Abn logo
Oct 25 2021 @ 02:40AM

ఇదేం పోలీసింగ్‌?!

ఏపీ పోలీసులా? వైసీపీ పోలీసులా?! 

వైసీపీ నేతల సేవలో తరిస్తున్న ఖాకీలు 

కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా వన్‌సైడే 

ప్రతిపక్ష నేత నుంచి సామాన్యుడి వరకూ దక్కని న్యాయం

హైకోర్టు న్యాయమూర్తులను దూషించినా చర్యలకు తాత్సారం 

అధికార పక్షాన్ని విమర్శిస్తే తలుపులు బద్దలు కొట్టి అరెస్టులు 

కళ్లముందు దాడి గురించి ముందుగా తెలీదన్న పోలీసు బాస్‌ 

నిత్యం కోర్టులతో అక్షింతలు 


అధికార పక్షానికి సలాం... ప్రతిపక్షానికి సంకెళ్లు... న్యాయం కోరి వచ్చిన సామాన్యుడికి బెదిరింపులు... ప్రశ్నించిన మీడియాకు నోటీసులు... ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసుల తీరు ఇదీ...! వైసీపీ నేతల సేవలో ఖాకీలు తరించిపోతున్నారు. మన పోలీసులు దారి తప్పారన్న విషయాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా పదేపదే చెబుతోంది. చట్ట నిబంధనలు అడ్డగోలుగా ఉల్లంఘిస్తూ కోర్టులతో నిత్యం మొట్టికాయలు వేయించుకుంటున్నా వారి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా....’’ అని రాష్ట్ర పోలీసులు తరచూ చెబుతుంటారు. మిగిలిన అంశాల మాట ఎలా ఉన్నా... కోర్టులతో ఎక్కువసార్లు అక్షింతలు వేయుంచుకున్న జాబితాలో మాత్రం దేశంలో ఏపీ పోలీసులదే మొదటిస్థానం. అధికార వైసీపీని ప్రశ్నిస్తూ ఎవరైనా పోస్ట్‌ పెడితే చాలు... గంటల వ్యవధిలోనే వారిని వెతికి పట్టుకుని అరెస్టు చేస్తారు. అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మొత్తం న్యాయవ్యవస్థపైనే వైసీపీ అభిమానులు సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, దూషణలకు దిగి నెలలు గడిచినా పట్టించుకోరు. పైగా సదరు వ్యక్తుల ఆచూకీ కనిపించడం లేదని కోర్టుకు సమాధానం చెబుతారు. వైసీపీ పెద్దలను విమర్శించిన ప్రతిపక్ష నాయకులను అర్ధరాత్రి వారి ఇంటి తలుపులు బద్దలు కొట్టి, ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండానే తీసుకొచ్చి లోపలేస్తారు. పోనీ సామాన్యులకైనా న్యాయం చేస్తారా అంటే అదీ అంతంతమాత్రమే. చివరకు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న నాయకుడి ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే దండయాత్ర  చేస్తే... అది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అంటూ స్వయంగా పోలీస్‌ బాస్‌ వెనకేసుకొచ్చారు. దీనిబట్టి రాష్ట్రంలో పోలీసింగ్‌ ఎలా ఉందో స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి బహిరంగంగా సూచన చేసిన సొంత పార్టీ ఎంపీని పొరుగు రాష్ట్రం నుంచి తీసుకొచ్చి అరెస్ట్‌ చేసిన ఏపీ పోలీసులు.... రాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ పక్కనే ఉన్న ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయంపై పట్టపగలు దాడి జరిగితే... దానిగురించి తమకు ముందుగా తెలియదని మీడియా సమావేశంలో డీజీపీ  చెప్పడంతో పాత్రికేయులే విస్తుపోయారు. కళ్లెదుటే జరుగుతున్న దౌర్జన్యకాండ గురించి తెలియలేదంటే ఇక మారుమూల ప్రాంతాల్లో ఏదైనా జరిగితే పరిస్థితి ఏమిటని ముక్కున వేలేసుకున్నారు. ప్రజల తరపున మాట్లాడే ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేసి నోరు మూయిస్తున్న పోలీసులు... అధికార పార్టీ అరాచకాలపై పత్రికల్లో వార్తలు రాసిన పాత్రికేయులకు నోటీసులిచ్చి వేధిస్తున్నారు. 


దళితుడికి శిరోముండనం 

రాజమహేంద్రవరానికి చెందిన దళిత యువకుడు అధికార నేతల అక్రమ ఇసుక రవాణాకు అడ్డుపడ్డారు. ఆగ్రహించిన వైసీపీ నేత స్థానిక ఎస్‌ఐకి చెప్పి అతన్ని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాది, శిరోముండనం చేయించారు. బాధితుడు రాష్ట్రపతికి విన్నవించుకోవడంతో పోలీసులపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం... వైసీపీ నేతపై మాత్రం కేసు నమోదు చేయలేదు. ఇసుక లారీలకు ఎవరైనా అడ్డొస్తే తొక్కించేయమని డ్రైవర్లకు చెప్పానంటూ బహిరంగంగా మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిపైనా కేసు పెట్టలేదు. ఇసుక లారీలు అడ్డుకున్న సీఐని బూతులు తిట్టిన రాజధాని ప్రాంత మహిళా ఎమ్మేల్యేని సర్కారు వెనకేసుకు రావడం విశేషం. 


