apple iphone14: యాపిల్ కీలక ప్రకటన.. ఇకపై భారత్‌లో ఐఫోన్ 14 ..

ABN , First Publish Date - 2022-09-26T22:30:21+05:30 IST

యూఎస్(US) టెక్నాలజీ దిగ్గజం, ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ (apple) కీలక ప్రకటన చేసింది. ఇటివలే మార్కెట్లో విడుదలైన ఐఫోన్ 14 (iphone 14)ని ఉత్పత్తిని భారత్‌లో మొదలుపెట్టినట్టు కంపెనీ వెల్లడించింది.

apple iphone14: యాపిల్ కీలక ప్రకటన.. ఇకపై భారత్‌లో ఐఫోన్ 14 ..

న్యూఢిల్లీ: యూఎస్(US) టెక్నాలజీ దిగ్గజం, ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ (apple) కీలక ప్రకటన చేసింది. ఇటివలే మార్కెట్లో విడుదలైన ఐఫోన్ 14 (iphone 14) ఉత్పత్తిని భారత్‌లో మొదలుపెట్టినట్టు కంపెనీ వెల్లడించింది. సరికొత్త సాంకేతికతలు, కీలక భద్రత సామర్థ్యాలతో రూపొందించిన ఐఫోన్ 14 తయారీని ఇక్కడ మొదలుపెట్టడం పట్ల ఆనందంగా ఉందని పేర్కొంటూ సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. కాగా యాపిల్ కంపెనీకి ప్రస్తుతం భారత్‌లో ఫాక్స్‌కాన్(Foxconn) ప్రధాన తయారీదారుగా ఉంది. తమిళనాడులోని చెన్నై శివార్లలోని శ్రీపెరుంబుదూర్‌లో ఐఫోన్ల ఉత్పత్తి జరుగుతోన్న విషయం తెలిసిందే. 2017 నుంచి ఇక్కడ ఫోన్ల ఉత్పత్తి జరుగుతున్నా.. అవి పాత వెర్షన్ ఫోన్ల మాత్రమే. అయితే కొత్త మోడల్ ఐఫోన్ 14ని తొలిసారి భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. కాబట్టి మరికొన్ని రోజుల వ్యవధిలోనే భారత్‌లో తయారైన ఫోన్లను ఇక్కడివారు కొనుగోలు చేయనున్నారు. దేశీయంగా అమ్మకాలతోపాటు విదేశాలకు భారత్ నుంచి ఎగుమతి కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.


2025 నాటికి 25 శాతం ఉత్పత్తి..

యాపిల్ ప్రకటనపై ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ ‘జేపీ మోర్గాన్’ (JP Morgan) స్పందించింది. 2022 చివరి నాటికి ఐఫోన్ 14 గ్లోబల్ ఉత్పత్తిలో 5 శాతాన్ని భారత్‌లో చేపట్టాలని యాపిల్ కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు పేర్కొంది. 2025 నాటికి 25 శాతానికి పెంచాలని భావిస్తోంది. కాగా చైనాలో ఐఫోన్ ఉత్పత్తిని ఇతర ప్రాంతాలకు మళ్లించాలనే యాపిల్ ప్రణాళిక  భారత్‌లో ఉత్పత్తి ఆరంభించడం ద్వారా స్పష్టమవుతోంది. ఇదే సమయంలో భారత్ కస్టమర్లకు చేరువయ్యేందుకు యాపిల్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటివరకు చైనాలో ఉత్పత్తయ్యే ఫోన్లపైనే యాపిల్ ఆధారపడుతూ వచ్చింది. కొవిడ్ తర్వాత ప్రపంచమంతా దాదాపు కోలుకున్నట్టే కనిపిస్తున్నా.. చైనాలో మాత్రం ఇంకా పరిస్థితి అదేవిధంగా ఉంది. పలు ప్రధాన నగరాల్లో కొవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కంపెనీ కార్యకలాపాలు సంపూర్ణంగా కొనసాగడం లేదు. ఇతర దేశాల్లో ఉత్పత్తి ఈ లోటును భర్తీ చేసుకోవాలని యాపిల్ భావిస్తోంది.


మరోవైపు భారత్‌లో ఐఫోన్ విక్రయాలు పెంచుకోవడం కూడా యాపిల్ కంపెనీ లక్ష్యంగా ఉంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ప్రపంచ నంబర్ 2గా ఉన్న భారత్‌లో అమ్మకాలు పెంచుకోవడం ద్వారా లబ్దిపొందాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి భారత్‌లో యాపిల్ మార్కెట్ షేర్ 3.8 శాతంగా మాత్రమే ఉంది. యాపిల్ కంటే తక్కువ ధరలకే ఫోన్లు అందించే సామ్‌సంగ్, చైనాకు చెందిన షియోమీ మార్కెట్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. అయితే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అల్ట్రా-ప్రీమియం సెగ్మెంట్‌లో యాపిల్ కంపెనీ ఫోన్లే టాప్ సెల్లింగ్ బ్రాండ్‌ ఫోన్లుగా ఉన్నాయి. ఐఫోన్ 13 ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. కాగా ఐఫోన్ 14 ఆరంభ ధర రూ.79,900 (980 డాలర్లు)గా ఉంది. కాగా యాపిల్ ఫోన్ల విక్రయం ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. ప్రీమియం ట్రెండ్ కొనసాగుతున్న టాప్ 20 దేశాల్లో ఇండియా కూడా ఉందని కౌంటర్‌‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పథక్ వెల్లడించారు.


కానీ ధర విషయంలో  నిరాశేనా..

ఐఫోన్ 14 (iphone 14)ని భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ధర విషయంలో మార్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే తయారీ ఇక్కడ జరుగుతున్నప్పటికీ విభాగాలు మొత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. ఈ కారణంగానే భారత్‌లో తయారైనా ఫోన్ల ధరలు తగ్గకపోవచ్చనే అంచనాలున్నాయి. ఒకవేళ ఏమైనా తగ్గినా పెద్దగా ఉండకపోవచ్చుననే అంచనాలున్నాయి.

Updated Date - 2022-09-26T22:30:21+05:30 IST