ఇక నిర్ణయం బోర్డుదే!

ABN , First Publish Date - 2021-10-17T08:33:36+05:30 IST

ష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులను ఏపీ, తెలంగాణ ఈ నెల 14లోగా ‘బోర్డు’లకు అప్పగించాల్సిందేనంటూ కేంద్ర జలశక్తి శాఖ నిర్దేశించిన గడువు ముగిసింది.

ఇక నిర్ణయం బోర్డుదే!

నిలిచిపోయిన ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియ

విద్యుత్‌ కేంద్రాలను ఇవ్వబోమన్న తెలంగాణ 


అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులను ఏపీ, తెలంగాణ ఈ నెల 14లోగా ‘బోర్డు’లకు అప్పగించాల్సిందేనంటూ కేంద్ర జలశక్తి శాఖ నిర్దేశించిన గడువు ముగిసింది. కేంద్రం ప్రకటించిన గెజిట్‌ షెడ్యూల్‌-2లో ఉన్న ప్రాజెక్టులను విద్యుత్కేంద్రాలతో సహా తెలంగాణ అప్పగిస్తే తామూ సిద్ధంగా ఉన్నామంటూ ఏపీ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ, ఇంధన శాఖ 14న విడివిడిగా ఉత్తర్వులు జారీ చేశాయి. శ్రీశైలం జలాశయం ప్రధాన అవుట్‌లెట్లకు సంబంధించి జల వనరుల శాఖ, జల విద్యుత్కేంద్రంతో కలిపి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, జల విద్యుత్కేంద్రంతో సహా నాగార్జునసాగర్‌ కుడి ప్రధాన కాలువను అప్పగించడానికి సిద్ధమని పేర్కొన్నాయి. అయితే జల విద్యుత్కేంద్రాలతో పాటు శ్రీశైలం, సాగర్‌ అవుట్‌లెట్‌లను తెలంగాణతో సమాంతరంగానే కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు అప్పగిస్తామంటూ ఏపీ షరతు విధించింది. ఇదే సమయంలో విద్యుత్కేంద్రాలు మినహా శ్రీశైలం, సాగర్‌ ప్రధాన కాలువలను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు సిద్ధమేనంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకే నిర్ణయాన్ని బోర్డుకు వెల్లడిస్తామని చెప్పారు. దీంతో ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియకు బ్రేక్‌ పడింది. రెండు తెలుగు రాష్ట్రాలూ తమ అభిప్రాయాలను వెల్లడించినందున ఇప్పుడు తుది అడుగు వేయాల్సిన బాధ్యత కేఆర్‌ఎంబీపైనే ఉంది. రాష్ట్రాలు ప్రాజెక్టులు అప్పగిస్తేనే తాము వాటి యాజమాన్య నిర్వహణ చూస్తామని కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ స్పష్టం చేశాయి. విద్యుత్కేంద్రాలు మినహాయించి ప్రాజెక్టులు అప్పగిస్తామంటూ తెలంగాణ ఎదురుతిరగ్గా, ప్రాజెక్టులను ఏకకాలంలో బోర్డుల పరిధిలోకి తీసుకోవాలని ఏపీ షరతు విధించింది.


ఈ నేపథ్యంలో బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకొనే ప్రక్రియ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా తయారైందని జల వనరుల శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్కేంద్రాలతో సహా ప్రాజెక్టులను తెలంగాణ అప్పగిస్తేనే తమ పరిధిలోని ప్రాజెక్టులను ఇస్తామంటూ ఉత్తర్వును జారీ చేశామని ఏపీ గుర్తు చేస్తోంది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ కోర్టుల్లో బంతి ఉన్నందున ఇక వారే నిర్ణయం తీసుకోవాలంటోంది. కానీ విద్యుదుత్పత్తి సంస్థలను అప్పగించేది లేదని తెలంగాణ తెగేసి చెబుతోంది. ఈ నేపథ్యంలో కేఆర్‌ఎంబీ తన స్పందనను 18న తెలియజేసే అవకాశం ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అట్టహాసంగా మొదలైన ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియ ఇప్పట్లో కదిలేలా కనిపించడం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2021-10-17T08:33:36+05:30 IST