HYD : ఫ్రెండ్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం.. ఆ రెండు లింక్‌లను క్లిక్ చేయగా..!

ABN , First Publish Date - 2021-07-16T14:39:46+05:30 IST

అతడు పంపించిన రెండు లింక్‌లను క్లిక్‌ చేసి....

HYD : ఫ్రెండ్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం.. ఆ రెండు లింక్‌లను క్లిక్ చేయగా..!

  • మొబైల్‌ యాప్స్‌లో పెట్టుబడి పేరుతో మోసం
  • పన్నెండు లక్షలకు పైగా కాజేసిన కేటుగాళ్లు

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : గొలుసుకట్టు వ్యాపారం తరహాలో మొబైల్‌ యాప్స్‌ ద్వారా భారీగా లాభాలు వస్తాయంటూ ఓ యువకుడిని ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు లక్షలు కాజేశారు. నగరానికి చెందిన అవినాష్‌కుమార్‌కు ఓ స్నేహితుడి ద్వారా ఓ కేటుగాడు పరిచయమయ్యాడు. ఫోనులో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తున్నాయంటూ నమ్మించాడు. తనకు తెలిసిన రెండు మొబైల్‌ యాప్స్‌లో పెట్టుబడి పెట్టి సభ్యుడిగా చేరాలని, తర్వాత కొత్త సభ్యులను చేర్పించడం ద్వారా సగానికి సగం కమీషన్‌ రూపంలో వస్తుందని నమ్మబలికాడు. కేటుగాడి మాటలు నమ్మిన అవినాష్‌ రెండు నెలల క్రితం అతడు పంపించిన రెండు లింక్‌లను క్లిక్‌ చేసి రెండు యాప్‌లను డౌన్‌లోడ్‌ చేశాడు. 


అందులో రూ.2లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత కొత్తగా ఏడుమందిని చేర్పించి వారి ద్వారా రూ.10.35లక్షలు పెట్టుబడి పెట్టించాడు. ముందుగా అందరికీ వెయ్యి, రెండువేలు చొప్పున లాభాలు వస్తున్నట్లు కనిపించింది. నెల రోజుల పాటు అందుబాటులో ఉన్న యాప్‌లు తర్వాత తెరుచుకోవడం మానేశాయి. కేటుగాడి నెంబర్లకు ప్రయత్నించగా స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితులు సిటీ సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-07-16T14:39:46+05:30 IST