ఖాన్‌(21) టాయిలెట్‌కు వెళ్లేందుకు పక్కనే ఉన్న కాలువ వద్దకు వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా వందలకొద్దీ తేనెటీగలు అతనిపై దాడి చేశాయి. సహచరులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారిపై కూడా తేనెటీగలు దాడి చేయడంతో పరుగులు తీశారు.   గాయాలతో స్పృహ కోల్పోయిన అబ్దుల్‌ను మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించగా ప్రఽథమ చికిత్స అనంతరం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడు పంజాబ్‌ రాష్ట్రం ఎల్‌పీయూ యూనివర్సిటీలో గ్రాఫిక్‌ ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఘటనలో తేనెటీగల దాడిలో గాయపడిన మరో నలుగురు యువకులు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.