మెగా వ్యాక్సినేషన్‌ డేలో ఏపీ రికార్డు

ABN , First Publish Date - 2021-06-21T09:23:00+05:30 IST

ఆరోగ్యశాఖ ఆదివారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌ డే విజయవంతమైంది. ఆదివారం కనీసం 10 లక్షల మందికి టీకాలు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

మెగా వ్యాక్సినేషన్‌ డేలో ఏపీ రికార్డు

  • 13.60 లక్షల మందికి టీకా
  • రాష్ట్రంలో 2,232 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌
  • పశ్చిమలో 1.65 లక్షల మందికి వ్యాక్సిన్‌
  • విజయనగరంలో 63 వేల మందికే..

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ఆరోగ్యశాఖ ఆదివారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌ డే విజయవంతమైంది. ఆదివారం కనీసం 10 లక్షల మందికి టీకాలు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ.. ఈ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 13,60,931 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఈ క్రమంలో గతంలో ఒకరోజులో 6.40 లక్షల మందికి టీకాను అందించిన రికార్డును ఆరోగ్యశాఖ బ్రేక్‌ చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఇదే అత్యధిక రికార్డు. అందరికీ వ్యాక్సిన్‌ అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 2,232 వ్యాక్సిన్‌ కేంద్రాల్లో లబ్ధిదారులకు టీకాలు వేశారు. ఈ క్రమంలో ఒక్క విజయనగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 75 వేలకు పైగా టీకాలు వేశారు.


ఉదయం నుంచే జనం వ్యాక్సిన్‌ కోసం క్యూ కట్టడంతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 9,97,232 మంది టీకా తీసుకున్నారు. రాత్రి 7 గంటల తర్వాత కూడా కొనసాగిన టీకా కార్యక్రమంలో మొత్తం 13.60 లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించారు. పశ్చిమగోదావరిలో అత్యధికంగా 1,65,937 మందికి వ్యాక్సిన్‌ అందించగా.. తూర్పుగోదావరిలో 1,55,299, కృష్నాలో 1,40,583, విశాఖపట్నంలో 1,11,784, గుంటూరులో 1,06,698, ప్రకాశంలో 1,02,698, చిత్తూరులో 1,02,179, శ్రీకాకుళంలో 88,558, అనంతపురంలో 87,760, నెల్లూరులో 79,098, కర్నూలులో 79,007, కడపలో 78,014, విజయనగరంలో 63,314 మందికి టీకా వేశారు. ఆరోగ్యశాఖ ముందస్తుగా నిర్ణయించిన దాని ప్రకారం 45 ఏళ్లు దాటిన వారికి మొదటి, రెండో డోస్‌, 5 ఏళ్లలోపు చిన్నారుల తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు, ప్రయాణికులకు వ్యాక్సిన్‌ వేశారు. చాలాచోట్ల అధికారుల ఒత్తిడి కారణంగా వయస్సుతో నిమిత్తం లేకుండా వచ్చిన వారికి వచ్చినట్లు వ్యాక్సిన్‌ వేశారు. చివరికి 18 నుంచి 44 ఏళ్ల వయస్సు వారిని కూడా మెగా వ్యాక్సిన్‌ డేలో భాగస్వాములు చేశారు. 


వాక్సినేషన్‌లో ‘పశ్చిమ’ జాతీయ రికార్డు

కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా జాతీయ స్థాయి రికార్డును సొంతం చేసుకుందని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు 1,65,937 మందికి టీకా వేసి జిల్లా దేశంలోనే ముందు నిలిచిందని తెలిపారు. ఆశా వర్కర్లు మొదలు, ఆర్డీవోల వరకూ అనేక విభాగాల, స్థాయిల అధికారుల కృషి కారణంగానే ఈ రికార్డు తమ సొంతమైందని, ఇదే స్ఫూర్తి ఇకపై కొనసాగిస్తామని తెలిపారు.


వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ విజయవంతం

థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం: సింఘాల్‌


తిరుపతి (ఆంధ్రజ్యోతి), ఒంగోలు కలెక్టరేట్‌, జూన్‌ 20: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ విజయవంతమైందని వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన ఈ కార్యక్రమంలో 13,60,931 మందికి టీకా వేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో నిర్వహించిన టీకా డ్రైవ్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో శనివారం వరకు 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేశామని చెప్పారు.


రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు కూడా తగ్గిందని చెప్పారు.  కేసులు తగ్గుతున్నా ప్రజానీకం కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘దేశంలో, రాష్ట్రంలో కొవిడ్‌ థర్డ్‌వేవ్‌పై నిపుణుల నుంచి భిన్నాభిపాయాలు వస్తున్నాయి. ఒకవేళ మూడో అల వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని సింఘాల్‌ తెలిపారు.  కొవిడ్‌ చికిత్సకు రెమ్‌డెసివిర్‌, బ్లాక్‌ఫంగ్‌సకు యాంఫోటెరిసి్‌స-బి వంటివి అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం 770 మంది బ్లాక్‌ఫంగస్‌ రోగులకు శస్త్రచికిత్సలు అందించామని తెలిపారు. 


వ్యాక్సినేషన్‌కు తప్పని కష్టం!

అత్యవసర, అనారోగ్య సమయాల్లో కొండ శిఖర గ్రామాల ప్రజలు పడే బాధలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడా సమస్య వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఎదురైంది. విజయనగరం జిల్లా వేపాడ మండలంలో మారిక కొండ శిఖర గ్రామం. ఏడు కిలోమీటర్ల మేర కొండ ఎక్కితే కానీ ఆ గ్రామానికి చేరుకోలేని పరిస్థితి. సరైన రోడ్డు ఉండదు. కొండలు కోనలు దాటి వెళ్లాలి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా ఆదివారం వేపాడ పీహెచ్‌సీ సిబ్బంది ఇలా అతి కష్టమ్మీద గ్రామానికి చేరుకుని వ్యాక్సిన్లు వేశారు.



Updated Date - 2021-06-21T09:23:00+05:30 IST