ముస్లిం కుటుంబానికి ఎన్‌కౌంటర్‌ బెదిరింపు 

భూ ఆక్రమణ వ్యవహారంలో న్యాయం చేయాలని సీఎం సొంత జిల్లా కడపలోని మైదుకూరు పోలీసుల్ని  అక్బర్‌ బాషా కుటుంబం వేడుకుంది. న్యాయం జరగక పోవడంతో ఎస్పీకి విన్నవించుకున్నారు. ఆయన వారిని సీఐ వద్దకు పంపారు. అధికార పార్టీ నాయకుడిపై ఫిర్యాదు చేస్తే ఎన్‌కౌంటర్‌ చేస్తా అని సీఐ బెదిరించడంతో ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇక కర్నూలులో వైసీపీ నేత ఆటోలో డబ్బులు పోగొట్టుకుంటే డ్రైవర్‌ అబ్దుల్‌ సలామ్‌ను అనుమానించి పోలీసులు వేధించారు. తట్టుకోలేక భార్యాబిడ్డలతో సహా రైలుకింద పడి నలుగురూ ప్రాణాలు వదిలారు. 


ముందుగా చెప్పి మరీ దాడి

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటిపైకి వస్తానంటూ ఒకరోజు ముందే సోషల్‌ మీడియాలో హెచ్చరించి మరీ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ భారీ కాన్వాయ్‌తో దండయాత్ర చేశారు. ఆయన్ను అడ్డుకోని పోలీసులు... ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని కోరేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ నేతలపై రివర్స్‌ కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్‌తో ఫిర్యాదు ఇప్పించి టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేని మాత్రం అరెస్ట్‌ చేయలేదు. దీంతో నెల తిరక్కుండానే టీడీపీ కార్యాలయంపై వందలాది మంది దాడి చేశారు. ఎస్సీలపై అట్రాసిటీ కేసు పెట్టడానికి వీల్లేదని చట్టం చెబుతోంది. ఇదే విషయాన్ని అమరావతి దళిత రైతుల విషయంలో పోలీసులకు హైకోర్టు గట్టిగా గుర్తుచేసింది. అయినా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌పై తాజాగా అట్రాసిటీ కేసు నమోదు చేశారు.


చట్టం వారికిచుట్టం 

రాజ్యాంగాధిపతిగా ఉన్న తననే దూషించారంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాటల్లో మర్మాన్ని గ్రహించిన పోలీసులు వెంటనే పట్టాభిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత ప్రజాగ్రహ దీక్షలో వైసీపీ నేతలు చాలామంది బూతులు మాట్లాడినా చర్యలు లేవు. ఏడేళ్ల లోపు శిక్షపడే కేసుల్లో 41ఏ కింద నోటీసులు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. కానీ పెట్టీ కేసుల్లో సైతం నచ్చనివారి ఇంటికి అర్ధరాత్రి వచ్చి పోలీసులు లాక్కెళ్తున్నారు. నిబంధనలు పాటించడం లేదంటూ అక్షింతలు వేస్తున్న కోర్టులు... నిందితులకు వెంటనే బెయిలు మంజూరు చేస్తున్నాయి. అలాగే టీడీపీ కార్యాలయంపై మారణాయుధాలతో దాడిచేసిన వారికి 41ఏ కింద నోటీసులిచ్చి వదిలేశారు. పదిమందిని అరెస్టు చేసినా అసలైన వారి జోలికి మాత్రం వెళ్లలేదు. ‘‘అసలైనవారి జోలికి వెళితే అధికార పార్టీ పెద్దలకు కోపం వస్తుంది. మా వాళ్ల పోస్ట్‌ ఊడుతుంది’’ అంటూ కొందరు పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు.


పట్టాభికి ఒక చట్టం.. 

మంత్రికి మరో చట్టం

సీఎం జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇష్టానుసారంగా మాట్లాడారంటూ కొన్ని గంటల్లోనే కేసు నమోదు చేసిన పోలీసులు... విజయవాడలోని ఆయన ఇంటికొచ్చి రాత్రివేళ తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్‌ చేశారు. కానీ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు నేతలు ఏడాది క్రితం ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఫిర్యాదు చేసినా ఎక్కడా పోలీసులు కనీసం నోటీసు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై చిందులు తొక్కిన మంత్రి పేర్ని నాని, ఇతర నేతలకు నోటీసులు కూడా ఇవ్వలేదు. 


మీసం ఇప్పుడు తిప్పలేరా? 

ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎక్కువగా డీజీపీ సవాంగ్‌నే ప్రశ్నిస్తుంటారు. అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య వంటి నేతలు కూడా ఐపీఎస్‌ అధికారులనే ప్రశ్నించారు. వారి వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అధికారుల సంఘం నేతలు మీసం మెలేసి తొడ కొడతారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంత అవమానించినా కనీసం స్పందించరు. దీనిపై పోలీసు అధికారులు, సంఘం నేతలకు ప్రజల నుంచి పలు ప్రశ్నలు వస్తున్నాయి.