అప్పన్న భూముల్లో వైసీపీ నేత పాగా

ABN , First Publish Date - 2021-08-02T06:19:11+05:30 IST

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామికి చెందిన భూమిలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు పాగా వేశాడు.

అప్పన్న భూముల్లో వైసీపీ నేత పాగా
మామిడి తోటలో రోడ్డు వేస్తున్న దృశ్యం

మామిడి తోటలో ఇళ్ల స్థలాల లేఅవుట్‌

990 గజాల స్థలంలో దర్జాగా రోడ్డు నిర్మాణ పనులు

నాలుగు దశాబ్దాల క్రితం స్థానిక రైతుకు లీజుకు ఇచ్చిన  ఆలయ అధికారులు

కిందిస్థాయి అధికారుల సహకారంతో ఎల్‌ఆర్‌సీల సృష్టి

పదేళ్ల క్రితం లేఅవుట్‌ వేయడానికి యత్నాలు

అడ్డుకున్న నాటి ఈవోలు.... ఎల్‌ఆర్‌సీలు రద్దు

తాజాగా రంగంలోకి దిగిన వైసీపీ నేత

లేఅవుట్‌గా మార్పు

స్థలం విలువ రూ.3 కోట్ల పైమాటే!



సింహాచలం, ఆగస్టు 1:

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామికి చెందిన భూమిలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు పాగా వేశాడు. గతంలో ఓ రైతుకు సాగు చేసుకోవడానికి లీజుకు ఇచ్చిన ఈ భూమిని, వైసీపీ నేత చేజిక్కించుకుని, ఇళ్ల స్థలాల లేఅవుట్‌గా మారుస్తున్నాడు. ఆలయ సిబ్బంది, అధికారులు నిత్యం రాకపోకలు సాగించే రహదారికి పక్కనే ఈ బాగోతం జరుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళ్లితే....

 వేపగుంట (గ్రామ పంచాయతీ) పరిధిలోని సర్వే నంబరు 187లో వున్న భూమి సింహాచలం దేవస్థానానికి చెందిన ఫలసాయం తోటగా రికార్డుల్లో వుంది. దేవస్థానం అధికారులు సుమారు 40 ఏళ్ల క్రితం స్థానిక వ్యక్తి ఒకరికి కొంత భాగాన్ని సాగు చేసుకుంటూ ఫలసాయాన్ని అనుభవించేందుకు 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చారు. కొంతకాలం తరువాత సదరు రైతు, ఆలయానికి చెందిన కిందిస్థాయి అధికారులు కుమ్మక్కై, 990 గజాలకు మూడు ఎల్‌ఆర్‌సీ (ల్యాండ్‌ రెగ్యులేషన్‌ సర్టిఫికెట్‌)లను సృష్టించారు. వీటి ప్రకారం సాగు భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. సుమారు పదేళ్ల క్రితం ఈ భూమిని ఇళ్ల స్థలాల లేఅవుట్‌గామార్చి, విక్రయించడానికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న నాటి ఈఓ శంకరరెడ్డి... ఎల్‌ఆర్‌సీలను రద్దు చేయాలని ఆదేశించారు. రోడ్డుకు అడ్డంగా గొయ్యి తవ్వించి,  ‘ఈ భూమి సింహాచలం దేవస్థానానికి చెందుతుంది’ అని హెచ్చరిక బోర్డుని ఏర్పాటు చేయించారు.  దీంతో లేఅవుట్‌ పనులు ఆగిపోయాయి. కాగా జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి అనుచరుడు, కొంతకాలం క్రితం వైసీపీలో చేరిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కన్ను ఈ భూమిపై పడింది. పాత ఎల్‌ఆర్‌సీలను అడ్డంపెట్టుకుని ఆలయ భూమిని ఇళ్ల స్థలాల లేఅవుట్‌గా మారుస్తున్నాడు. తోట మధ్యలో నుంచి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాడు. ఈ స్థలం పక్క నుంచి నిత్యం ఆలయ అధికారులు, సిబ్బంది రాకపోకలు సాగిస్తుంటారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రస్తుతం ఇక్కడ వున్న మార్కెట్‌ విలువ ప్రకారం ఈ భూమి విలువ రూ.3 కోట్లకుపైగా వుంటుందని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2021-08-02T06:19:11+05:30 IST