మంత్రి కుమారుడే ముఖ్య అతిథి!

ABN , First Publish Date - 2021-10-27T08:34:37+05:30 IST

మంత్రి కుమారుడే ముఖ్య అతిథి!

మంత్రి కుమారుడే ముఖ్య అతిథి!

మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో శిక్షణ తరగతులు

ప్రారంభించిన పేర్ని తనయుడు కృష్ణమూర్తి


మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 26: ‘‘మంత్రి కుమారుడైతే చాలా.. ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు హాజరుకావచ్చా?’’ అని కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమం చూసిన వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) కుమారుడు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) మంగళవారం మచిలీపట్నం ఆర్టీసీ డిపో డ్రైవింగ్‌ స్కూలులో 9వ బ్యాచ్‌ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఏ హోదాతో కార్యక్రమానికి హాజరయ్యారో తెలీదుగానీ.. డిపో మేనేజరు పెద్దిరాజును.. స్కూలులో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కృష్ణమూర్తి ఆరా తీశారు. 8వ బ్యాచ్‌లో శిక్షణ పొందిన 16 మందికి సర్టిఫికెట్లను అందజేశారు. అదేవిధంగా 9వ బ్యాచ్‌లో కొత్తగా చేరిన 17 మందిని పరిచయం చేసుకున్నారు. ఈ విషయంపై డిపో మేనేజరును ప్రశ్నించగా.. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్‌ ఎంవై దానం అతిథిగా హాజరు కావాల్సి ఉందని, అయితే ఎండీ వీడియో కాన్ఫరెన్స్‌ కారణంగా మంత్రి తనయుడు పేర్ని కృష్ణమూర్తిని అతిథిగా ఆహ్వానించినట్టు తెలిపారు. యువతను ప్రోత్సహించేందుకే ఆయనను పిలిచామన్నారు.కాగా, గతంలో మచిలీపట్నం కార్పొరేషన్‌ అధికారుల సమీక్షకుకూడా కృష్ణమూర్తి హాజరైన విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. 

Updated Date - 2021-10-27T08:34:37+05:30 IST