Abn logo
Sep 27 2021 @ 03:20AM

రాజధానికి భూములిస్తే నడిరోడ్డుమీద నిలబెట్టారు

రైతుల ఆవేదన...649వరోజుకు ఉద్యమం

 తుళ్లూరు, సెప్టెంబరు 26: ‘రాష్ట్రరాజధాని అమరావతికోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను నడిరోడ్డు  మీద   నిలబెట్టిన ఘనత  సీఎం జగన్‌ది’ అని రాజధాని రైతులు పేర్కొన్నారు. అమరావతే రాష్ట్ర ఏకైక రాజధానిగా  కొనసాగాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం ఆదివారం 649వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా ధర్నా శిబిరాల నుంచి రైతులు మాట్లాడుతూ మూడు ముక్కలాటతో రాష్ట్రం బాగుపడదన్నారు.  కుల మతాలకు అతీతంగా అందరి ఆదరాభిమానాలనతో రాజధాని అమరావతి అభివృద్ధి జరుగుతున్న సమయంలో సీఎం జగన్‌రెడ్డి  మూడు ముక్కలాటతో  నాశనం చేశారన్నారు. ఇదేమి న్యాయం అంటూ రైతు శిబిరాల నుంచి మహిళలు, రైతు కూలీలు, రైతులు  ప్రశ్నించారు. ఉద్యమాన్ని ఆపాలని శత విధాలుగా ప్రయత్నాలు  చేస్తున్నారని ఆరోపించారు.  రైతులను  ఎన్నాళ్ళు  మోసం చేస్తారని ప్రశ్నించారు.   జై అమరావతి అంటూ నినాదాలు కొనసాగించారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.