మాస్క్ పెట్టుకోమన్నందుకు చావబాదాడు.. సస్పెండ్ అయ్యాడు

ABN , First Publish Date - 2020-06-30T19:56:01+05:30 IST

ఇదొక దారుణమైన సంఘటన. మాస్క్ పెట్టుకోమని చెప్పడమే తప్పైంది. అందుకు ఫలితంగా ఆమె చావుదెబ్బలు తినాల్సి వచ్చింది. ఈ అమానుష ఘటన

మాస్క్ పెట్టుకోమన్నందుకు చావబాదాడు.. సస్పెండ్ అయ్యాడు

నెల్లూరు: ఇదొక దారుణమైన సంఘటన. మాస్క్ పెట్టుకోమని చెప్పడమే తప్పైంది. అందుకు ఫలితంగా ఆమె చావుదెబ్బలు తినాల్సి వచ్చింది. ఈ అమానుష ఘటన నెల్లూరు ఏపీ టూరిజం కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆమె ఏపీ టూరిజం కార్యాలయంలో ఒక ఉద్యోగిని. పైగా దివ్యాంగురాలు. ఓ వైపు కరోనా విలయతాండవం. ఎవరి నుంచి ఏ ముప్పు వస్తుందోనన్న భయాందోళన. ఈ నేపథ్యంలో ఆమె అందరూ మాస్క్‌లు ధరించండని బాధ్యత గల ఓ పౌరురాలిగా సూచించింది. ఈ విషయం డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌కు రుచించలేదు. నాకే చెబుతావా నువ్వు అంటూ ఆగ్రహంతో రగిలిపోతూ ఆమెపైకి ఒక్కసారిగా దూసుకొచ్చి మారణాయుధాలతో దాడికి తెగబడ్డాడు. సహచరులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఓ మాత్రం కనికరం లేకుండా విచాక్షణరహితంగా చావబాదాడు. కుర్చీలో ఉన్న ఆమెను జట్టు పట్టుకుని కిందపడేసి.. కుర్చీ హ్యాండిల్‌తో ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన దృశ్యాలు ఇప్పుడు మీడియాలో హల్‌చల్ చేయడంతో అతగాడి పాపం పండింది. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అతడిని విధుల నుంచి సస్పెండ్ చేసింది.


మంత్రి సీరియస్.. ఉద్యోగి సస్పెండ్

దివ్యాంగ ఉద్యోగినిపై దాడి ఘటనపై టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ సీరియస్ అయ్యారు. డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ను సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు దివ్యాంగ ఉద్యోగినిపై హత్యాయత్నానికి పాల్పడ్డ భాస్కర్‌ని సస్పెండ్ చేస్తూ ఏపీ టూరిజం శాఖ ఎండీ ప్రవీణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. అనుమతి లేనిదే జిల్లా కేంద్రం వదిలివెళ్లొద్దని భాస్కర్‌కి ఆదేశించారు.


వాసిరెడ్డి పద్మ ఖండన

అలాగే మహిళా ఉద్యోగిపై దాడి చేయడాన్ని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కూడా తీవ్రంగా ఖండించారు. నెల్లూరు వెళ్లి బాధితురాలు ఉషారాణిని పరామర్శించారు. దివ్యాంగురాలైన మహిళపై దాడి చేయడం అమానుషమన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా భాస్కర్‌ ప్రవర్తించారని మండిపడ్డారు. మాస్క్‌ ధరించమన్నందుకు ఇష్టానుసారంగా దాడి చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దాడి చేసిన భాస్కర్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేసిందని ఆమె వెల్లడించారు.  



Updated Date - 2020-06-30T19:56:01+05:30 IST