Abn logo
Oct 25 2021 @ 03:25AM

నీ అన్న కేసులపై మాట్లాడు!

నా కేసుపై మాట్లాడితే  లాభం లేదు

షర్మిలకు రేవంత్‌రెడ్డి సలహా

‘హెటిరో’తో కేటీఆర్‌కు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు

ఇద్దరు సీఎంల పిలకలూ అమిత్‌ షా చేతిలోనే

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో టీపీసీసీ నేత వ్యాఖ్యలు


వందల మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ తన రాచరిక పోకడలతో నాశనం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల.. తన అన్నపై ఉన్న కేసుల గురించి మాట్లాడడం లేదని.. తనపై ఉన్న కేసు గురించే మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్‌ను ఓడించి.. ఆయన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే తన ఆశయమని ప్రకటించారు. వచ్చే ఏడాది డిసెంబరులోనే ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పారు. ఈ మేరకు ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో రేవంత్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 


ఆర్కే: చాలా రోజుల తరువాత కలుస్తున్నాం. టెన్షనా.. సాధించానన్న సంతోషం ఉందా?

రేవంత్‌: దీనిని (పీసీసీ అధ్యక్షుడు కావడాన్ని) రెండు రకాలుగా చూడొచ్చు. కాంగ్రెస్‌ పార్టీపరంగా అత్యంత పెద్ద విజయం. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కావడమైనా సులభమేమో కానీ, కాంగ్రె్‌సలో ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడు కావడం ఆషామాషీ కాదు. 


అందరూ చంద్రబాబు ఇప్పించారనిఅంటున్నారు.. కానీ, కేసీఆర్‌ పుణ్యానే వచ్చినట్లుంది!

కేసీఆర్‌ సృష్టించిన వాతావరణం ఇందుకు కారణం. ఈ విషయంలో ఏకీభవిస్తాను. 


చంద్రబాబు.. రాహుల్‌గాంధీకిఏమైనా చెప్పారా?

సాధారణంగా ఎవరైనా నాయకుడు ఓ పార్టీని వీడి వెళ్లేటప్పుడు అప్పటిదాకా పనిచేసిన పార్టీని, ఎదుగుదలకు కారణమైన నాయకులను దూషించి వెళ్లిపోతాడు. నేనలా చేయలేదు. నా ఎదుగుదలకు టీడీపీయే కారణం. దానిని చూసే నన్ను కాంగ్రెస్‌ ఆహ్వానించింది. నేను ఉన్న పరిస్థితులను, ఆ పార్టీలో పనిచేయలేని స్థితిని చంద్రబాబుకు గౌరవంగా వివరించి పార్టీని వీడాను. ఆ తరువాత అందరూ ఊహించినట్లు చిల్లర మాటలు మాట్లాడకుండా నా స్థానంలో నేనున్నాను. నేను ఉన్న పార్టీకి పనిచేసుకుంటూ వెళ్లాను. దీంతో నా వెనక బాబే ఉన్నారని, లేదంటే నేను ఆయనను తిట్టేవాడిని కదా అంటున్నారు. 


రేవంత్‌రెడ్డి పిలక కేసీఆర్‌ చేతిలో ఉందని షర్మిల అన్నారు. ఓటుకు నోటు కేసులో ఏమైనా చేస్తే!

ఎవరైనా చట్ట పరిధిలో ఉండాల్సిందే. సర్పంచ్‌ నుంచి ఎంపీ దాకా ఓట్లు వేయాలంటూ ఓటర్లకు డబ్బులిస్తున్నట్లు కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులేవీ పీసీ యాక్ట్‌ కిందికి రాకుండా నా ఒక్క కేసే ఎందుకు పోయింది? షర్మిల సొంత అన్నపై ఉన్న లెక్కలేనన్ని కేసుల గురించి మాట్లాడకుండా నా కేసు గురిం చి మాట్లాడితే ప్రయోజనం లేదు. తెలంగాణ లో ఆమె పార్టీ నిలదొక్కుకోవాలంటే ముందుగా ఏపీతో జల వివాదాలపై మాట్లాడాలి. 


రెండు రాష్ట్రాలూ కలిసి తమ పిలకను కేంద్రం చేతిలో పెట్టాయి. షర్మిల తెలంగాణలో అడుగుపెట్టడం వల్లే కేసీఆర్‌ ఈ పరిస్థితికి కారణమయ్యారనుకోవచ్చు కదా!

చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడే కేసీఆర్‌ ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు అక్రమ ప్రాజెక్టులు అనాల్సిన అవసరం ఉండకపోయేది. తెలంగాణకు కేసీఆర్‌ చేసిన ద్రోహం ఇది. అనుమతుల్లేని ప్రాజెక్టులు కడుతున్నందుకు ముఖ్యమంత్రులను ప్రాసిక్యూట్‌ చేసే వీలుంటుంది. ఆ రకంగా ఈ ఇద్దరు సీఎంల పిలకలు అమిత్‌ షా చేతిలో ఉన్నాయి. ఆయన తలచుకుంటే కేసీఆర్‌ను ఒక్క నిమిషంలో బేడీలు వేసి నడిపించుకొని తీసుకుపోవచ్చు. దేశంలో సొంత పార్టీ ముఖ్యమంత్రుల మీద, ప్రతిపక్ష నేతల మీద, వారి కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టిన ప్రధాని మోదీ, అమిత్‌ షా.. కేసీఆర్‌ మీద, ఆయన కుటుంబం మీద మాత్రం ఒక్క కేసు కూడా పెట్టడం లేదు. గతంలో ఉన్న సహారా, ప్రావిడెంట్‌ ఫండ్‌ వంటి కేసులపై సీబీఐ చార్జిషీట్‌ వేయడంలేదు. ఈ ఫైలు కోసం మా లాయర్లు కోర్టులో రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా దొరకడంలేదు. 


ఎన్నికలు వచ్చే ఏడాదే అంటున్నారు? 

వంద శాతం వచ్చే ఏడాదే వస్తాయి. ముందస్తు లేదని కేసీఆర్‌ అంటున్నారంటే ఉన్నాయనే అర్థం. పరిపాలనపై దృష్టి పెట్టాల్సి న కేసీఆర్‌.. పార్టీపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడా ది డిసెంబరులో ఎన్నికలు ఖాయం. 2022 ఆగ స్టు 15న భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం తరువాత అసెంబ్లీ సమావేశం పెట్టి ప్రభుత్వా న్ని రద్దు చేస్తారు. గుజరాత్‌ ఎన్నికలతోపాటే తెలంగాణకూ ఎన్నికలు నిర్వహించే పరిస్థితిని ఎన్నికల కమిషన్‌కు కల్పిస్తారు.


కాంగ్రెస్‌ పార్టీలో మిగతా వారిని సమన్వయం చేసుకోవడం కష్టం కదా! ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోండనే స్టేట్‌మెంట్‌ ఎలా ఇవ్వగలిగావు? 

నాకు స్పష్టత ఉంది. మిగతా వారికి కూడా స్పష్టత ఉండాలని కోరుకుంటున్నా. కేసీఆర్‌తో చేసేది యుద్ధం. ఈసారి ఎన్నికల్లో అధికారం రాకపోతే చాలామందికి వయసు, రాజకీయం ఏవీ సహకరించవు. అందరికీ అదే చెబుతున్నా. ఆ తరువాత మనం మనం తిట్టుకున్నా ప్రయోజనం ఉండదని చెబుతున్నా. సర్ది చెప్పే బాధ్యతను జానారెడ్డి లాంటి వారు చూసుకుంటారు. నేనైతే పరిగెత్తుతా. నాతోపాటు పరిగెత్తలేనివారు కిందపడిపోతారు. 


కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే రేవంత్‌ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పొచ్చా?

అదేం లేదు. నేనే కావాలని కోరుకోవడంలేదు. పార్టీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారని నిర్ణయిస్తే వారి పేరును నేనే మొదట ప్రతిపాదిస్తాను. అధికారం నన్ను ఆకర్షించదు.


కేసీఆర్‌ను కూడా వేల కోట్లు అంటున్నారు.. అలా ఉంటాయా? హెటిరో బ్లాక్‌మనీగా చెప్పిందంతా కలిపి 150 కోట్లే దొరికింది కదా!

రెమ్‌డెసివర్‌ బ్లాక్‌మార్కెట్‌పై హెటిరో గురించి నేను ముందే చెప్పాను. ఇప్పుడది బయటపడింది కదా! అది పేద ప్రజల సొమ్ము. కరోనా సమయంలో పేద ప్రజలను పీల్చి పిప్పి చేసి, బ్లాక్‌లో అమ్మి వసూలు చేసుకు న్న సొమ్ము. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, కేటీఆర్‌కు వారితో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారా లు ఉన్నాయి. ఇవన్నీ నేను చెబితే అప్పు డు కూడా నేను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నానన్నారు.


బ్లాక్‌మెయిలర్‌ అని ఆరోపిస్తుంటారు కదా?

నేనెప్పుడూ ప్రతిపక్షంలోనే ఉన్నాను. బ్లాక్‌మెయిల్‌ చేస్తే ప్రభుత్వాలు నన్ను లోపల వేయకపోయేవా? ప్రభుత్వాలకు కూడా దొరకనంత తెలివితేటలున్నాయా? తప్పు చేసినవాడు తప్పించుకునేందుకు నేను బ్లాక్‌మెయిల్‌ చేశానని ఆరోపిస్తుంటాడు. కొన్నిసార్లు అసూయ, ద్వేషంతో అంటుంటారు. వారు చెప్పేది నమ్మితే ప్రజలు ఆదరించరు. నేను అధికారంలో లేకపోయినా.. పిలుపు ఇస్తే వేల మంది తరలివస్తున్నారు. ఇదొక్కటి చాలు నన్ను ముందుకు నడిపించడానికి. మీటింగ్‌ల పేరుమీద భారీగా కూడబెట్టారని అనేవారూ ఉన్నారు.