‘సర్వే’శ్వరా.. ఎందుకీ తొందర!?

ABN , First Publish Date - 2021-11-16T09:40:17+05:30 IST

‘సర్వే’శ్వరా.. ఎందుకీ తొందర!?

‘సర్వే’శ్వరా.. ఎందుకీ తొందర!?

మూడేళ్లలోనే భూముల రీ సర్వేకు సర్కారు తహతహ?

అభ్యంతరాల గడువు 60 నుంచి 30 రోజులకు కుదింపు

శాశ్వత హక్కులు గందరగోళంగా మారే పరిస్థితి

సర్కారు తీరుపై రైతుల నుంచి విమర్శలు

తొందరపాటు వద్దంటున్న సర్వే ఆఫ్‌ ఇండియా

మరిన్ని సమస్యలొస్తాయంటూ హితవు

రైతులకు నోటీసుల జారీలోనూ అదే వరస


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రసహనంగా మారింది. భూ వివాదాలను పరిష్కరించి రైతులకు శాశ్వత భూమి హక్కులు కల్పించేందుకు ప్రారంభించిన ఈ సర్వే గమనం ఏటు? దశ, దిశలేమిటి? అన్న వాటిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు తొందరపాటు నిర్ణయాలపై ఇటు రీ సర్వే నిపుణులు, అటు సర్వే ఆఫ్‌ ఇండియా పెద్దలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ సర్వే, సరిహద్దుల చట్టం-1923లో రైతుల అభ్యంతరాల దాఖలు గడువును ప్రభుత్వం 60 నుంచి30 రోజులకు కుదించడమే ఇందుకు కారణం.  సర్వే అనంతరం భూమి విస్తీర్ణం, ఇతర అంశాల్లో విభేదాలు వస్తే 60 రోజుల్లో అభ్యంతరాలు దాఖలు చేయాలని చట్టం చెబుతోంది. దీనిపై రైతులు అభ్యంతరం చెప్పినా వినకుండా హడావుడిగా ఓకే చేసేశారు. 51 గ్రామాల్లో చేపట్టిన భూ సర్వేలో సెక్షన్‌ 6(2), సెక్షన్‌ 9(2) నోటీసుల జారీలోనూ అధికారులు తీవ్ర తొందరపాటు చర్యలకు పాల్పడుతున్నారని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల రెవెన్యూ నిపుణులు జిల్లాల్లో పర్యటించినప్పుడు ఈ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయని,  కోట్లాది మంది రైతుల ప్రయోజనాలతో ముడిపడిన విషయంలో తొందరపాటుతో రైతుల్లో ఆందోళన, అలజడిని సృష్టిస్తున్నారని నిపుణులు ఇప్పటికే సర్కారు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.


అసలు పద్ధతి ఇదీ!

ఒక గ్రామంలో రీ సర్వేకు ముందు రెతులకు సర్వే, సరిహద్దుల చట్టంలోని సెక్షన్‌ 6(2) ప్రకారం నోటీసు ఇవ్వాలి. అతని సమక్షంలో భూమిని సర్వేచేయాలి. సర్వేపూర్తయ్యాక రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూమి, సర్వే అనంతరం భూమి ఒకే విధంగా ఉందా? లేదా విస్తీర్ణంలో ఏమైనా తేడాలు వచ్చాయా? తెలియజే స్తూ సెక్షన్‌ 9(2) కింద మరోసారి నోటీసు ఇవ్వాలి. ఒక వేళ భూమి విస్తీర్ణంలో తేడాలు వస్తే వాటిని సరిచేయాలని రైతు అప్పీల్‌ చేసుకోవాలి. అయితే 60 రోజులుగా ఉన్న ఈ గడువును 30కి కుదించారు. దీనిపై  రైతుకూలీ సంఘం నేత దివాకర్‌ మాట్లాడుతూ.. ‘‘సర్వే సమయంలో రైతులు, భూమి యజమానులు గ్రామంలో లేకుంటే నోటీసులు ఎవరికి ఇస్తారు? అనేక మంది రైతులు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు వలసవెళ్లిపోయారు. కొందరు తమ పిల్లలతోపాటు ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. కొందరు విదేశాల్లో నివసిస్తున్నారు. ఇలాంటి వారికి నోటీసులు ఎలా ఇస్తారు? వారి భూమిలో ఒక కర్ర ఏర్పాటుచేసి దానికి నోటీసు అంటిస్తే అది రైతుకు ఇచ్చినట్లే  అవుతుందా? 30 రోజుల్లోగా వారు వచ్చి అభ్యంతరాలు దాఖలు చేయకుంటే, ఇక వారు ఆ తర్వాత సివిల్‌ కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. దీనిపై తాము లిఖితపూర్వకంగా అభ్యంతరం తెలిపినా అధికారులు పట్టించుకోలేదు’’ అని చెప్పారు. 


నోటీసుల జారీలోనూ తొందరపాటేనా? 

