సీమకు ఎన్నడూలేనంత కష్టం

ABN , First Publish Date - 2021-11-28T08:09:26+05:30 IST

సీమకు ఎన్నడూలేనంత కష్టం

సీమకు ఎన్నడూలేనంత కష్టం

211 గ్రామాలు, 23 పట్టణాలకు ముంపు 

2.86 లక్షల హెక్టార్లలో పంటనష్టం... 44 మంది మృతి 

రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి

శాఖల వారీగా సమగ్ర నివేదిక కావాలన్న కేంద్ర బృందం

చిత్తూరు జిల్లాలో రెండో రోజూ కేంద్రబృందం పర్యటన


తిరుపతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలకు తీవ్రనష్టం వాటిల్లిందని, కేంద్ర ప్రభుత్వం సత్వరం నిధులు విడుదల చేసి ఆదుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి అభ్యర్థించారు. తిరుపతిలో శనివారం కేంద్ర బృందానికి వరద నష్టాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆమె వివరించారు. ఈనెల 19న చిత్తూరు జిల్లా పెద్దమండ్యంలో 200 మిల్లీమీటర్లకుపైగా వర్షం నమోదైందని, అనంతపురం జిల్లా నల్లచెరువులో 193, నెల్లూరులో 140 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని తెలిపారు. రాయలసీమలో పలు రోడ్లు, చెరువులు దెబ్బతిన్నాయని వివరించారు. కడప జిల్లాలో అన్నమయ్య రిజర్వాయర్‌కు గండి పడడంతో చాలా గ్రామాలు నీటమునిగాయని, 20 మంది చనిపోయారని తెలిపారు. ఈ నాలుగు జిల్లాల్లో 199 మండలాలు, 1990 గ్రామాలకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. 211 గ్రామాలు, 23 పట్టణాలు ముంపునకు గురైయ్యాయని, నాలుగు జిల్లాల్లో 44మంది చనిపోయారని, 15మంది గల్లంతయ్యారని తెలిపారు. 5,740 గృహాలు దెబ్బతిన్నాయని, 98,514 గృహాలు ముంపునకు గురవడంతో వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. 2.86లక్షల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని, అందులో 75శాతం వరిపంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4.78 లక్షల మంది రైతులకు నష్టం వాటిల్లిందని తెలిపారు. పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ను తిలకించిన కేంద్ర బృందం ప్రతినిధులు శాఖల వారీగా సమగ్ర నివేదికను అందజేయాలని సూచించారు. ఆదివారం వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలించిన విషయాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కేంద్ర బృందంలోని కునాల్‌ సత్యర్థి తెలిపారు. కాగా, చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం శనివారం సుడిగాలి పర్యటన చేసింది. తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్‌, గంగవరం, పెద్దపంజాణి, శ్రీకాళహస్తి, సోమల, పుంగనూరు మండలాల్లో వరద నష్టాలను పరిశీలించి, బాధితులతో మాట్లాడింది. దెబ్బతిన్న రోడ్లు, ముంపునకు గురైన ఇళ్లు, కాలువల పరిస్థితిని పరిశీలించింది. వరి, వేరుశనగ, టమాటా, బీన్స్‌, క్యాబేజీ, బంగాళదుంప, కాలీఫ్లవర్‌, అరటి పంటల నష్టాన్ని అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. పంటచేతికొచ్చే సమయంలో వరదపాలైపోయిందంటూ నీట మునిగిన పంటలను రైతులు చూపించారు. ఇదేరీతిలో మళ్లీ వర్షాలు వస్తే మరింత ఇబ్బందులు తప్పవని విన్నవించారు. పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-11-28T08:09:26+05:30 IST