Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎమ్మెల్యే సోదరుడికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగి

ప్రకాశం: ఏపీలో అధికార పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యల జులుం మామూలుగా లేదు. ప్రభుత్వ అధికారులపై పెత్తనం చెలాయిస్తూ.. తమ పనులు ముందు చేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. తాజాగా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ ఫోన్ కాల్ వ్యవహారం బయటపడింది. కనిగిరి ఏపీసీపీడీసీఎల్ ఈఈ భాస్కర్‌రావుతో ఎమ్మెల్యే వేణుగోపాల్ సోదరుడు శ్రీధర్ అమర్యాదకరంగా మాట్లాడిన ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. 


బోధనంపాడులో చేస్తున్న తన పనులపై ఈఈ భాస్కర్ రావుకి ఫోన్ చేసిన ఆయన.. వెంటనే దాని సంగతి చూడాలని అడిగారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా తాను చేయలనేనని సదరు అధికారి తెలిపారు. ప్రాధాన్యత ప్రకారమే పనులు చేస్తామని చెప్పేందుకు ప్రయత్నించారు. పనులు చేయమంటే రోజుకో స్టోరీ ఎందుకు చెబుతున్నారని ఎమ్మెల్యే సోదరుడు ప్రశ్నించారు. ‘‘ప్రయారిటీ అంటూ డైలాగులు చెప్పొద్దు, తమాషాలు చేయొద్దు నువ్వు’’ అంటూ ఏకవచనంతో మాట్లాడారు. దీంతో ఈఈ భాస్కర్‌రావు తీవ్రంగా స్పందించారు. నువ్వు అంటూ ఏకవచనం వద్దని... తాను చాలా గౌరవంగా మాట్లాడుతున్నానని అన్నారు. ‘‘ఎమ్మెల్యే సోదరుడివి అయితే ఎలా పడితే అలా మాట్లాడతారా... చాలా ఓపిక పడుతున్నా’’ అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ‘‘ఉద్యోగులతో మాట్లాడటం నేర్చుకోవాలి.. మీ ఇంట్లో పాలేరుని కాదు’’ అంటూ తీవ్ర స్వరంలో సమాధానమిచ్చారు. 


అధికారులపై వైసీపీ నేతల తీరుతో స్థానికుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించే అధికార పార్టీ వ్యక్తులకు ఇలాగే దీటుగా సమాధానమిచ్చే అధికారులు కావాలని స్థానికులు చర్చించుకుంటున్నారు.  

Advertisement
Advertisement