అవన్నీ ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లే! 41ఏ అమలు చేయాల్సిందే!

ABN , First Publish Date - 2021-10-27T08:52:08+05:30 IST

అవన్నీ ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లే! 41ఏ అమలు చేయాల్సిందే!

అవన్నీ ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లే! 41ఏ అమలు చేయాల్సిందే!

టీడీపీ నేతలపై కేసుల్లో హైకోర్టు ఆదేశం

కేసు రికార్డు కోర్టు ముందుంచాలని పోలీసులకు న్యాయమూర్తి ఆదేశం

ఆ ఇన్‌స్పెక్టరే టీడీపీ ఆఫీసులోకి చొరబడ్డారు

విధ్వంసం చేస్తుంటే పట్టుకుని పోలీసులకు అప్పగించారు

ఆయన సామాజిక స్థితి నిందితులకు తెలియదు

పోలీసు కేసును కొట్టివేయండి

పిటిషనర్ల తరఫు న్యాయవాది: దమ్మాలపాటి 


అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.సక్రూనాయక్‌ ఫిర్యాదు ఆధారంగా టీడీపీ నేతలపై మంగళగిరి రూరల్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో విషయంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నిబంధనలను అమలు చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. పిటిషనర్లపై నమోదైన సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్షకు అవకాశం ఉన్న నేపఽథ్యంలో అర్నేశ్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని స్పష్టంచేసింది. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని టీడీపీ కార్యాలయాలపై దాడి వెనుక కుట్ర ఉందని, బాధ్యులపై కేసు నమోదు చేయాలంటూ టీడీపీ రిసెప్షన్‌ కమిటీ సభ్యుడు వి.కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు రికార్డును కోర్టు ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ మంగళవారం ఆదేశాలిచ్చారు. టీడీపీ కార్యాలయంలో గొడవ జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్లిన తనను కులం పేరుతో దూషిస్తూ, చంపేందుకు ప్రయత్నించారంటూ డీజీపీ కార్యాలయంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జి.సక్రూనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి రూరల్‌ పోలీసులు తమపై ఐపీసీ, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ టీడీపీ నేతలు ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, టి.శ్రావణ్‌కుమార్‌, టీడీపీ నేత  పోతినేని శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.  ‘ఫిర్యాదుదారుడే అక్రమంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో చొరబడ్డాడు. ఆస్తులు ధ్వంసం చేస్తుండగా పట్టుకుని  పోలీసులకు అప్పగించారు. పిటిషనర్లు పెట్టిన కేసుకు కౌంటర్‌గా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాలు, రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్న వివరాలు భిన్నంగా ఉన్నాయి. ఇది న్యాయవిచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. ఫిర్యాదుదారుడి సామాజిక స్థితి గురించి పిటిషనర్లకు తెలియదు. ఈ నేపథ్యంలో కులం పేరుతో దూషించామనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని  పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయండి ’ అని కోరారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు  సమయం కావాలని పోలీసుల తరఫున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోరారు. ఆ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. టీడీపీ కార్యాలయం పై దాడి ఘటన విషయంలో నమోదైన కేసు రికార్డును కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.


ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే ఆ సెక్షనా?

మరోవైపు ట్రాఫిక్‌ను నిలువరించి ప్రజలకు అసౌకర్యం కలిగించారంటూ మంగళగిరి మండలం ఆత్మకూరు  వీఆర్‌వో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా టీడీపీ నేత గంజి చిరంజీవి, మరో తొమ్మిది మందిపై మంగళగిరి రూరల్‌ పోలీసులు నమోదు చేసిన కేసులోనూ 41ఏ నిబంధనలు అమలు చేయాలని న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రరాయ్‌ స్పష్టం చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే ఐపీసీ 354 (మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం) కింద కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు. ఆ సెక్షన్‌ పిటిషనర్లకు వర్తించదని స్పష్టం చేశారు.  విచారణను నాలుగువారాలు వాయిదా వేశారు.

Updated Date - 2021-10-27T08:52:08+05:30 IST