మరో దెబ్బ.. మళ్లీ అక్కడే!

ABN , First Publish Date - 2021-11-28T08:11:33+05:30 IST

మరో దెబ్బ.. మళ్లీ అక్కడే!

మరో దెబ్బ.. మళ్లీ అక్కడే!

నేడు, రేపు అతిభారీ వర్షాలు 

రాయలసీమ, దక్షిణకోస్తాకు గండం


విశాఖపట్నం, అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రాయలసీమ, దక్షిణ కోస్తాకు మళ్లీ వాన గండం పొంచి ఉంది. నెలవ్యవధిలో మూడోసారి అతిభారీ వర్షాలను ఇక్కడి జిల్లాలు ఎదుర్కోనున్నాయి. పదిరోజుల క్రితమే వాయుగుండంతో నె ల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. 29న అండమాన్‌ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ముందుగానే ఈ జిల్లా ల్లో భారీవర్షాలు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. గత నెలాఖరు, ఈ నెల మొదటి వారంలో వాయుగుండంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూ లు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా, 16, 17 తేదీల్లో మరో వాయుగుండం ఏర్పడి నెల్లూరు, చిత్తూరు, కడ ప, అనంతపురం జల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసి తీరని న ష్టం వాటిల్లింది. 44మంది మరణించగా, 5వేలకు పైగా మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. 7వేల దాకా ఇళ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 7లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. న ష్టం అంచనాకు కేంద్రబృందం పర్యటిస్తోంది. బాధితులకునష్టపరిహారం అందక ముందే మరో విపత్తు తరుముకురావడంతో మిగిలిన పంటలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.   


ఆ జిల్లాలకు 20 సెంటీమీటర్ల వర్షం: ఐఎండీ..

శ్రీలంక తీర ప్రాంతం మీదున్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5కి.మీ. ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో దక్షిణ అండమాన్‌ సముద్రంలో మరో 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత 48గంటల్లో అది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దాని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో శనివారం మధ్యాహ్నం నుంచే ఆకాశం మేఘావృతమైంది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు మొదలయ్యాయి. కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. తీరప్రాంతంలో గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.


కోస్తాకు తుఫాన్‌ ముప్పు?

కోస్తాకు తుఫాన్‌ గండం పొంచి ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఈ నెల 30 లేదా డిసెంబరు ఒకటో తేదీకల్లా స్పష్టత రానుందన్నారు. ఇప్పటికే వర్షాలకు రాయలసీమ, దక్షిణ కోస్తా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కోస్తాలో ప్రధానంగా గుంటూ రు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటువంటి తరుణంలో మరోసారి తుఫాన్‌/వాయుగుండం/చివరకు అల్పపీడనం వచ్చినా రైతులు తీవ్రంగా నష్టపోతారని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ నెల 29న దక్షిణ అండమాన్‌  సముద్రంలో అల్పపీడనం ఏర్పడనున్నదని ఐఎండీ తెలిపింది. తొలుత ఇది పశ్చిమ వాయువ్యంగా, ఆ తరువాత వాయువ్యంగా, అనంతరం ఉత్తరంగా, అటు పిమ్మట ఈశాన్య దిశలో పయనిస్తుందని పేర్కొంది. దీని ప్రకారం డిసెంబరు 4, 5 తేదీలకల్లా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని పలువురు వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ తుఫాన్‌ ఉత్తర కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం బంగాళాఖాతంలో వాతావరణం పెద్దగా అనుకూలంగా లేదని ఇస్రో నిపుణుడొకరు తెలిపారు. 

Updated Date - 2021-11-28T08:11:33+05:30 IST