గోడు వినే నాథుడేడీ?

ABN , First Publish Date - 2021-07-30T08:46:18+05:30 IST

గోడు వినే నాథుడేడీ?

గోడు వినే నాథుడేడీ?

  • ఒకటో తేదీ జీతాలకా?.. సీపీఎస్‌ రద్దు చేయనందుకా?
  • పీఆర్‌సీ తేల్చనందుకా?.. డీఏలు సెటిల్‌ చేయనందుకా?
  • దేనికోసం పోరాడాలి?


ఒకటో తేదీన జీతం చూసి ఎన్నాళ్లయిందో? ఖాతాలో పెన్షన్‌ ఎప్పుడు పడుతుందో? రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందుతాయంటారా? ఏడు  డీఏల్లో కనీసం ఒక్కటైనా ప్రభుత్వం ఇస్తుందా..? పీఆర్‌సీకి నీళ్లు వదులుకోవలసిందేనా? ఐఆర్‌తోనే సరిపెట్టుకోవాలా? ఏ ఇద్దరు రాష్ట్రప్రభుత్వోద్యోగులు మాట్లాడుకుంటున్నా.. ప్రస్తావనకు వస్తున్న విషయాలివి. కానీ మాట బయటకు పొక్కితే తమనేం చేస్తారోనన్న భయం వారి ప్రతి కదలికలోనూ కనిపిస్తోంది. వీటిలో ఏ సమస్యపై పోరాడాలో కూడా వారికి అర్థం కావడం లేదు. 



రెండేళ్లుగా ఎక్కడి సమస్యలు అక్కడే

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు జంకు!

పెన్షనర్ల బతుకులు మరీ దుర్భరం

పింఛను ఎప్పుడు పడుతుందో తెలియని దురవస్థ

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం ఎదురుచూపులు

ఏడాది దాటినా అందని వైనం


వీఆర్‌ఓలకు పదోన్నతిపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. డీఏ మంజూరు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా సీఎం ఆదేశించారని చెప్పారు.


ఉద్యోగుల్లో తీవ్ర అంతర్మథనం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ ఉద్యోగులు సర్కారుపై పోరాడైనా తమ సమస్యలు పరిష్కరించుకుంటారని.. అందరి కంటే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని నిన్నమొన్నటి వరకు అందరూ భావించేవారు. దానికి తగినట్లుగానే.. రాష్ట్ర విభజన సమయం నుంచి ఉద్యోగులను, ఉద్యోగ సంఘాల నేతలను అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదరించింది. అడగకముందే వరాలిచ్చింది. కానీ జగన్‌ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు తారుమారయ్యాయి. తమను తృణప్రాయంగా చూస్తోందని.. తమ వినతులు, డిమాండ్లను పరిశీలించడమే లేదని ఉద్యోగులు ఆక్రోశిస్తున్నారు. వేతన సవరణ మాట దేవుడెరుగు.. కనీసం ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. పొరపాటున తమ బాధలను బహిరంగంగా వ్యక్తం చేస్తే తమ పరిస్థితీ డాక్టర్‌ సుధాకర్‌లా తయారవుతుందేమోనన్న భయాందోళనలు వారిలో కనిపిస్తున్నాయి. ముందుండి సమస్యల కోసం పోరాడాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు కిక్కురుమనడం లేదు. పైపెచ్చు ఇదిగో డీఏ.. అదిగో డీఏ అంటూ ఉద్యోగులను మభ్యపెడుతున్నారు. సంఘాల అంతర్గత సమావేశాల్లో నేతలను నిలదీసినా ప్రయోజనం శూన్యం. గతంలో ఒకటో, రెండో సమస్యలుంటే వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసేవారమని.. ఇప్పుడు రెండేళ్లుగా సవాలక్ష సమస్యలు చుట్టుముట్టాయని.. వీటిలో దేనికోసం ప్రధానంగా పోరాడాలో అర్థం కాని అయోమయంలో పడిపోయామని ఉద్యోగులు అంటున్నారు.


సకాలంలో అందని రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌..

