అడ్డగోలు వాడకమా?

ABN , First Publish Date - 2021-10-25T08:20:19+05:30 IST

అడ్డగోలు వాడకమా?

అడ్డగోలు వాడకమా?

జగనన్న కాలనీల చదును కోసం వాడిన ఉపాధి సొమ్ములు రికవరీ!

కేంద్రం ఆదేశాలతో చేయక తప్పని పరిస్థితి

లెవలింగ్‌కు 1,150 కోట్ల నిధులు

అనుమతుల్లేని పనులకు ఉపాధి సొమ్ములు వాడకూడదు

సంబంధిత అధికారుల నుంచే వసూలు

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు

చట్టంలో ఉన్న పనులే చేయాలని అన్ని రాష్ట్రాలకూ నిర్దేశం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనుమతి లేని పనులు చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోనుంది. ఈ పథకం ద్వారా చేపట్టిన ఇంటి స్థలాల చదును పనుల భారం రాష్ట్ర సర్కారుపై పడనుంది. ఉపాధి హామీ నిధులు రూ.1,150 కోట్లతో జగనన్న ఇంటి కాలనీల చదును పనులు చేపట్టారు. ఆ పనులు చేపట్టిన అధికారుల నుంచి నిధులు రికవరీ చేసి రాష్ట్ర ఉపాధి హామీ నిధుల్లో జమచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పనులకు సంబంధించి వెంటనే సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్నీ రాష్ట్రాలను ఆదేశించింది. ఇక నుంచి ఏ పనులు చేపట్టాలన్నా ఉపాధి చట్టంలో అనుమతించిన పనుల జాబితాలో ఉంటేనే మంజూరు చేయాలని పేర్కొంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఉపాధి చట్టం ప్రకారం ఇళ్ల కాలనీల చదునుకు ఆ నిధులు వినియోగించరాదు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన పేదల వ్యక్తిగత ఇంటి నివాస స్థలాల చదునుకు నిధులు వినియోగించుకునే అవకాశముంది. అది కూడా ఆయా కుటుంబాలకు కేటాయించిన 100 రోజుల పనిదినాల్లో పని చేసుకోవాలి. ఇందుకు యంత్రాలు వినియోగించరాదు. ఆయా కుటుంబాలు వ్యక్తిగతంగా మాత్రమే పనిచేసుకోవాలి. అందుకు అవసరమైన రవాణాకు కొద్దిపాటి మెటీరియల్‌ నిధులు వినియోగించుకోవచ్చు. 


అనుమతి లేకున్నా పనులు

ఉపాధి చట్టంలో షెడ్యూల్‌-1లో సూచించిన పనుల జాబితాలో ఇంటి కాలనీల చదును పనులు లేవు. అయినా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అత్యుత్సాహంతో జగనన్న ఇంటి కాలనీల చదును పనులకు ఉపాధి పథకంలో అనుమతించారు. దేశంలో పలు చోట్ల ఇలాంటి అనుమతిలేని పనులు చేపట్టారం టూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గుర్తించింది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే అలాంటి అనుమతిలేని పనులు మంజూరు చేసి, చేపట్టి ఉంటే.. అందుకు బాధ్యులైన ప్రోగ్రాం అధికారి/ఏజెన్సీ నుంచి ఆ పనులకు సంబంధించిన నిధులను రికవరీ చేసి ఆయా రాష్ట్రాల ఉపాధి హామీ పథకం నిధుల ఖాతాలో జమచేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్రంలో అనుమతి లేని జగనన్న ఇంటి స్థలాల లెవలింగ్‌ పనులకు సంబంధించిన రికవరీ అధికారులపై పడనుంది.  

ఉపాధి హామీ పథకం చట్టంలోని షెడ్యూల్‌-1 ప్రకారం 45 రకాల కేటగిరీల్లో 262 రకాల పనులు చేపట్టేందుకు అనుమతి ఉంది. అదే అంశాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన 2020-21 మాస్టర్‌ సర్క్యులర్‌లో పేర్కొంది. వాటిలో 182 పనులు సహజ వనరుల అభివృద్ధి కాగా అందులో 85 పనులు నీటికి సంబంధించినవి ఉన్నాయి. 164 పనులు వ్యవసాయ దాని అనుబంధ రంగాలకు సంబంధించిన పనులున్నాయి. ఈ పనులు మినహా ఇతర ఏ పనులు చేపట్టినా ఆ నిధులను ఆయా ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. 


కూలీల పథకంలోనూ దోపిడీ 

రాష్ట్రంలో పేదల ఇంటి స్థలాల కేటాయింపుల్లోనే కాకుండా ఆ భూమిని చదును చేసే పనుల్లోనూ దోపిడీకి తెరతీశారు. ఇంటి స్థలాల చదును పనులు వైసీపీ మం డల, గ్రామ స్థాయి నేతలకు కల్పతరువుగా మారాయన్న విమర్శలు వస్తున్నాయి. ఉపాధి పథకం కింద చేపట్టిన ఈ పనుల్లో అధిక అంచనాలు రూపొందించి నేతలకు దోచిపెట్టేందుకు మార్గం సుగమం చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. సిమెంట్‌, ఇటుకలు కొన్నట్లుగానే.. మట్టిని కొనుగోలు చేస్తున్నట్లు ఎస్టిమేట్లలో చూపించి సుమారు రూ.1560 కోట్ల మేర ఉపాధి నిధులను వైసీపీ నేతలు జేబుల్లో వేసుకున్నారని ఫిర్యాదులొచ్చాయి. ప్రభుత్వ భూముల నుంచి తవ్వి తెచ్చిన మట్టిని కొనుగోలు చేసినట్లు చూపించి స్వాహా చేస్తున్నారని ఆరోపణలున్నాయి.  


