మాయా ‘భరోసా’!

ABN , First Publish Date - 2021-10-27T08:00:00+05:30 IST

పదాల గిమ్మిక్కులు... సాయంలో మాయలు... గజిబిజి లెక్కలు... ఇదో మాయాజాలం! రైతు భరోసా నిధుల విడుదల పేరిట మంగళవారం జారీ చేసిన ప్రకటనను తరచి చూస్తే... అర్థంకాని, అంతుచిక్కని లెక్కలెన్నో

మాయా ‘భరోసా’!

ప్రభుత్వ ప్రకటనలో తికమక లెక్క

కేంద్రం వాటా సాయానికి ముసుగు

అంతా తాము చేసినట్లుగా గొప్పలు

ఆగస్టులో ఎవరికి ఇచ్చారు?

అక్టోబరులో ఎంత ఇస్తున్నారు?

స్పష్టంగా చెప్పకుండా మాయలు

‘యాంత్రీకరణ’కు గతంలో 500 కోట్లు

ఇప్పుడు రూ.25 కోట్లకే ప్రకటనలు


కోట్లకు కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు జారీ చేశారు. ‘మీట నొక్కి’ నిధులు విడుదల చేస్తున్నామని... రైతులకు ‘దీపావళి’ పండగ ముందే వచ్చేసిందని గొప్పలకు పోయారు. కానీ... అసలు ‘రైతు భరోసా’ ఇస్తున్నది ఎంతమందికి? అందులో కేంద్రం వాటా ఎంత? అచ్చంగా ఈ పథకానికి మంగళవారం విడుదల చేసిన డబ్బు ఎంత? ఇవేవీ స్పష్టంగా చెప్పరు! భరోసా లెక్కల్లో అంతా మాయ!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

పదాల గిమ్మిక్కులు... సాయంలో మాయలు... గజిబిజి లెక్కలు... ఇదో మాయాజాలం! రైతు భరోసా నిధుల విడుదల పేరిట మంగళవారం జారీ చేసిన ప్రకటనను తరచి చూస్తే... అర్థంకాని, అంతుచిక్కని లెక్కలెన్నో కనిపిస్తాయి. ‘రైతు భరోసా’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, పీఎం కిసాన్‌ యోజన పథకం కింద కేంద్రం రైతులకు పెట్టుబడి వ్యయం కింద సహాయం చేస్తున్నాయి. కేంద్రం రూ.2వేలు చొప్పున మూడు విడతల్లో (మే, అక్టోబరు, జనవరి) ఏడాదికి రూ.6వేలు చెల్లిస్తోంది. రాష్ట్రం మరో రూ.7500లను రెండు విడతల్లో (మేలో రూ.5500, అక్టోబరులో  2వేలు) చెల్లిస్తోంది. వెరసి... రైతుకు ఏటా రూ.13,500 పెట్టుబడి సహాయం అందుతోంది.  రెండో విడత రైతు భరోసా అమ లు సందర్భంగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనలో పేర్కొన్న లెక్కల్లో అనేక తప్పులున్నాయి. 


ఇంతకీ ఇచ్చింది ఎంత?

రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలో 50,37,000 మంది అన్నదాతలకు లబ్ధి చేకూరుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకం కోసం 2019-20లో రూ.3800 కోట్లు, 2020-21లో రూ.3600 కోట్లు ఖర్చు పెట్టినట్లు గతంలో విడుదల చేసిన కొన్ని ప్రకటనల్లో పేర్కొంది. 50,37,000 మంది లబ్ధిదారులకు రాష్ట్ర వాటాగా ఒక్కొక్కరికి రూ.7,500 అందించడానికి ప్రభుత్వానికయ్యే ఖర్చు రూ.3,770 కోట్లు. ఇందు లో మే నెలలో మొదటి విడతగా ఇచ్చిన రూ.5,500 చొప్పున రూ.2,770 కోట్లు పంపిణీ చేసినట్టు మంగళవారం ఇచ్చిన పత్రికా ప్రకటనలో ఉన్న లెక్కలను బట్టి అర్థమవుతోంది. రెండో విడతలో రూ.1007 కోట్లు ఇస్తే ఈ ఏడాదికి ఈ పథకం పూర్తవుతుంది. కానీ, రెండో విడత కింద ఆగస్టు నెలలోనే రైతులకు రూ.977 కోట్లు అందజేశామని ఆ ప్రకటనలో రాసుకొచ్చారు. అంటే... మిగిలింది రూ.30కోట్లు మాత్ర మే! మంగళవారం ‘రైతు భరోసా’ కింద ఈ మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. కానీ... ‘మిగిలిన రెండో విడత రైతు భరోసా’ సాయంతో కలిపి రూ.1213 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కోసం 25.55 కోట్లు, సున్నావడ్డీ పంట రుణాల కోసం రూ.112.7 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. అంతే తప్ప... రైతు భరోసా కోసం ఇస్తున్న మొత్తం ఎంతో చెప్పలేదు. ఈ ప్రకటన ప్రకారం చూస్తే... రైతు భరోసాకు రూ.1074.75 కోట్లు చెల్లించినట్లు అర్థమవుతోంది. ప్రభుత్వం చెప్పినట్లుగా ఆగస్టు నెలలోనే రైతులకు అందించిన రూ.977 కోట్లను తీసేస్తే... మంగళవారం రైతు భరోసాకు ఇచ్చింది రూ.97.75 కోట్లు మాత్రమే! అక్టోబరులో కేంద్రం విడుదల చేసిన సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తూ... తాను రెండో విడతలో బకాయిపడిన మొత్తాన్ని కూడా కలిపేసి పనిలోపనిగా ‘భారీ’లెక్క చూపించి... ప్రకటనలు జారీ చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. 


కేంద్రం వాటాకూ కలరింగ్‌

మంగళవారం జారీ చేసిన ప్రకటనలో ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ అని పెద్దగా రాసి... ‘పీఎం కిసాన్‌’ అని చిన్న అక్షరాల్లో, అదీ ఆంగ్లంలో రాశారు. ఇక... ఈ పథకంద్వారా అందుతున్న రూ.13,500 కోట్లలో కేంద్రం వాటా రూ.6 వేలు ఉందని ఎక్కడా చెప్పలేదు. పైగా... అంతా తామే ఇస్తున్నట్లుగా ‘రైతులకు ఏటా రూ.13,500 అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే’ అని గొప్పగా చెప్పుకొచ్చారు. నిజానికి... రైతు భరోసా కింద తానే ఏటా రూ.12,500 ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీనికి కేంద్రం ఇచ్చే రూ.6వేలు జత చేసి... రూ.18,500 రైతులకు అందించాలి. కానీ తన వాటా సహాయాన్ని రూ.7500లకు తగ్గించేసి, కేంద్రంఇస్తున్న సాయంతో రూ.13,500 చేశారు. దీనికే... ‘చెప్పినదానికంటే ఎక్కువ సహాయం చేస్తున్నాం’ అంటూ కలరింగ్‌ ఇచ్చుకోవడం విశేషం. రైతు భరోసా కింద మొదటివిడత మేలో రూ.7500, అక్టోబరులో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు ఇస్తున్నట్లు మంగళవారం నాటి ప్రకటనలో పేర్కొన్నారు. ఈ 3 విడతల్లోనూ కేంద్రం వాటా రూ.2వేల చొప్పున ఉంది. 


యాంత్రీకరణకు రూ.25 కోట్లేనా?

వ్యవసాయ యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్రాలకు సంబంఽధించి టీడీపీ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏడాదికి రూ.500 కోట్లు ఖర్చు చేసేవి. ఇవి కాకుండా డ్రిప్‌లు, స్ర్పింక్లర్లు, పోర్టబుల్‌ స్ర్పింక్లర్ల కోసం ప్రత్యేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మరో రూ.600 కోట్ల వరకు ఖర్చు చేసేవి. కానీ, మంగళవారం ఇచ్చిన ప్రకటన ప్రకారం వ్యవసాయ యాంత్రీకరణకు జగన్‌ సర్కారు ఖర్చు చేస్తున్నది కేవలం రూ.25 కోట్లు. ఈ పథకాల కోసం కేంద్రం ఇచ్చే సబ్సిడీ మారనప్పుడు రాష్ట్ర ఖజానాకు వస్తున్న ఆ డబ్బులను జగన్‌ సర్కార్‌ ఏ అవసరాలకు మళ్లిస్తున్నట్టు? ఇది సమాధానం తెలియని ప్రశ్న!


రూ.11 వేల కోట్లు ఇచ్చి...

జగన్‌ సర్కార్‌ వచ్చాక మొదటి ఏడాది రైతు భరోసా కింద రూ.3,800 కోట్లు, రెండో ఏడాది రూ.3,600 కోట్లు, ఈ ఏడాది అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం రూ.3,700 కోట్లు ఇచ్చారనుకుంటే మొత్తం ఈ పథకం కింద మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టింది రూ.11,000 కోట్లు మాత్రమే. కానీ, మంగళవారం ఇచ్చిన పత్రికా ప్రకటనలో ఏకంగా రూ.18,777 కోట్లు ఇచ్చినట్టు తప్పుడు లెక్కలు చెప్పారు. ఈ పథకం కోసం ఖర్చు పెట్టిన మొత్తం కంటే రూ.7,777 కోట్లు అదనంగా రాసుకున్నారు. అంటే... దీనిని కేంద్రం వాటాగా అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2021-10-27T08:00:00+05:30 IST