గంటా సుబ్బారావు ఎక్కడ?

ABN , First Publish Date - 2021-12-13T09:04:07+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మాజీ ప్రత్యేక కార్యదర్శి గంటా సుబ్బారావు ఎక్కడున్నారు

గంటా సుబ్బారావు ఎక్కడ?

  • ఆదివారం ముగ్గురు నిందితులే కోర్టు ముందుకు
  • సుబ్బారావు ఆచూకీ తెలియక తల్లడిల్లుతోన్న తల్లి 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మాజీ ప్రత్యేక కార్యదర్శి గంటా సుబ్బారావు ఎక్కడున్నారు?  శుక్రవారం అర్ధరాత్రి వరకూ హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో సోదాలు చేసిన సీఐడీ అధికారులు విచారణకు విజయవాడకు రప్పించారా? సొంత కారులో వచ్చిన ఆయన శనివారం నుంచి ఎందుకు కనిపించకుండా పోయారు? దర్యాప్తు అధికారులు ఆయన్ను రహస్యంగా ప్రశ్నించారని శనివారం ప్రచారం జరిగినా ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టక పోవడానికి కారణమేంటి? అదుపులో ఉంచుకుని టెక్నికల్‌గా జాగ్రత్త పడుతున్నారా? లేక సుబ్బారావు అజ్ఞాతంలోకి వెళ్లారా?... తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయంటూ కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు ఏ1 నిందితుడైన గంటా సుబ్బారావును అరెస్టు చేసేందుకు శుక్రవారం నాడు హైదరాబాద్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.


రెండో నిందితుడైన లక్ష్మీనారాయణ ఆస్పత్రి పాలవడంతో వ్యూహం మార్చుకున్న దర్యాప్తు అధికారులు అర్ధరాత్రి వరకూ సుబ్బారావు ఇంట్లోనే ఉండి సోదాలు చేసి విచారణకు ఆయన్ను విజయవాడకు రమ్మన్నట్లు ప్రచారం జరిగింది. తమ వాహనంలో కాకుండా సొంత వాహనంలో రావాలని చెప్పడంతో శనివారం ఉదయం ఆయన విజయవాడకు వచ్చారు. ఆయన్ను తొలుత మంగళగిరికి తీసుకెళ్లిన తర్వాత అటు నుంచి పలు ప్రాంతాలు మారుస్తూ ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నల వర్షం కురిపించినట్లు ప్రచారం జరిగింది. శనివారం రాత్రికి అరెస్ట్‌ చూపించి ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టొచ్చని అందరూ భావించారు. అయితే సుబ్బారావును కోర్టులో ప్రవేశపెట్టక పోవడంతో ఆయన ఆచూకీ ఎవ్వరికీ తెలియడం లేదు. దీంతో ఆయన తల్లి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఈ విషయమై మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు.

Updated Date - 2021-12-13T09:04:07+05:30 IST