Abn logo
Nov 25 2021 @ 02:28AM

వద్దంటే ఎలా?

బోర్ల కింద వరి సాగు చేయొద్దన్న సర్కార్‌ 

ప్రత్యామ్నాయం చెప్పకుండా రైతులతో ఆటలు

ఏవి పండించాలో స్పష్టంగా చెప్పని వైనం

వద్దంటే తిండిగింజలు ఎలాగని రైతుల ప్రశ్న

కొనుగోలు చేసే పరిస్థితి ఉండదంటూ వరి 

తగ్గించాలని  రైతులపై ఆర్బీకే సిబ్బంది ఒత్తిడి

ప్రభుత్వ వైఖరిపై అన్నదాతల్లో అయోమయం

రైతుల ఇబ్బందులపై దృష్టి పెట్టని ప్రభుత్వం 

బోర్ల కింద వరి సాగు చేయొద్దని


సర్కారు చెబుతోంది. డిమాండ్‌ ఉన్న పంటలే వేయాలని రైతులకు సూచిస్తోంది. కానీ ఏ పంటలు పండించాలో స్పష్టంగా చెప్పడం లేదు. ప్రత్యామ్నాయ పంటలనూ ప్రోత్సహించడం లేదు. వరి తగ్గించాలంటూ ఆర్బీకే సిబ్బంది రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో రైతన్నలు అయోమయంలో పడ్డారు. వరి వద్దంటే తిండిగింజలు ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌లో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. బోర్ల కింద వరి వేయొద్దని జగన్‌ సర్కార్‌ సూచించడంతో సాగుపై అనిశ్చితి నెలకొంది. అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి ఈ ప్రకటన చేయడంతో రైతాంగంలో అయోమయం ఏర్పడింది. బోర్ల కింద డిమాండ్‌ ఉన్న పంటలు వేయాలని చెప్పారు కానీ దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు. ప్రత్యేకించి ఫలానా పంటలు వేయాలని చెప్పలేదు. బోర్ల కింద వరి కాకుండా ప్రత్యామ్నాయంగా ఇతర పంటలకు నేలలు అనుకూలంగా ఉండాలి. వరికి బదులు అపరాలు, చిరుధాన్యాలు పండించమంటే.. సాఽధ్యాసాధ్యాలపై రైతుల్లో అపోహలు ఉన్నాయి.


కోస్తాలో మెట్ట ప్రాంతం, సీమలో కాలువలు లేని ప్రాంతాల్లోనే బోర్ల వసతి ఉంటే వరి వేస్తారు. బోర్లకు 9 గంటల విద్యుత్‌ ఇస్తున్నామంటూనే వరి సాగు చేయొద్దనడం మెట్ట ప్రాంత రైతుల కు ఆవేదన కలిగిస్తోంది. మరోవైపు ప్రభుత్వం వరి కొనుగో లు చేసే పరిస్థితి ఉండదని, సాగు తగ్గించాలని ఆర్బీకే సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి నేరుగా ఆదేశా లు లేకపోయినా ఆర్బీకే సిబ్బంది రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. కాగా ఇటీవల మచిలీపట్నం ప్రాంతంలో ఈ ఏడాది దాళ్వా వరి  ఆపేసి, అపరాలు పండించాలని కృష్ణా జిల్లా మంత్రే రైతులకు చెప్పారు. అయితే ప్రభుత్వ పెద్దలు  ప్రత్యామ్నాయ వనరులు ఇవ్వకపోవడం వల్లే రైతులు పం ట మార్పిడిపై దృష్టి సారించలేకపోతున్నారు. ప్రభుత్వ ప్రకటనలు రైతుల్ని సందిగ్ధంలో పడేస్తున్నాయి. కొన్ని ప్రాంతా ల్లో పంట మార్పిడికి అవసరమైన పరిస్థితులు లేవని రైతు లు చెబుతున్నారు. పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వాలు.. పూర్తి స్థాయిలో కొనుగోలు చేయని నేపథ్యంలో.. రైతు ఏ పంట వేస్తే ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటన్న ప్రశ్న రైతుల కుటుంబాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రబీ సీజన్‌లో బోర్ల కింద దాదాపు 20ు (3.75 లక్షల ఎకరాలు) వరి సాగుచేస్తారని అంచనా. 


