ఇంటింటికి వెళ్లి ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2022-02-03T08:40:57+05:30 IST

ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే చేయాలని, వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ..

ఇంటింటికి వెళ్లి ఫీవర్‌ సర్వే

  వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి: సీఎం జగన్‌

అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే చేయాలని, వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరతే రాకూడదన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌లో ఉన్నామని, రికవరీ రేటు ప్రస్తుతం 94.72 శాతంగా ఉందని సీఎం చెప్పారు. మరో రెండు వారాలు రాత్రి కర్ఫ్యూ అమలుకు ఉత్తర్వులిచ్చామని తెలిపారు. మాస్క్‌ ధరించకపోతే జరిమానా, బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్‌లో 100 మంది కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే చేయాలని, వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరతే రాకూడదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ప్రొబేషన్‌ ప్రకటించాలని సీఎం ఆదేశించారు. మిగిలిపోయిన 25 శాతం ఉద్యోగుల ప్రొబేషన్‌ పరీక్షలనూ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కారణంగా మృతి చెందిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కుటుంబ సభ్యులలో ఒకరికి జూన్‌ 30లోగా కారుణ్య నియామకం చేపట్టాలని నిర్దేశించారు. జగనన్న హౌసింగ్‌ వల్ల ఆర్థిక వృద్ధి, జిల్లా స్థూల జాతీయోత్పత్తి పెరుగుతాయని సీఎం చెప్పారు. మొదటి దశలో పేదల కోసం 15.60 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని, అప్రోచ్‌ రోడ్ల ఏర్పాటుపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ప్రతివారం లే అవుట్‌లను తనిఖీ చేయాలని ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గడువు ఉగాది నుంచి దీపావళి వరకూ పొడిగించామని చెప్పారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి్‌పలో పది శాతం స్థలాలను 20ు రిబేటుపై ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిద్దామన్నారు. 5 శాతం స్థలాలను పెన్షనర్లకు రిజర్వ్‌ చేయాలన్నారు. కాగా.. ఈ నెల 8న జగనన్న చేదోడు పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తాడేపల్లి కార్యాలయంలో జరిగిన స్పందన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో చేపట్టనున్న సంక్షేమ పథకాల క్యాలెండరును సీఎం ప్రకటించారు. ఈనెల 15న వరదల్లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అందజేస్తారు. 22న చిరువ్యాపారులకు వడ్డీ లేని రుణం పథకం.. జగనన్న తోడు అందజేస్తారు. అలాగే మార్చి 8న విద్యా దీవెన, మార్చి 22న వసతి దీవెన అందజేస్తారు.


Updated Date - 2022-02-03T08:40:57+05:30 IST