ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోండి

ABN , First Publish Date - 2021-10-27T08:28:32+05:30 IST

ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌లోకి తరలిస్తూ.. అనుమతి లేకుండా నిర్మిస్తున్న జలవిద్యుత్‌ కేంద్రాలను అడ్డుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను తెలంగాణ కోరింది. అపెక్స్‌ కౌన్సిల్‌, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా నిర్మిస్తున్న ..

ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోండి

  • అనుమతి లేకుండా జలవిద్యుత్‌ కేంద్రాలు..
  • కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు తరలిస్తున్నారు
  • ఎడమ కాలువను కట్టలేరుకే పరిమితం చేయాలి
  • ఆయకట్టును ఇష్టానుసారంగా పెంచుతున్నారు
  • కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖలు


హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌లోకి తరలిస్తూ.. అనుమతి లేకుండా నిర్మిస్తున్న జలవిద్యుత్‌ కేంద్రాలను అడ్డుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను తెలంగాణ కోరింది. అపెక్స్‌ కౌన్సిల్‌, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా నిర్మిస్తున్న పిన్నాపురం పంప్డ్‌ స్టోరేజీ జలవిద్యుత్‌ కేంద్రాన్ని అడ్డుకోవాలని తాము ఇప్పటికే లేఖ రాసినా బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంది. బోర్డు తీరు తమకు నిరాశ కలిగించిందని ఆక్షేపించింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీ చైర్మన్‌ మహేంద్ర ప్రతా్‌పసింగ్‌కు తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు మంగళవారం లేఖ రాశారు. పిన్నాపురంతోపాటు గండికోట(కడప), చిత్రావతి(అనంతపురం), సోమశిల(నెల్లూరు), అవుకు(కర్నూలు) పంప్డ్‌ స్టోరేజీ జలవిద్యుత్‌ కేంద్రాలను కృష్ణా జలాలను తరలించి నిర్మిస్తున్నారని తెలిపారు. చిత్రావతిలో ఇప్పటికే ఒక రిజర్వాయర్‌ ఉండగా.. మరో రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. ఏపీలో పంప్డ్‌ స్టోరేజీ పథకాలన్నీ కృష్ణా జలాల తరలింపుతో ముడిపడి ఉన్నాయని,  బేసిన్‌ అవసరాలు తీర్చకుండా బేసిన్‌ అవతలి ప్రాంతాలకు  తరలిస్తున్నారని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ, బనకచర్ల, గాలేరు నగరి కాలువల సామర్థ్యం పెంపు, గండికోట-చిత్రావతి విస్తరణకు ఏపీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 


ఇష్టానుసారంగా ఎడమకాలువ ఆయకట్టు పెంపు..

నాగార్జునసాగర్‌ ఎడమ కాలువను ఏపీలో కట్టలేరు వాగు వరకే పరిమితం చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. హైదరాబాద్‌ రాష్ట్రంలో 1952, 1954లో రూపొందించిన లోయర్‌ కృష్ణా ప్రాజెక్టు (నందికొండ ప్రాజెక్టు)పై నివేదికలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంతంలో ఎడమకాలువ ఆయకట్టును ఉమ్మడి రాష్ట్రంలో ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోయారని తెలిపింది. ఈ మేరకు బోర్డడ చైర్మన్‌ మహేంద్ర ప్రతా్‌పసింగ్‌కు తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు మంగ ళవారం మరో లేఖ రాశారు. ఎడమ కాలువ కింద ఆంధ్ర ప్రాంతంలో 1.3 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలనేది తొలి నివేదికలో ఉందని, కట్టలేరు వాగు దాకే ఈ కాలువను ప్రతిపాదించారని లేఖలో గుర్తు చే శారు. ఆ తర్వాత 1956లో రాష్ట్రాల పునర్విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టు నివేదికకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును 3.78 లక్షల ఎకరాలకు పెంచిందని తెలిపారు. అదే సమయంలో తెలంగాణ ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 6.02 లక్షల ఎకరాలకు కుదించారని పేర్కొన్నారు.


1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా ఎడమకాలువలో ఆయకట్టును 1.3 లక్షల ఎకరాలకు కుదిస్తూ మళ్లీ నిర్ణయం తీసుకుందన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు విషయంలో ఆంధ్ర, హైద రాబాద్‌ రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందం లేనందున  1954 ఉమ్మడి నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతంలో ఎడమ కాలువ ఆయకట్టును కట్టలేరు వాగు దాకే 1.3 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలని కోరారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ షెడ్యూల్‌-2లో పొందుపరిచిన 4.8 నుంచి 4.14 దాకా ఉన్న ఏడు కాంపోనెంట్లను తొలగిస్తూ గెజిట్‌ను సవరించాలని కోరారు. 

Updated Date - 2021-10-27T08:28:32+05:30 IST