అరకొరగా ప్రభుత్వ సాయం

కేంద్రం ప్రకటించే మద్దతు ధరలు గిట్టుబాటు కావడం లేదనే వాదన రైతుల నుంచి వినిపిస్తోంది. గత రెండేళ్లుగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరగడంతో పెట్టుబడి పెరిగింది. తెగుళ్లు, విపత్తులతో నష్టం వాటిల్లుతోంది. దళారుల దెబ్బకి గిట్టుబాటు కాని ధరలు కుంగదీశాయి. కొవిడ్‌ కారణంగా కూలీల సమ స్య ఉత్పన్నకావడం, వరి నాట్ల నుంచి క్రిమి సంహారక మం దుల పిచికారి, వరి కోత, నూర్పిడి యంత్రాల అద్దెలు పెరగ డం, రాయితీపై పరికరాలు అందకపోవడం అన్నదాతలను మరింత కుంగదీస్తోంది. నిరుడు ధాన్యం అమ్మిన రైతులకు సొమ్ము చెల్లింపుల్లోనూ జాప్యం జరగడంతో వడ్డీల భారంతో సతమతమయ్యారు. ప్రకృతి అనుకూలిస్తే వరి పండించడానికి నిరుడు ఎకరానికి రూ.33 వేలు ఖర్చుకాగా, ఈ ఏడాది రూ.42 వేలు ఖర్చవుతోంది. కౌలుదారుడికైతే రూ.55 వేలవుతోంది. రైతుభరోసా, కిసాన్‌ సమ్మాన్‌ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే పెట్టుబడి సాయం అరకొరగానే ఉంటోంది. అసలు కొందరికి అందని పరిస్థితి. ముఖ్యంగా కౌలు రైతులకు..! వరి సాగులో సగానికి పైగా కౌలు రైతులే ఉండటం గమనార్హం. ఓసీ కౌలు రైతులకు సర్కార్‌ మొండిచేయి చూపుతోందని కౌలుదారులు పెదవి విరుస్తున్నారు.  


మద్దతు ధర దక్కేనా..?

రాష్ట్రంలో 2021-22 ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు ప్రభుత్వం కొత్త విధానాన్ని అవలంభిస్తోంది. ధాన్యం కొనుగోళ్లన్నీ ఆర్‌బీకేల వద్దే జరుగుతాయని ప్రకటించింది. ఈ-క్రాప్‌, కేవైసీ డేటా ఆధారంగా ధాన్య సేకరణ చేయనున్నట్లు తెలిపింది. వరి రైతులందరూ గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. సగటు నాణ్యత నిబంధనల ప్రకారం ఉంటే వెంటనే కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. తేమ 17ు, చెడిపోయిన, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యపు గింజలు 4ు, ఇతర వ్యర్థాలు నిర్ణీత మోతాదుకు మించరాదని తేల్చి చెప్పింది. కానీ ఈక్రాప్‌, కేవైసీ లేని రైతుల ధాన్యాన్ని కొనుగోలు ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో మద్దతు ధర దక్కుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లో నగదు చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపైనా నమ్మకం కుదరటం లేదని రైతులు అంటున్నారు.