భూముల రీ సర్వేకు సంబంధించి నాలుగు రకాల నోటీసులు ఇస్తుంటారు. గ్రామంలో రీ సర్వే ప్రారంభమైందని చెప్పడానికి (సెక్షన్‌ 6(1)), భూమిని సర్వేచేయడానికి(సెక్షన్‌ 6(2)), రైతు భూమి సర్వేపూర్తయాక భూమి విస్తీర్ణం, భూమి చిత్రపటం (ఎఫ్‌ఎమ్‌బీ), ఇతర వివరాలను తెలియజేస్తూ సెక్షన్‌ 9(2) కింద నోటీసు ఇస్తారు. ఒక వేళ సర్వేపై అభ్యంతరాలుంటే అప్పీల్‌ చేసుకుంటారు. గ్రామం మొత్తం మీద భూముల సర్వేపూర్తయ్యాక సెక్షన్‌ 31 కింద నోటిసు జారీ చేస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని గజిట్‌లో పొందుపరుస్తారు. అయితే, ఈ విషయంలో అధికారులు నిబంధనలను, సర్వే మాన్యువల్‌ను పాటించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు ‘‘సర్వే, సరిహద్దుల చట్టంలోని సెక్షన్‌ 6(2) ప్రకారం భూమి ఉన్న ప్రతి రైతుకూ నోటీసు ఇవ్వాలి. ఒక వేళ భూమి యజమాని లేకుంటే  కౌలుదారుకు  ఇవ్వాలి. అయితే భూమి యజమానులు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లినా, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నా గ్రామ వీఆర్‌ఓ నుంచి ఓ ధ్రువపత్రం తీసుకొని ఆ భూములకు నోటీసులు ఇచ్చినట్లుగానే రికార్డుచేస్తున్నారు. సర్వేపూర్తయ్యాక విస్తీర్ణంలో తేడాలు వస్తున్నాయి. ఇవేవీ భూ యజమానులకు తెలియడం లేదు. దీని వల్ల వారికి అన్యాయం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే మేం సర్వే, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం.’’ అని దివాకర్‌ పేర్కొన్నారు. 


అర్జంట్‌ టార్గెట్‌లు వద్దు: సర్వేఆఫ్‌ ఇండియా

భూముల సర్వేలో తొందరపాటు, అత్యవసర టార్గెట్‌లు ముందుకు తీసుకురావొద్దని సర్వే ఆఫ్‌ ఇండియా చెబుతోంది. బ్రిటీషు కాలంలో చేపట్టిన సర్వే 20 ఏళ్లకు పైగా సాగిందని, ఇనాం, ఎస్టేట్‌ గ్రామాల సర్వే 16 ఏళ్లపాటు నిర్వహించారని ఆ సంస్థ గుర్తుచేస్తోంది. ‘‘ఇప్పటికే 20కిపైగా గ్రామాలు సర్వేచేయనివి ఉన్నాయి. ఇనాం, ఎస్టేట్‌లు రద్దయినా, ఆ కేసుల పరిష్కారం ఇంకా కొనాసాగుతోంది. కాబట్టి అభ్యంతరాల గడువును తగ్గించడం, మూడేళ్లలోనే సర్వేను పూర్తిచేయాలనుకోవడం తొందరపాటు చర్యలవుతాయి. దీని వల్ల సమస్యలొస్తాయి. ప్రతి 30 ఏళ్లకోసారి చేపట్టాల్సిన సర్వేను ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత చేపడుతున్నారు. అది రైతులకు శాశ్వత భూమి హక్కులు ఇచ్చేదిగా ఉండాలి. మరిన్ని సమస్యలను సృష్టించి కోర్టుల చుట్టూ తిప్పేలా ఉండకూడదు. ఇది కోట్లాదిమంది రైతులు, భూ యజమానుల అంశం. చిటికేస్తే పనులు కావాలంటే వివాదాలు కోట్లల్లో వస్తాయి. అప్పుడు రీ సర్వే వల్ల భూ సమస్యల పరిష్కారం బదులు అనేక కొత్త సమస్యలు వెలుగుచూస్తాయి. సర్వేను ఓపికగా, నిబంధనల ప్రకారం జాగ్రత్తగా చేపట్టాలి. అప్పుడే సర్కారు లక్ష్యం నెరవేరుతుంది’’ అని సర్వే ఆఫ్‌ ఇండియా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇదే విషయం అనేక సార్లు చెప్పామని, కానీ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుందో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు.


సర్వేలో తేడా ఉందంటే కోర్టుకు వెళ్లమంటున్నారు!

‘‘మా గ్రామంలో భూమి సర్వే చేసేటప్పుడు సెక్షన్‌ 6(2) కింద నోటీసు ఇవ్వలేదు. సర్వే చేసే సమయంలోనే సెక్షన్‌ 9(1) కింద నోటీసు ఇచ్చారు. అదేమిటో మాకు తెలియక సంతకం చేశాం. సర్వే పూర్తయ్యాక మా భూమిలో 46 సెంట్లు తక్కువ వచ్చింది. పై అధికారులను కలిస్తే.. భూముల సర్వే సమయంలోనే సర్వేపూర్తయినట్లుగా, అంతా బాగుందని ఒప్పుకుంటూ 9(2) నోటీసు ఆధారంగా సంతకం తీసుకున్నారుగా అన్నారు. ఇదే విషయాన్ని తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లగా సర్వేయర్‌ను పిలిచి మాట్లాడుతానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మా భూమిని మరోసారి సర్వేచేయలేదు. మేం గట్టిగా మాట్లాడితే కోర్టుకు వెళ్లమని చెబుతున్నారు. రికార్డుల్లో ఉన్న భూమికి, రీ సర్వే రికార్డుకు తేడా ఉందంటే కోర్టుకు  వెళ్లమనడం ఏమిటి? ఇదేం రీసర్వే. ఇదే అంశాన్ని ఆయన రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేశా’’.-

- ప్రసాద రెడ్డి, రైతు, గుంటూరు రెవెన్యూ డివిజన్‌

Updated Date - 2021-11-16T09:40:17+05:30 IST