రెండో డోస్‌పై అనాసక్తి

ABN , First Publish Date - 2021-11-13T06:40:52+05:30 IST

కరోనా మహమ్మారి తొలి, రెండో దశలో విలయతాండవం చేసింది. ఆరోగ్యం, ఆర్థికపరంగా కష్ట, నష్టాలను మిగిల్చిం ది. ఈ నష్టాల నుంచి ఇప్పటికీ బాధితులు కోలుకోలేకపోతున్నారు. కరోనా మూడో దశ కూడా వచ్చే ప్రమాదం ఉందని, కొత్త వేరియంట్లతో ఇబ్బంది తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెండో డోస్‌పై అనాసక్తి

30 శాతం దాటని సెకండ్‌ డోస్‌ 

ఇళ్ల నుంచే గురుకులాలకు కరోనా 


నల్లగొండ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా మహమ్మారి తొలి, రెండో దశలో విలయతాండవం చేసింది. ఆరోగ్యం, ఆర్థికపరంగా కష్ట, నష్టాలను మిగిల్చిం ది. ఈ నష్టాల నుంచి ఇప్పటికీ బాధితులు కోలుకోలేకపోతున్నారు. కరోనా మూడో దశ కూడా వచ్చే ప్రమాదం ఉందని, కొత్త వేరియంట్లతో ఇబ్బంది తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమంటున్నారు. అయితే రెండో దశ కరోనా సమయంలోనే వ్యాక్సిన్‌ రాగా, చాలా మంది పోటీపడి టీకా తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద బారులుతీరగా, ఓ దశలో వ్యాక్సిన్‌ డోసులు సరిపడా రాకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తరువాత కరోనా తగ్గుముఖం పట్టడం తో ప్రజలకు వ్యాక్సిన్‌పై ఆసక్తి తగ్గింది. దీంతో జిల్లాలో వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్నవారి సంఖ్య 30శాతం కూడా దాటలేదు. పరిస్థితి ఇలానే ఉంటే భారీ మూల్యం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


రెండో డోస్‌ తీసుకుంటేనే రక్షణ

కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఏడా ది జనవరి మాసంలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లను అం దుబాటులోకి తెచ్చింది. వైద్యారోగ్య శాఖ సిబ్బంది, పీపీ యూనిట్‌, పట్టణ పీహెచ్‌సీలు, గ్రామీణ పీహెచ్‌సీల్లో టీకా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్లు ఇస్తున్నారు. వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల కలిగే ప్ర యోజనంపై అవగాహన కల్పిస్తున్నారు. అయినా రెండో డోస్‌పై నిర్లక్ష్యం చూపుతున్నారు. వ్యాక్సిన్‌కు అర్హులైన 18 ఏళ్లు పైబడిన వారు జిల్లాలో 12.73లక్షల మంది ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు 10.50లక్షల మంది మొదటి డోస్‌ తీసుకున్నారు. ఇంకా 16శాతం మంది వ్యాక్సిన్‌కు దూరంగా నే ఉన్నారు. ఇక తొలి డోస్‌ తీసుకున్న తరువాత నిర్ధిష్ట సమయం అనంతరం రెండో డోస్‌ వ్యాక్సిన్‌ అర్హత సాధించి న వారిలో 3.20లక్షల మందే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఇంకా 70శాతం మంది రెండో డోస్‌ తీసుకోవాల్సి ఉంది.


గురుకుల విద్యార్థినికి కరోనా

దామరచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో మరో విద్యార్థినికి శుక్రవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 354 మంది విద్యాభ్యాసం చేస్తున్న ఈ పాఠశాలలో 25 మంది విద్యార్థినులు రెండు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుండగా, ఈ నెల 11న 75 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా; ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది. పాఠశాలలో ఐసోలేషన్‌ గది లేకపోవటంతో వారికి మెడికల్‌ కిట్లు అందజేసి ఇళ్లకు పంపారు. కాగా, శుక్రవారం మరో 160 మంది విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించగా, ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉండగా జిల్లాలోని కొండమల్లేపల్లి మండలం, దంజిలాల్‌తండా పంచాయతీ పరిధిలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఈ నెల 10, 11 తేదీల్లో 20 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా మొత్తం మూడు రోజుల్లో గురుకుల పాఠశాలల్లో 29 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. పాజిటివ్‌ వచ్చిన దంజిలాల్‌తండా గురుకులం విద్యార్థినులను ప్రత్యేక గదిలో ఉం చి మెడికల్‌ కిట్లు అందజేసి విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే తల్లిదండ్రులు పాఠశాలకు శుక్రవారం వచ్చి విద్యార్థినులను ఇంటికి తీసుకెళ్లారు. అన్ని వసతులు కల్పించి చికిత్స అందజేస్తామని చెప్పినా వినకుండా తల్లిదండ్రులు ఘర్షణకు దిగుతున్నారని, దీంతో విద్యార్థినులను వారితో ఇంటికి పంపామని ప్రిన్సిపాల్‌ ఇందిరావతి తెలిపారు. అయితే వరుస కేసులు వెలుగు చేస్తుండటంతో జిల్లా యంత్రాంగం కలవరపడింది. గురుకులాల్లో కరోనా వ్యాప్తికి కారణాలను వైద్యశాఖ అధికారులు విశ్లేషించారు. విద్యార్థుల ఇళ్ల నుంచే గురుకులాలకు కరోనా వ్యాప్తి చెందిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, ఎక్కువ మందిలో లక్షణాలు లేవని వైద్యశాఖ అధికారులు తెలిపారు. కాగా, వరుస కేసుల నేపథ్యంలో ఏం చర్యలు తీసుకోవాలనే దాని పై జిల్లా యంత్రాంగం ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఇంకా స్పష్టత రాలేదు. గురుకులాల్లో ఐసోలేషన్‌ గదులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


నేరుగా ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్‌ : ఎ.కొండల్‌రావు, డీఎంహెచ్‌వో

వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకొని రెండో డోస్‌కు అర్హత సాధించిన వారికి ఆశా కార్యకర్తల ద్వారా ఫోన్లు చేయిస్తున్నాం. వారు ప్రతిరోజు సమాచారం అందించి అర్హులకు దగ్గరలో ఉన్న కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాల వివరాలు తెలియజేస్తున్నారు. మొదటి డోస్‌ వేయించుకున్న వారి సెల్‌ నెంబర్లు, ఆధార్‌, ఇంటి చిరునామాలు మా వద్ద ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత నేరుగా ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్‌ ఇచ్చే ఆలోచనలో ఉన్నాం. కరోనా పోయిందనే ధోరణిలో కొంత మంది ఉన్నారు. కానీ, ప్రమాదం పొంచే ఉంది. పరీక్ష చేసిన ప్రతి 200 మందిలో ఒకరికి ఇప్పటికీ పాజిటివ్‌గా నిర్ధారణగా అవుతోంది. నిత్యం 0.6 నుంచి 0.8శాతం వరకు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. అందుకు వాక్సిన్‌ తీసుకోవాల్సిందే.


Updated Date - 2021-11-13T06:40:52+05:30 IST