అనంతలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-10-25T09:22:25+05:30 IST

అనంతలో భారీ వర్షం

అనంతలో భారీ వర్షం

పొంగిపొర్లిన వాగులు, వంకలు 

నీటమునిగిన శనగ.. రైతుకు భారీ నష్టం 

పిడుగుపాటుకు ఇద్దరు మృతి 


అనంతపురం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన కర్ణాటకలో కురిసిన వర్షాలకు జిల్లాలోని హిందూపురం ప్రాంతంలోని పెన్నా, పాపాగ్ని నదులు వరద నీటితో పరవళ్లు తొక్కాయి. తనకల్లు వద్ద పాపాగ్ని ప్రవాహానికి అటుగా వెళుతున్న ట్రాక్టర్‌ నదిలో పడిపోయింది. స్థానికులు డ్రైవర్‌ను తాడులో తాగి కాపాడారు. జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి, ఆదివారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం 58 మండలాల్లో 17.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. యాడికి మండలం బోగాలకట్టలో 200 ఎకరాల్లో పప్పుశనగ పంట నీటమునిగి రూ.20 లక్షల దాకా పంటనష్టం జరిగింది. ఇదే మండలంలో 500 ఎకరాల్లో పప్పుశనగ పంట అధిక వర్షాలకు నల్లగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా 15వేల హెక్టార్లల్లో పప్పుశనగ సాగు చేశారు. వరుస వర్షాలకు వేరుకుళ్లు సోకి పంట దెబ్బతినే ప్రమాదముందని బాధిత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లివంక తాండాలో పిడుగుపాటుకు గొర్రెల కాపర్లు మోహన్‌నాయక్‌(44), బోయ తిమ్మన్న (70) దుర్మరణం పాలయ్యారు.

Updated Date - 2021-10-25T09:22:25+05:30 IST