4 నెలలు.. 439 టీఎంసీలు.. వరద లేకున్నా కృష్ణా జలాలు కడలిపాలు

ABN , First Publish Date - 2021-10-25T07:44:18+05:30 IST

4 నెలలు.. 439 టీఎంసీలు.. వరద లేకున్నా కృష్ణా జలాలు కడలిపాలు

4 నెలలు.. 439 టీఎంసీలు.. వరద లేకున్నా కృష్ణా జలాలు కడలిపాలు

ప్రకాశం బ్యారేజీలో నిల్వ 3 టీఎంసీలే

మిగతా నీటిని ఒడిసిపట్టే దిక్కేదీ?

దిగువన మినీ ఆనకట్టలపై వట్టి మాటలే

డీపీఆర్‌ రూపకల్పనకు ఆదేశాలు

అయినా ముందుకు కదలని వైనం


కృష్ణా జలాల నిల్వపై నేరపూరిత నిర్లక్ష్యం కొనసాగుతోంది. సాగు, తాగునీటి కోసం నిల్వ చేయాలన్న స్పృహ పాలకుల్లో పూర్తిగా కొరవడింది. ఫలితంగా వరదలు లేని సమయంలో సైతం కృష్ణమ్మ వడివడిగా వృథాగా కడలిలో కలసిపోతోంది.


(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన కృష్ణమ్మ ఉరకలేస్తోంది. జలకళ ఆనందం కలిగించే అంశమే. కానీ ఇది నాణేనికి ఒకవైపే. రెండో వైపు అంతుతెలియని ఆవేదన కనబడుతోంది. వరదలు వచ్చిన సమయంలో నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయడం ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే. కానీ ఇప్పుడు వరదలు లేకపోయినా అన్యాయంగా నీరంతా సముద్రం పాలవుతోంది. ఒక రోజు కాదు... ఒక నెల కాదు.. ఏకంగా నాలుగు నెలల నుంచి నిరంతరాయంగా ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణమ్మ ఉరకలేసుకుంటూ వెళ్లి సముద్రుడిలో కలుస్తోంది. ఈ 4 నెలల్లో ఇప్పటి వరకు 439.19 టీఎంసీల నీరు కడలిపాలైనట్లు జలవనరుల శాఖ లెక్కలు తేల్చింది. అయితే ఇంకా ఎక్కువే వృథాగా పోయిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసుకునే సౌకర్యం లేకపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు అధికారులు సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. బ్యారేజీ పూర్తిస్థాయి సామర్థ్యం 3.07 టీఎంసీలు. ఇంతకుమించి చుక్క కూడా నిల్వ చేసే పరిస్థితి లేదు. బ్యారేజీ ఎగువన పులిచింతల, నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీశైలం గేట్లు ఎత్తితే ఆ నీరు సాగర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి వదిలితే పులిచింతలకు వస్తుంది. ఇక్కడ నీటి సామర్థ్యం పూర్తిస్థాయిలో ఉంటే మిగిలిన నీరు మొత్తం బ్యారేజీకి వస్తోంది. ఇది కాకుండా వర్షాలు పడినప్పుడు పాలేరు, మధిర, కట్టలేరు, కీసర వాగుల నుంచి నీరు వస్తోంది. పులిచింతలకు దిగువన నిల్వ చేసుకునే దిక్కులేక ఏటా వరదల సమయంలో 5-6లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది.


తెలంగాణ జల విద్యుదుత్పత్తితో ఆరంభం

పులిచింతల వద్ద నీటి ప్రాజెక్టుతోపాటు జలవిద్యుదుత్పాదన కేంద్రం ఉంది. సాధారణంగా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సాగు, తాగు అవసరాలకు మొదటి ప్రాధాన్యంగా వినియోగించాలి. తర్వాత విద్యుదుత్పత్తికి ఉపయోగించాలి. నీరు నిల్వ ఉండే పులిచింతల ప్రాజెక్టు ఆంధ్రలో ఉండగా.. విద్యుదుత్పత్తి ప్లాంటు తెలంగాణ భూభాగంలో ఉంది. తెలంగాణ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని విడుదల చేస్తోంది. ఆ నీరు పులిచింతలకు చేరుకుని, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకే వస్తోంది. జూలై నెలలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా కొనసాగిస్తోంది. ఈ నీటితోపాటు ఎగువ ప్రాజెక్టుల నుంచి వచ్చే ఇన్‌ఫ్లో తోడవుతోంది. తాజాగా ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి 37 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. 18,500 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. కృష్ణా జలాలు సమద్రం పాలుకాకుండా బ్యారేజీకి 20 కిలోమీటర్ల దిగువన చోడవరం వద్ద ఒక బెలూన్‌ బ్యారేజ్‌ని నిర్మించాలని నాటి టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చోడవరంతో పాటు దిగువన శ్రీకాకుళం వద్ద రెండు మినీ బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదికల రూపకల్పను నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వీటికి ఇంతవరకు అతీగతీ లేదు. మినీ ఆనకట్టలను త్వరితగతిన పూర్తిచేస్తే ఎంతోకొంత నీటిని పొదుపు చేసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-10-25T07:44:18+05:30 IST