‘అమరావతి’పై Jagan Sarkar మరో మైండ్‌ గేమ్‌.. ఈసారి ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2022-01-04T08:03:42+05:30 IST

అమరావతి రాజధాని నగరంపై రాష్ట్ర ప్రభుత్వం మరో మైండ్‌ గేమ్‌కు తెర లేపింది. గతేడాది...

‘అమరావతి’పై Jagan Sarkar మరో మైండ్‌ గేమ్‌.. ఈసారి ఏం జరుగుతుందో..!?

  • 19 గ్రామాల్లో కేపిటల్‌
  • సిటీ మునిసిపల్‌ కార్పొరేషన్‌
  • ప్రజాభిప్రాయ సేకరణకు 6 నుంచి గ్రామసభలు
  • పోలీస్‌, రెవెన్యూ కనుసన్నల్లో నిర్వహణ
  • గుంటూరు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఉత్తర్వులు
  • రాజధానిపై హైకోర్టులో కేసులున్నా ఇదేమిటి?
  • హాజరయ్యేది లేదంటున్న ఆ గ్రామాల ప్రజలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి), తుళ్లూరు, జనవరి 3: అమరావతి రాజధాని నగరంపై రాష్ట్ర ప్రభుత్వం మరో మైండ్‌ గేమ్‌కు తెర లేపింది. గతేడాది రాజధానిలోని కొన్ని గ్రామాలను తొలగించి మంగళగిరి తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అమరావతి కేపిటల్‌ సిటీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పేరుతో హడావుడి ప్రారంభించింది.


తుళ్లూరు మండలంలోని 16 గ్రామ పంచాయతీలు, మంగళగిరి మండలంలోని 3 పంచాయతీలు కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయబోతోన్నట్లు ప్రకటించింది. ఈ 19 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయం సేకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. ఒకపక్క అమరావతి రాజధానిపై దాఖలైన కేసులు హైకోర్టులో విచారణలో ఉన్నాయి. వాటిపై స్టేట్‌సకో కొనసాగుతోంది. మరోవైపు ఏపీసీఆర్‌డీఏ రద్దు బిల్లును ఉపసంహరించుకొంటున్నట్లు ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో ప్రకటన చేసి హైకోర్టుకు నివేదించింది. ఈ పరిస్థితుల్లో కొత్తగా అమరావతి కేపిటల్‌ సిటీ కార్పొరేషన్‌ ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది.


హైకోర్టులో కేసులు విచారణలో ఉన్నా..

రాష్ట్ర విభజన అనంతరం శాసనసభ ఏకాభిప్రాయంతో అమరావతి రాజధానిగా నిర్ణయం జరిగింది. రాజధాని ఏర్పాటు, అభివృద్ధి కోసం అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏపీసీఆర్‌డీఏను ఏర్పాటు చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దాని పరిధిని స్పష్టంగా పేర్కొని మాస్టర్‌ప్లాన్‌ను ఆమోదించింది. సీఆర్‌డీఏ పరిధిలోనే అమరావతి కేపిటల్‌ సిటీని స్పష్టంగా మార్కింగ్‌ చేశారు. తుళ్లూరు మండలంలోని నేలపాడు, అబ్బరాజుపాలెం, ఐనవోలు, బోరుపాలెం, పిచ్చుకలపాలెం, కొండమరాజుపాలెం, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, శాకమూరు, దొండపాడు, రాయపూడి, మందడం, తుళ్లూరు, వెలగపూడి, అనంతవరం, వెంకటపాలెం, నెక్కల్లు, మల్కాపురం, మంగళగిరి మండలంలోని కురగల్లు, కృష్ణాయపాలెం, నవులూరు, నిడమర్రు, తాడేపల్లి మండంలోని పెనుమాక, ఉండవల్లి, కృష్ణాయపాలెంతో రాజధాని నగర ప్లాన్‌ను ఆమోదించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే రాజధానిలోని పనులన్నీ నిలిపేసి మూడు రాజధానుల పేరిట రెండేళ్లుగా గేమ్‌ ఆడుతోంది.


సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయడంపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించగా స్టేట్‌్‌సకో జారీ చేసి కొనసాగిస్తోంది. మరోవైపు గతేడాది మార్చి 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ మంగళగిరి తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. దీనిని రైతులు పూర్తిగా విభేదించారు. ఆ సందర్భంలోనే అమరావతి రాజధాని నగరం నుంచి నిడమర్రు, నవులూరు, ఆత్మకూరు, యర్రబాలెం, బేతపూడి, ఉండవల్లి, పెనుమాక గ్రామాలను ప్రభుత్వం విడదీసింది. దీనిపైనా హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది.

 

పోలీసుల పహారాలో గ్రామసభలు..

తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలతో పాటు మంగళగిరిలోని కురగల్లు, నీరుకొండ, కృష్ణాయపాలెంలను అమరావతి కేపిటల్‌ సిటీ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో చేర్చినట్లు గుంటూరు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ డిసెంబరు 29నే ఆదేశాలు జారీచేశారు. అయితే వాటిని గోప్యంగా ఉంచి సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రచురించారు. గ్రామసభలను పోలీసుల సహకారంతో నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రెవెన్యూ, పోలీసు శాఖల కనుసన్నల్లో సమావేశాలు నిర్వహించి తీర్మానాల నకళ్లతో పూర్తిస్థాయి నివేదికను అందజేయాలనిఆదేశించారు. 


గ్రామసభలు ఏఏ గ్రామాల్లో ఎప్పుడు?

ఈ నెల 6న లింగాయపాలెం, ఉద్ధండ్రాయునిపాలెం, వెంకటపాలెం, 7న వెలగపూడి, మల్కాపురం, మందడం, 10న బోరుపాలెం, అబ్బరాజుపాలెం, నెక్కల్లు, అనంతవరం, 11న ఐనవోలు, శాకమూరు, నేలపాడు, దొండపాడు, 12న రాయపూడి, తుళ్లూరుల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు తుళ్లూరు ఎంపీడీవో ఎ.శ్రీనివాసరావు తెలిపారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి, తీర్మాన నకళ్లతో పూర్తిస్థాయి నివేదికలను  మండల పరిషత్‌  కార్యాలయంలో  అందజేయాలని ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ఆదేశాలు జారీ  చేసినట్టు చెప్పారు. 


రైతుల అభ్యంతరం..

అమరావతిని రాజధాని నగరంగా ప్రకటించకముందే ప్రతి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభలు నిర్వహించారు. అందరి ఆమోదంతోనే భూసమీకరణ పథకం తీసుకొచ్చి రైతుల నుంచి 33 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించి రాజధానిని ఏర్పాటు చేశారు. సింగపూర్‌ ప్రభుత్వ సంస్థ అందించిన మాస్టర్‌ప్లాన్‌లో రాజధాని నగరం ఏఏ గ్రామాల్లో ఉంటుందనేది స్పష్టంచేశారు. దాని ప్రకారం నాటి టీడీపీ ప్రభుత్వం నవ నగరాల అభివృద్ధి చేపట్టింది. అవి పూర్తయి ఉంటే, ఈ పాటికే అమరావతి రాజధాని మేటి నగరంగా రూపాంతరం చెంది ఉండేది. దానిని పక్కన పడేసి కొత్తగా అమరావతి కేపిటల్‌ సిటీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అంటూ నోటిఫికేషన్‌ జారీ చేయడంపై రాజధాని రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహించే గ్రామసభలకు ఎట్టి పరిస్థితుల్లో హాజరై తమ అభిప్రాయం చెప్పేది లేదని తేల్చి చెబుతున్నారు.

Updated Date - 2022-01-04T08:03:42+05:30 IST