ఏపీ సుబాబుల్‌ లారీల అడ్డగింత

ABN , First Publish Date - 2020-06-05T10:14:50+05:30 IST

ఏపీ నుంచి సుబాబుల్‌ లోడ్‌తో వచ్చిన లారీలను ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలోని మధిర క్రాస్‌రోడ్డు వద్ద గురువారం రాత్రి బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. స్థానిక రైతులకు న్యాయం

ఏపీ సుబాబుల్‌ లారీల అడ్డగింత

అక్కడి కర్ర కొనుగోలుతో స్థానిక రైతులకు నష్టమేనంటున్న బీజేపీ నాయకులు

ఐటీసీ కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని డిమాండ్‌


బోనకల్‌, జూన్‌ 4: ఏపీ నుంచి సుబాబుల్‌ లోడ్‌తో వచ్చిన లారీలను ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలోని మధిర క్రాస్‌రోడ్డు వద్ద గురువారం రాత్రి బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. స్థానిక రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీదర్‌రెడ్డి మాట్లాడుతూ సుబాబుల్‌ కొనుగోళ్ల విషయంలో మార్కెటింగ్‌శాఖ అధికారులు మొద్దు నిద్ర వీడాలని, ఐటీసీ కంపెనీలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రాంతం నుంచి దళారులు తీసుకొస్తున్న సుబాబుల్‌ కర్రను కొనుగోలు చేయడం వల్ల జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర టన్నుకు రూ.4,500 ఇచ్చి ప్రతీ మండలంలో కొనుగోలు కేంద్రాల ద్వారా సుబాబుల్‌ కర్రను కొనుగోలు చేయాలని లేదంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న బోనకల్‌ ఎస్‌ఐ కొండలరావు అక్కడకు చేరుకొని ఆందోళన విరమించాలని నాయకులకు విజ్ఞప్తి చేశారు.


కానీ ఐటీసీ కంపెనీ అధికారులు వచ్చి రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించారు. దీంతో మధిర సీఐ వేణుమాధవ్‌ ఐటీసీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు సిలివేరు సాంబశివరావు, జామాయిల్‌, సుబాబుల్‌ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వట్టికొండ శ్రీను, నాయకులు వీరపనేని అప్పారావు, రామిశెట్టి నాగేశ్వరావు, మర్సకట్ల స్వర్ణాకర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T10:14:50+05:30 IST