Abn logo
Sep 26 2021 @ 03:39AM

8 కొత్త మెడికల్‌ కాలేజీల కోసం దరఖాస్తు

సన్నాహాలు ప్రారంభించిన ప్రభుత్వం.. దేశంలోనే ఇదే తొలిసారంటున్న వైద్యశాఖ 

ఒక్కో కాలేజీలో 150 ఎంబీబీఎస్‌ సీట్లు

2022-23 నాటికి అందుబాటులోకి 

నవంబరు, డిసెంబరులో ఎన్‌ఎంసీ తనిఖీ


హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కొత్తగా 8 వైద్య విద్య కళాశాలల ఏర్పాటు కోసం శనివారం ప్రభుత్వం దరఖాస్తు చేసింది. వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో 8 కాలేజీల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తులను జాతీయ వైద్య మండలి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఒక్కో కళాశాలను 150 ఎంబీబీఎస్‌ సీట్లతో ఏర్పాటు చేస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి ఇవి అందుబాటులో వస్తాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముందుగా సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మంచిర్యాల, మహబూబాబాద్‌లో ఏడు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో మరో వైద్య విద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన అంశాలను తనిఖీ చేసేందుకు ఎన్‌ఎంసీ బృందాలు ఈ ఏడాది నవంబరు-డిసెంబరు మాసాల్లో రాష్ట్రానికి రానున్నాయి. కాగా, దేశ చరిత్రలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకే ఏడాది ఎనిమిది వైద్య విద్య కళాశాలల కోసం దరఖాస్తు చేయడం ఇదే ప్రథమమని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.


ప్రస్తుతం రాష్ట్రంలో ఒక ఈఎ్‌సఐ, 9 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలున్నాయి. వాటిలో 1715 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అలాగే బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 50 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి.  కొత్తగా ఏర్పాటు కానున్న కాలేజీల్లో మొత్తం 1200 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ప్రైవేటులో 23 మెడికల్‌ కాలేజీల్లో 3350 వైద్య విద్య సీట్లున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ, ప్రైవేటులో కలపి మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 6315కు పెరుగనుంది.