ఇదే స్ఫూర్తిని కొనసాగించండి

ABN , First Publish Date - 2020-04-04T12:09:16+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు నమోదు కాకపోవడం ఆనందదా యకమని, ఇదే స్ఫూర్తిని ప్రజలు కొనసాగించి కరోనా నివారణకు సహకరించాలని ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు.

ఇదే స్ఫూర్తిని కొనసాగించండి

కరోనాను నివారించండి

  పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు


పలాస, ఏప్రిల్‌ 3: జిల్లాలో కరోనా కేసులు నమోదు కాకపోవడం ఆనందదా యకమని, ఇదే స్ఫూర్తిని ప్రజలు కొనసాగించి కరోనా నివారణకు సహకరించాలని ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం మునిసిపల్‌ కార్యాలయంలో నియోజకవర్గం అధికారులు, వైద్యశాఖ, పోలీసులతో సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ నాగేంద్రకుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఉన్న కారణంగా ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. యాచకులు, వలస కార్మికులను గుర్తించి వారికి పునరావాసంతో పాటు ఆహారం సరఫరా చేయాలని అధికారులను సూచించారు.


ఈ నెల 5 రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్‌ దీపాలను ఆపివేసి కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో సారా జోరు పెరుగుతోందని, దీని నిర్మూలనకు కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. తొలుత పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ పరంగా కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యలు వస్తే తమకు వెంటనే తెలపాలన్నారు. తహసీల్దార్‌ మధుసూదనరావు మాట్లాడుతూ, ఇప్పటి వరకు 500 మందికి పునరావాసం కల్పించామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చిక్కిపోయిన వారిని గుర్తించి వారికి బియ్యం, కూరగాయలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో కె.లీలారాణి, ఎంపీడీవోలు ఎన్‌.రమేష్‌నాయుడు, వి.తిరుమలరావు, తహసీల్దార్‌ డి.ఆనంద్‌కుమార్‌, సీఐ వేణుగోపాలరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-04T12:09:16+05:30 IST