‘మట్టి’ కొనుగోలు స్కాం 

ప్రభుత్వ స్థలంలో మట్టిని తెచ్చి దానిని కొనుగోలు చేసినట్లు బిల్లులు చేసుకునే వినూత్న దోపిడీ ప్రక్రియ ఈ పనులతోనే ప్రారంభమైందంటున్నారు. ఇంటి స్థలాల చదును చేసేందుకు ఒక్కో ఎకరాకు సుమారు 4 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి అవసరమవుతోందని అంచనాలు వేశారు. ఇందుకోసం ఒక్కో క్యూబిక్‌ మీటర్‌కు రూ.230 నుంచి రూ.300 దాకా రేట్లు నిర్ణయించి ఎకరా స్థలం లెవలింగ్‌ చేసేందుకు సుమారు రూ.10 లక్షలకు పైగా అంచనాలు తయారు చేశారు. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఇందులో కాస్ట్‌ ఆఫ్‌ గ్రావెల్‌ అనే పేరుతో క్యూబిక్‌ మీటర్‌కు రూ.134.34 ధర నిర్ణయించారు. ఇది కాకుండా మట్టిని తీసుకురావడం, చదును చేయడం తదితర ఇతర పనులకు వేరుగా రేట్లు రూపొందించారు. మట్టిని రవాణా చేసేందుకు అనుకూలంగా చేయడాన్ని కాస్ట్‌ ఆఫ్‌ గ్రావెల్‌ అనే పదానికి అర్థంగా భాష్యం చెప్పారు. అంటే మట్టిని తవ్వి తీసే ప్రక్రియకు క్యూబిక్‌ మీటర్‌కు రూ.134.34 నిర్ణయించారు. వాస్తవానికి క్యూబిక్‌ మీటర్‌ మట్టి తవ్వి తీసేందుకు ఏ రకంగా రేట్‌ నిర్ణయించినా రూ.34కు మించదు. అంటే మిగిలిన రూ.100 ఉచితంగా ఇస్తున్నట్లే. ఒకవేళ ప్రభుత్వ భూముల నుంచి తవ్వి తీసే మట్టి రాష్ట్ర ప్రభుత్వం లేక ఆయా పంచాయతీల ఆస్తి అనుకుంటే.. ఆ నిధులు ప్రభుత్వ లేదా పంచాయతీల అక్కౌంట్లలో జమ చేయాలి. అలా కాకుండా ఆ మొత్తాన్ని పనులు చేపట్టిన వైసీపీ నేతలు, కార్యకర్తలకు చెల్లిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2850 పనులకు సంబంధించి 45 వేల ఎకరాలను లెవలింగ్‌ చేసి ఇంటి స్థలాలకు అనుకూలం గా మార్చేందుకు ఉపాధి నిధులు రూ.1132 కోట్లు దాకా ఖర్చుచేశారు. ఈ పనులను 60ు  కూలీల చేత చేయించి, మిగిలిన 40ు మెటీరియల్‌ నిధులు వాడాల్సి ఉంది. అయితే  యంత్రాలు వినియోగించి మొత్తం మెటీరియల్‌ కింద పనులు చేపట్టారు. 


నిబంధనలకు విరుద్ధంగా పనులు 

ఉపాధి హామీ పథకం కూలీల కోసం ఉద్దేశించినది. ఈ పథకం  ద్వారా చేపట్టే పనులన్నీ కూలీలకు పనులు కల్పించేవిగాను, ప్రజల ఉమ్మడి ఆస్తులు సమకూర్చేవిగా మాత్రమే ఉండాలి. ఈ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోను మెషిన్లు వాడరాదు. కూలీలు చేపట్టేందుకు అనుకూలంగా లేని సందర్భంలోనే ట్రాక్టర్లు, రోలర్లు, తదితర కొన్ని సూచించిన యంత్రాలను మాత్రమే వినియోగించాలి. ఉపాధి హామీ పథకంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. జేసీబీ, ప్రొక్లెయన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదు. అయితే కూలీలతోనే చేపట్టడం ద్వారా యుద్ధప్రాతిపదిక పనులు చేపట్టలేమనే కారణంతో నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ మెటీరియల్‌ నిధుల కింద చేపట్టారు. మెషిన్లు వాడితే ఫిర్యాదులొస్తాయన్న ఉద్దేశంతో కాస్ట్‌ ఆఫ్‌ గ్రావెల్‌ను ఎస్టిమేట్‌లో చేర్చారు. గ్రావెల్‌ను ఎలా తెచ్చినా అభ్యంతరం లేదంటూ, గ్రావెల్‌ను ఒక వస్తువుగా కొనుగోలు చేస్తున్నట్లు భాష్యం చెప్పారు.  దీంతో ఈ పనుల్లో మెషిన్లు యథేచ్ఛగా పనిచేశాయి. ఈ పనుల్లో కూలీల భాగస్వామ్యం 10 శాతం కూడా లేకపోవడం గమనార్హం.  

Updated Date - 2021-10-25T08:20:19+05:30 IST