పొడవు గింజ ధాన్యం తిరస్కరణ 

ప్రజా పంపిణీకి, సంక్షేమ హాస్టళ్ల కోసం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఏటా 45-50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే ఎఫ్‌సీఐ మార్గదర్శకాల మేరకు సేకరిస్తోంది. ముఖ్యంగా ఖరీ్‌ఫ(సార్వా)లో ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, ఎన్‌ఎల్‌ఆర్‌ 145, బీపీటీ రకాలనే తీసుకుంటోంది. దీంతో కామన్‌ వెరైటీలకు డిమాండ్‌ లేదు. మద్దతు ధర, ఎగుమతులు లేకపోవంతో అడిగినంతకు మిల్లర్లకే అమ్మాల్సి వస్తోంది. కాగా నా ణ్యమైన రకాల్లోనూ కొన్నింటిని పౌరసరఫరాల సంస్థ తీసుకోవడం లేదు. పైగా రంగా వర్సిటీ శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన వంగడాలనే రైతులు సాగు చేసినా, గింజ పొడువు, లావు ఉండే రకాలను ప్రభుత్వ రంగ సంస్థలే తిరస్కరిస్తున్నాయి. ఇప్పటికే 1001, 1010రకాల సాగును దాదాపుగా వ్యవపాయశాఖ వద్దంటోంది. తాజాగా 1153,1156 రకాలను కూడా వేయవద్దని అధికారులు చెబుతున్నారు. 1121రకాన్ని సూచిస్తున్నారు. వాస్తవంగా 1153, 1156 రకాలను వ్యవసాయ వర్సిటీ దాళ్వాకు సిఫార్సు చేసింది. నీరు తక్కువగా అందే ప్రాంతాలు, ఆలస్యంగా నాట్లు వేసే సమయంలోనే  వేసుకోవచ్చని చెబుతోంది. నిజానికి 1001, 1010 రకాల మాదిరిగా, పొడుగు గింజగా ఉండే 1153,1156 రకాలపైనే కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంత రైతులు కొందరు ఆసక్తి చూపుతున్నారు. పొడుగు గింజగా ఉండే ఈ ధాన్యానికి ఇత ర రాష్ట్రాల్లో డిమాండ్‌ ఉన్నా, పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో పొడవు, లావు గింజ రకాలు పండించే రైతులు తమకు దిక్కేమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీపీటీ, నెల్లూరు సన్నాలు, కర్నూలు సోనా రకాల బియ్యానికే మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నందున ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం అలాంటి వంగడాల రూపకల్పన చేయడం, రైతులకు తగినంత విత్తనం అందించడంపై దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి.  మరోవైపు రెండేళ్లుగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిరుడు, ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో కోత సమయంలో భారీ వర్షాలు కురవడంతో పంట దెబ్బతింది. రంగు మారడం, పాడవడంతో రైతులు నష్టపోయారు.  


మార్కెట్లో బియ్యం ధర ‘డబుల్‌’ 

ఈ ఏడాది గ్రేడ్‌ 1 రకం ధాన్యం క్వింటాకు రూ.1,960, కామన్‌ రకాలకు రూ.1,940గా కేంద్రంమద్దతు ధర ప్రకటించింది. క్వింటాకు 70 కిలోల బియ్యం ఉత్పత్తి అయితే రైతు దగ్గర కిలో రూ.28 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మిల్లింగ్‌, రవాణా, పన్నులు, లేబర్‌ చార్జీలన్నీ కలిపితే మార్కెట్‌లో అవే బియ్యం కిలో రూ.50- 55 చొప్పున అమ్ముతున్నారు. అంటే రైతు దగ్గర నుంచి బియ్యం వచ్చేసరికి ధర రెట్టింపు అవుతోంది. కానీ వాస్తవంగా పంట అంతటికీ మద్దతు ధర లభించడం లేదు. అయినా టోకు మార్కెట్‌లో బియ్యం ధర తగ్గడం లేదు. నాణ్యమైన(పొట్టి సన్నాలు) రకాలు కిలో రూ. 45-55 దాకా అమ్ముతుంటే, మరింత సన్నాలు రూ.75 దాకా ధర పలుకుతున్నాయి. కామన్‌ వెరైటీ బియ్యమే కిలో రూ.40పైనే ఉంటున్నాయి. ఇక రేషన్‌ కార్డులపై కిలో రూపాయికి ఇస్తున్న బియ్యాన్ని చాలా మంది కార్డుదారులు కిలో రూ.9-10కు అమ్మేస్తున్నారు. వ్యాపారులు వాటినే నాణ్యమైన బియ్యంగా మార్చి తిరిగి కిలో రూ.40-45కు అమ్ముతున్నారు. ఈ విషయంలో ప్రభు త్వం దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి.