ఆదాయం, అభివృద్ధి భేష్‌!

ABN , First Publish Date - 2022-03-08T08:43:27+05:30 IST

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ కొవిడ్‌ పూర్వ స్థాయికి తిరిగి చేరుకుందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. 2021-22 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక...

ఆదాయం, అభివృద్ధి భేష్‌!

కొవిడ్‌ పూర్వ స్థాయికి వచ్చేశాం.. తలసరి ఆదాయం 15.8% పెరిగింది

జీఎ్‌సడీపీలో 9.91 శాతం వృద్ధి

ఉద్యోగులకు ఒకేసారి 5 డీఏలు

23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం

వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఫస్ట్‌

26 జిల్లాలతో వికేంద్రీకరణ

ఉగాది నుంచే కొత్త జిల్లాలు

2023 జూన్‌నాటికి పోలవరం పూర్తి!

అసెంబ్లీ ఉభయసభల భేటీలో

గవర్నర్‌ విశ్వభూషణ్‌ ప్రసంగం


అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ కొవిడ్‌ పూర్వ స్థాయికి తిరిగి చేరుకుందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. 2021-22 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముందస్తు అంచనాలు 16.82 శాతం సమగ్ర వృద్ధిని చూపిస్తున్నాయని చెప్పారు. తలసరి ఆదాయం గత ఏడాది రూ.1,76,707 ఉండగా.. 15.87 శాతం పెరిగి ఇప్పుడు రూ.2,04,758కి చేరిందని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ ఉభయ సభలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పరిపాలన ఉండేలా తన ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏప్రిల్‌ 2వ తేదీన ఉగాది సందర్భంగా కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమవుతాయన్నారు. పరిపాలనకు మూలస్తంభాలుగా భావించే తమ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. అందుకే ఐదు డీఏలు ఒకేసారి విడుదల చేశామని.. 23శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..


స్కూళ్లు, విద్యాసంస్థల పటిష్ఠం..

మూడేళ్లలో వివిధ పథకాల కింద రూ.1.32 లక్షల కోట్లను నగదు బదిలీ పథకం ద్వారా పంపిణీ చేశాం. నాడు-నేడు కింద మొదటి దశలో 15,715 పాఠశాలలను పూర్తిచేశాం. మిగిలిన 42 వేల పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలను పటిష్ఠపరుస్తాం. విద్యాకానుక కింద 47 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ మూడు జతల యూనిఫారంలు, బెల్టు, ఒక జత బూట్లు, రెండు జతల మేజోళ్లు, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, నిఘంటువు, స్కూలు బ్యాగుతో కూడిన కిట్‌ను పంపిణీ చేస్తున్నాం. అమ్మ ఒడి కింద 44.5 లక్షల మంది తల్లులకు సాయం అందిస్తున్నాం. అందరికీ నాణ్యమైన విద్యను ఆంగ్ల మాధ్యమంలో అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. అర్హత కలిగిన సబ్జెక్టు టీచర్లను సమకూర్చడం ద్వారా ఫలితాలను మెరుగుపరిచేందుకు ఆరు రకాలుగా పాఠశాలలను వర్గీకరించాం. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉండేలా 16 కొత్త వైద్య కళాశాలలను ప్రతిపాదించాం. కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాలన్నీ అవసరమైన వైద్య సంస్థలు, సదుపాయాలను కలిగి ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, డయాలసిస్‌ యూనిట్‌తో కలిపి 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాల ఐటీడీఏ ప్రాంతాల్లో గిరిజన ఉప ప్రణాళిక కింద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నెలకొల్పాలని నిర్ణయించాం. అంగన్‌వాడీలను ప్రస్తుత ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతో కలిపి ఏర్పాటుచేసి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషిచేస్తున్నాం. 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో 27,620 ఫౌండేషనల్‌ పాఠశాలలుగా, 27,987 కేంద్రాలు శాటిలైట్‌ ఫౌండేషనల్‌ పాఠశాలలుగా పనిచేస్తున్నాయి. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా అవినీతి రహిత-పారదర్శక పాలన తీసుకొచ్చాం.


వ్యవసాయంలో ఎంతో..

కేంద్రం విడుదల చేసిన సుపరిపాలన సూచికలో 2020-21లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉంది. ఈ-క్రాప్‌ బుకింగ్‌, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, కనీస మద్దతు ధర వంటి కార్యక్రమాలను పటిష్ఠంగా అమలుచేశాం. రైతు భరోసాను పీఎం కిసాన్‌ పథకంతో కలిపి ఏటా రూ.13,500 అందిస్తున్నాం. అటవీ హక్కుల రికార్డుల సాగుదారులు, కౌలురైతులకు కూడా ఈ ప్రయోజనాన్ని వర్తింపచేస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే. ఈ మూడేళ్లలో 52.38 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ.20,162 కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్‌ జలకళ కింద 10,564 బోరు బావులు తవ్వించాం. ఉచిత విద్యుత్‌ పథకం కింద 2021-22లో 18.85 లక్షల మంది రైతులు  రూ.9,091 కోట్ల ప్రయోజనం పొందారు. ఉద్యానపంటలు, మత్స్య పరిశ్రమ, పాడిరైతుల ప్రయోజనాలకు పథకాలు అమలుచేస్తున్నాం. పేదలందరికీ ఇళ్లు పథకం కింద 30.76లక్షల ఇంటిస్థలాల పట్టాలు పంపిణీ చేశాం. మొదటి దశలో 15 లక్షలు, రెండో దశలో 15 లక్షల మందికి ఇళ్లను నిర్మిస్తాం. వైఎస్సార్‌ పింఛను కానుక కింద 61.74 లక్షల మందికి పెన్షన్లు.. నెలవారీ పింఛనును రూ.2,250 నుంచి రూ.2,500కి పెంచాం. వైఎస్సార్‌ ఆసరా కింద స్వయం సహాయ బృందాలకు సాయం అందిస్తున్నాం. వైఎస్సార్‌ చేయూత, ఈబీసీ నేస్తం పథకాల ద్వారా ఆయా వర్గాలకు సాయం చేశాం. 


పోలవరం 77.92ు పూర్తిచేశాం

54 జలయజ్ఞం ప్రాజెక్టుల్లో 14 పూర్తయ్యాయి. రెండు ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా ఉంది. అందులో 77.92 శాతం పనులు పూర్తయ్యాయి. 2023 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తాం. న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంకు సాయంతో రూ.6,400కోట్ల పెట్టుబడితో 3వేల కిలోమీటర్ల పొడవున రెండులైన్ల రోడ్లతో మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేసే కార్యక్రమం చేపట్టాం. రూ.2,205 కోట్ల పెట్టుబడితో 8,100 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు భారీ కార్యక్రమం చేపట్టాం. 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం సోలార్‌ ప్రాజెక్టు నుంచి ఏడాదికి 15 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సేకరణ ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రస్తుత సగటు విద్యుత్‌ సేకరణ వ్యయం కిలోవాట్‌ అవర్‌కు రూ.5.10 ఉండగా... సెకీతో ఒప్పందం వల్ల రూ.2.49 చొప్పున తెచ్చేందుకు వీలైంది.


దీనివల్ల రానున్న 25 ఏళ్ల కాలానికి ఏడాదికి సుమారు రూ.3,750 కోట్ల పొదుపు సాధ్యమైంది. వేగవంతమైన వృద్ధికి మూడు పారిశ్రామిక కారిడార్లు, మూడు పోర్టుల అభివృద్ధి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, నెల్లూరు జిల్లా దగదర్తి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నాం. గత మూడేళ్లలో రూ.36,304 కోట్ల పెట్టుబడితో 56,611 మందికి ఉపాధి కల్పిస్తూ 91 భారీ, మెగా ప్రాజెక్టులను ప్రారంభించాం. రూ.7015 కోట్ల పెట్టుబడితో 22,844 ఎంఎ్‌సఎంఈలు ప్రారంభమై 1,56,296 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఎగుమతుల్లో ఏడో స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరుకున్నాం. నైపుణ్యాభివృద్ధి కోసం రెండు నైపుణ్య విశ్వవిద్యాలయాలు, పార్లమెంటు నియోజకవర్గానికో నైపుణ్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నాం. పారదర్శక, అవినీతిరహిత పాలన కోసం స్పందన కింద 2.87 లక్షల ఫిర్యాదులను పరిష్కరించాం. లైంగిక నేరాల్లో విచారణను పూర్తిచేయడంలో జాతీయ సగటు 40 శాతం కాగా.. రాష్ట్రం 92.27 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ప్రజలు ఉంచిన నిరంతర విశ్వాసం, మద్దతుతో రాష్ట్ర పౌరుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం మరింత తీవ్రంగా పనిచేస్తుందని దృఢంగా నమ్ముతున్నా.

Updated Date - 2022-03-08T08:43:27+05:30 IST