Abn logo
Nov 25 2021 @ 02:24AM

తాకట్టులో టీచర్‌ పోస్టులు

ఉద్యోగాల భర్తీ హుళక్కే

రుణం కోసం ప్రపంచ బ్యాంకుకు తలొగ్గిన సర్కారు

నియామకాలు చేపట్టరాదని నిబంధన 

జీతభత్యాల ఖర్చు పెరగరాదని షరతు

ఒప్పంద షరతులు రహస్యం

20 వేల టీచర్‌ పోస్టులు ఖాళీ.. భర్తీ లేనట్టేనా?


‘ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా ఏర్పాట్లు చేయాలి’.. తాజాగా విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పిన మాట ఇది. ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రూ.1875 కోట్ల రుణం కోసం భవిష్యత్తులో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మంగళం పాడేందుకు సర్కారు అంగీకరించింది. ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గింది. ప్రపంచ బ్యాంకుతో తాజాగా చేసుకున్న రుణ ఒప్పందంలో మానవ వనరుల విభాగం కింద ఖర్చు పెరగకూడదనే షరతు ఉన్నట్టు సమాచారం. అంతేగాక నెలవారీ జీతాలు తదితర ఖర్చులు పెరగకూడదనే నిబంధన ఉంది. ఉపాధ్యాయ ఉద్యోగాలు కొత్తగా భర్తీ చేయకూడదనే షరతు విధించింది. ఈ షరతులకు అంగీకరించే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంపై సంతకం చేసినట్టు తెలుస్తోంది. వీటిని అత్యంత రహస్యంగా ఉంచారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 20 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అంచనా. ఈ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాల్సి ఉంది. సాధారణంగా అతి ముఖ్యమైన విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో ఉద్యోగాలను కచ్చితంగా భర్తీచేస్తారు. ఇతర ఏ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేసినా చేయకపోయినా ఈ రంగాల్లో చేయాల్సిందే. అయితే విద్యా శాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం రకరకాల మార్గాలను అనుసరిస్తోంది. ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులను ప్రభుత్వంలోకి తీసుకురావడం, పాఠశాలల విలీనం వంటి ఎత్తుగడలు వేసింది. ఎయిడెడ్‌ విలీనంపై వ్యతిరేకత రావడంతో అది కొంత వరకు నడిచి ఆగిపోయింది.


ఇక పాఠశాలల విలీనం వల్ల ఉపాధ్యాయుల కొరత తీరకపోగా చాలా చోట్ల ఉపాధ్యాయుల కొరత కనిపించింది. రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాలలు సుమారు 34 వేలు. వీటిలో దాదాపు 11 వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలే. అంటే ఒకటి నుంచి ఐదు వరకు తరగతులనూ ఒకరే ఉపాధ్యాయుడు చూసుకోవాలి. విద్యార్థులందరికీ  ఆయన ఒక్కరే బోధించాలి. మరో 15 వేల పాఠశాలల్లో ఒక్కదాంటో ఐదు తరగతులకూ కలిపి ఉన్నది ఇద్దరే ఉపాధ్యాయులు. అంటే ఇక్కడా అరకొరగానే ఉపాధ్యాయులున్నారు. మరోవైపు ఉన్నత పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఆరు నుంచి పది తరగతులకు చెప్పేందుకే తగిన ఉపాధ్యాయులు ఉన్నారు. కొన్ని చోట్ల ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. కానీ చాలా చోట్ల సరిపడా ఉపాధ్యాయులే ఉన్నారు. కానీ పాఠశాలల విలీనం వల్ల ఉన్నత పాఠశాలలకు ఒకేసారి మూడు తరగతుల విద్యార్థులు (3,4,5) కొత్తగా వస్తున్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుడు అనుకున్నా ముగ్గురు ఉపాధ్యాయులు అక్కడి నుంచి రావాలి. కానీ ప్రాథమిక పాఠశాలల నుంచి వచ్చేవారు లేరు. అదే సమయంలో ఉన్నత పాఠశాలల్లో అదనంగా ఉపాధ్యాయులు లేరు. ఈ పరిస్థితుల్లో విలీనం ద్వారా కలిపేస్తున్న విద్యార్థులకు పాఠాలెలా చెబుతారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. దీనిపై కొంత కసరత్తు చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అన్నట్లుగా తయారైంది. దీనికి పరిష్కారం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయడమే. అయితే ప్రపంచ బ్యాంకుతో తాజాగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో మానవ వనరులు.. అంటే ఉపాధ్యాయుల భర్తీ, జీతభత్యాలపై ఉన్న ఖర్చును పెంచకూడదన్న షరతు విధించింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసింది. అంటే ఇక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనట్లేనా! అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చే 1875 కోట్ల రుణంతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, వారి నైపుణ్యాలను మెరుగుపర్చడం చేస్తారు. సామర్థ్య ఆధారిత బోధన-అభ్యాసంలో నైపుణ్యత అన్న పేరిట అమలు చేసే పథకానికి ఈ అప్పు మొత్తం వినియోగిస్తారు. 


మెగా డీఎస్సీ.. ఉత్తి మాటేనా? 

సీఎం జగన్‌ చెప్పినట్టుగా తరగతికో ఉపాధ్యాయుడు ఉండాలంటే ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయాలి. కానీ ఆ దిశగా వెళ్లేందుకు అవకాశం లేకుండా ప్రపంచ బ్యాంకు రుణం, ఆ రుణం కోసం అంగీకరించిన షరతులు అడ్డుపడతాయి. ఎన్నికల ముందు మెగా డీఎస్సీ వేస్తానని జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో రెండుసార్లు డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీచేశారు. ఆ రెండు డీఎస్సీల్లో కలిపి సుమారు 17 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశారు. అయితే.. ‘అవేం డీఎస్సీలు.. మేం వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తాం’ అని అప్పట్లో జగన్‌రెడ్డి ప్రకటించారు. అయితే రెండున్నరేళ్లుగా ఆ పని చేయకపోవడంతో ఖాళీలు అలానే ఉన్నాయి. పదవీ విరమణ చేసిన వారి స్థానంలో కొత్తవారు రావడం లేదు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు షరతులకు అంగీకరించి రుణ ఒప్పందంపై సంతకాలు చేయడంతో ఇక భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


అప్పుల కోసం సర్కారు ‘దేనికైనా రెడీ’ అనేలా ఉంది. ఇప్పటికే పరిమితికి మించి అడ్డగోలుగా అప్పులు చేస్తోంది. విలువైన ఆస్తులను తాకట్టు పెట్టేసింది. భవిషత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా ఇదే జాబితాలో చేర్చేసింది. తాజాగా రుణం కోసం ఉపాధ్యాయుల ఉద్యోగాలనూ ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టేసింది. కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయరాదన్న షరతుకు ప్రభుత్వం అంగీకరించింది.