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమైనది ప్రతి నెలా ఒకటో తేదీన జీతం. ఆ వేతనం జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఏ రోజూ ఒకటో తేదీన అందుకోలేదని వాపోతున్నారు. ఒకే రోజు ఉద్యోగులందరికీ జీతం విడుదల చేసిన పరిస్థితి లేదంటున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగుల జీతమే కాదు.. రిటైరైన ఉద్యోగుల పరిస్థితీ అదేనంటున్నారు. సామాజిక పెన్షన్‌ మాత్రం ఒకటో తేదీన తప్పనిసరిగా వస్తోందని.. 30 ఏళ్లకు పైగా ప్రభుత్వానికి సేవ చేసిన తమకు.. పెన్షన్‌ ఎప్పుడొస్తుందో నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి దాపురించిందని వారు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. సాఫీగా నడవాల్సిన జీవిత చరమాంకంలో ప్రభుత్వ వైఖరితో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని బాధపడుతున్నారు. గతంలో రిటైరైన ఉద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాలు ఒక నెలలోపు సెటిల్‌ అయ్యేవి. అప్పటి ప్రభుత్వం ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించేది. జగన్‌ సర్కారు వచ్చాక రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఆరు నెలల నుంచి ఏడాది దాటినా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైరైన టీచర్లు కొందరికి తమకు రావలసిన పీఎఫ్‌, ఇతర బకాయిలపై ఎవరికి చెప్పుకోవాలో అర్థంకావడం లేదు. కొంత మంది ఉద్యోగులు తమకు రావాల్సిన వాటిని ఆర్థిక శాఖకు సిఫార్సులు చేసి ఇప్పించాలని మంత్రులను, ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. అయినా ఆర్థిక శాఖ వారి మొర ఆలకించడంలేదు.


సంఘాల నేతలు పొగడ్తలకే సరి..!

ఇతర ఏ వర్గాలకూ లేని సమస్యలు తమకు ఉన్నాయని ఉద్యోగులు అంటున్నారు. ప్రకటించిన మూడు డీఏలకు ఇంతవరకు మోక్షం కలుగలేదని, ప్రకటించాల్సిన నాలుగు డీఏల గురించి పట్టించుకునేవారే లేరని వాపోతున్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఆర్భాటం చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఆ ప్రస్తావనే తేవడం లేదని.. అయినా ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను పొగుడుతూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం మార్చి, ఏప్రిల్‌ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం జీతాలు మాత్రమే ఇవ్వడంతో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు, పెన్షనర్లకు 50 శాతం జీతాలు, పెన్షన్లు మాత్రమే ఇచ్చింది. ఈ విషయంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా సామాజిక దృక్పథంతో వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. తమ జీతాల్లో కోత పెట్టిన ప్రభుత్వం.. సంక్షేమం పేరిట  లబ్ధిదారుల ఖాతాల్లో రూ.వేల కోట్ల నిధులు నగదు బదిలీ చేస్తుండడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వ వైఖరిపై బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేయనప్పటికీ అంతర్గత సంభాషణలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సా్‌పలో తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. 


పీఆర్‌సీ నివేదిక అంది పది నెలలు..

మధ్యంతర భృతి (ఐఆర్‌) 27 శాతం ఇచ్చిన ప్రభుత్వం.. అసలు వేతన సవరణను పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆక్షేపిస్తున్నారు. పీఆర్‌సీ చైర్మన్‌ అశుతోష్‌ మిశ్రా నివేదిక సమర్పించి 10 నెలలవుతున్నా ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేదని.. అయినా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని మండిపడుతున్నారు. తమతో పాటు తక్కువ జీతంతో ప్రభుత్వ సేవలందిస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల గోడు కూడా పట్టించుకునేవారు లేరనింటున్నారు. 


ఇవీ సమస్యలు..

1. పదినెలలుగా పీఆర్సీ నివేదిక చేతిలోనే ఉన్నా, వేతన సవరణ తేల్చరు..

2. ఏడు డీఏల్లో ఇస్తామన్న మూడింటికి దిక్కులే దు. మరో నాలుగింటిపై అసలు ప్రకటనే లేదు. 

3. సీపీఎస్‌ రద్దు కాకపోవడంతో పదవీ విరమణానంతర జీవితంపై బెంగ..

4. ఒకటో తేదీన వేతనం పడదు

5. పెన్షన్‌ నెలలో ఎప్పుడు వస్తుందో నిర్దిష్టత లేదు.

6. గతంలో రిటైరైన నెలలోపే అందే బెనిఫిట్స్‌ కోసం, ఇప్పుడు 6 నెలల నుంచి ఏడాదివరకు ఎదురుచూపులు..

Updated Date - 2021-07-30T08:46:18+05:30 IST