అపోహలే ప్రాణాలు తీశాయా!?

ABN , First Publish Date - 2021-12-03T06:11:34+05:30 IST

మండలంలోని టోకూరు పంచాయతీ బగ్మారవలస గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన మారణకాండకు మూఢనమ్మకాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

అపోహలే ప్రాణాలు తీశాయా!?
గొల్లోరి డొంబు మృతదేహం వద్ధ పరిశీలిస్తున్న సీఐ దేముడుబాబు, ఎస్‌ఐ రాము


బగ్మారవలస ఘటనకు ‘చిల్లంగి’ అనుమానాలే కారణం

డొంబు చేతబడి చేస్తాడంటున్న కోమటి కుటుంబీకులు 

ఇతని వల్లనే అన్న, వదిన చనిపోయారని ఆరోపణ

కొద్ది రోజుల నుంచి ఇరువర్గాల మధ్య గొడవలు

పరస్పరం దాడుల్లో ముగ్గురి మృతి

మరో ఇద్దరికి తీవ్రగాయాలు

కేసులు నమోదు చేసిన పోలీసులు

మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి, బంధువులకు అప్పగింత


అనంతగిరి, డిసెంబరు 2: మండలంలోని టోకూరు పంచాయతీ బగ్మారవలస గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన మారణకాండకు మూఢనమ్మకాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రెండు కుటుంబాల మధ్య మొదలైన గొడవ.. మరణాయుధాలతో దాడికి దారితీసి, ముగ్గురు హత్యకు గురైన విషయం తెలిసిందే. మారుమూల గ్రామాల్లో చేతబడి/ చిల్లంగి పేరుతో క్షుద్రపూజలు చేస్తుండడం, వారిపై స్థానికులు దాడులు చేయడం వంటివి జరుగుతుంటాయని,  కానీ ఒకే గ్రామంలో ముగ్గురు హత్యకు గురికావడం ఇదే ప్రథమమని పోలీసులు అంటున్నారు. గురువారం ఉదయం బగ్మారవలస గ్రామాన్ని సందర్శించిన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి, బుధవారం రాత్రి జరిగిన మారణకాండకు దారితీసిన పరిస్థితులపై స్థానికులను ఆరా తీశారు. గొల్లోరి డొంబు, అతని కుటుంబ సభ్యులు చేతబడి చేస్తుంటారని, వీరి చర్యల వల్ల తమ కుటుంబంలో ఇద్దరు చనిపోయారని, మరొకరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని కిల్లో కోమటి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే తమ కుటుంబ సభ్యులు ఎవరూ చేతబడి చేయరని, జబ్బు చేయడంవల్లనే కోమటి కుటుంబ సభ్యులు చనిపోయారని డొంబు భార్య, కుమార్తె ఖండిస్తున్నారు. 

అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ బగ్మారవలస గ్రామంలో 23 కుటుంబాలు నివాసం వుంటున్నాయి. ఎగువ వీధి ఆరు ఇళ్లు, దిగువ వీధిలో 18 ఇళ్లు వున్నాయి. ఎగువ వీధిలో కిల్లో కోమటి, గొల్లోరి డొంబు కుటుంబాలు నివాసం వుంటున్నాయి. కిల్లో కోమటి అన్నయ్య నారాయణరావు రెండేళ్ల క్రితం, వదిన దొన్మోతి రెండు నెలల క్రితం మృతిచెందారు. కోమటి మనవరాలు (బలరామ్‌ కుమార్తె- 5 నెలలు) కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నది. డొంబు, అతని అల్లుడు పొత్తి (మువ్వంవలస) చేతబడి చేయడం వల్లనే తమ కుటుంబంలో ఇద్దరు చనిపోయారని, ఐదు నెలల చిన్నారికి జబ్బు చేసిందని కోమటి కుటుంబ సభ్యులు కొద్ది రోజుల నుంచి ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కిల్లో కోమటి పెద్ద కుమారుడు బలరామ్‌, అనారోగ్యంతో బాధపడుతున్న తన ఐదు నెలల కుమార్తెను బుధవారం ఎస్‌.కోట ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్య చేయించుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. డొంబు కుటుంబ సభ్యులు చేతబడి చేయడం వల్లనే తన కుమార్తె జబ్బుపడిందంటూ బలరామ్‌ ఆరోపిస్తూ దుర్భాషలాడాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య కొద్దిసేపు గొడవ జరిగింది. ఇది సద్దుమణిగాక ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు. కొద్దిసేపటి తరువాత డొంబు కుమారుడు సుబ్బారావు బయట నుంచి ఇంటికి చేరుకున్నాడు. అంతకుముందు బలరామ్‌ చేసిన దూషణలు, జరిగిన గొడవ గురించి డొంబు చెప్పడంతో సుబ్బారావు కోపోద్రిక్తుడై కూరగాయలు కోసే కత్తి తీసుకుని, బలరామ్‌పై దాడి చేశాడు. అక్కడే ఉన్న అతని భార్య భయంతో పెద్దగా కేకలు వేయడంతో కోమటి, అతని రెండో కుమారుడు భగవాన్‌ వచ్చి అడ్డుకున్నారు. దీంతో కోమటికి కత్తిపోట్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం సుబ్బారావు తన ఇంటిలోకి వెళ్లిపోయాడు. గాయపడిన బలరామ్‌, భగవాన్‌లు సమీపంలోని సిసాగుడ, టోకూరు, మువ్వంవలస గ్రామాలకు వెళ్లి, తమ తండ్రి హత్యకు గురైన విషయాన్ని బంధువులకు చెప్పారు. దీంతో వారంతా బగ్మారవలస చేరుకుని, కర్రలతో డొంబు, సుబ్బారావులపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. డొంబు ప్రాణభయంతో సమీపంలోని పొలాల్లోకి పారిపోయాడు. సుబ్బారావు స్పృహకోల్పోయాడు. అనంతరం గ్రామస్థులు పోలీసులకు, 108కు సమాచారం అందించారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సుబ్బారావు, బలరామ్‌, భగవాన్‌లను అనంతగిరి పీహెచ్‌సీకి తరలించారు.  చికిత్స చేస్తుండగా సుబ్బారావు ప్రాణాలు వదిలాడు. మిగిలిన ఇద్దరిని ఎస్‌.కోటకు, అక్కడి నుంచి విజయనగరం ఆస్పత్రికి తరలించారు. కాగా గ్రామానికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకుని, డొంబు కోసం గాలించగా, సుమారు 150 మీటర్ల దూరంలో పొలాల్లో శవమై కనిపించాడు. 

ఇదిలావుండగా అరకులోయ సీఐ జి.దేముడుబాబు, అనంతగిరి ఎస్‌ఐ రాము, పోలీసు సిబ్బంది గురువారం ఉదయం బగ్మారవలస చేరుకుని వివరాలు సేకరించారు. కోమటి, డొంబు మృతదేహాలను పరిశీలించారు. పంచనామా అనంతరం ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. ముగ్గురి మృతదేహాలకు  పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.    


ఐదుగురిపై కేసులు నమోదు


బగ్మారవలసలో బుధవారం రాత్రి జరిగిన ఘటనలపై కేసులు నమోదు చేసినట్టు అరకులోయ సీఐ దేముడుబాబు తెలిపారు. కిల్లో కోమటి హత్య, బలరామ్‌, భగవాన్‌లపై హత్యాయత్నం కేసులో గొల్లోరి డొంబు, గొల్లోరి సుబ్బారావులను నిందితులుగా చేర్చామన్నారు. అదేవిధంగా డొంబు, సుబ్బారావుల హత్యలకు సంబంధించి కిల్లో కోమటి, బలరామ్‌, భగవాన్‌లపై కేసులు నమోదు చేశామన్నారు. 

Updated Date - 2021-12-03T06:11:34+05:30 IST