రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ను నియమించాలి

ABN , First Publish Date - 2021-10-22T05:10:43+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల దళితులపై

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ను నియమించాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న కేవీపీఎస్‌ నాయకులు

  • కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ డిమాండ్‌
  • కలెక్టరేట్‌ ఎదుట కేవీపీఎస్‌ ధర్నా 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల దళితులపై అనేక కుల వివక్ష దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ను నియమించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) డిమాండ్‌ చేసింది. ఈమేరకు కలెక్టరేట్‌ ఎదుట ఆ సంఘ నేతలు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై ఇటీవల దాడులు, దౌర్జన్యాలు, హత్యలు పెరిగాయని, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అమానుష సంఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దళితబంఽధు కేవలం హుజూరాబాద్‌కే కాకుండా రాష్ట్రంలోని ప్రతి పేద దళిత కుటుంబానికి అందజేయాలని డిమాండ్‌ చేశారు. మూడేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్‌ ఇండస్ట్రియల్‌ ద్వారా అందుతున్న రుణాలకు సబ్సిడీ విడుదల కాక దళితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దళితులను పారిశ్రామిక వేత్తలుగా చేస్తామన్నారు, మూడెకరాల భూమి ఇస్తామన్నారు, డబుల్‌ బెడ్‌ రూమ్‌లు అందిస్తామంటూ పచ్చిబూటకాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ బ్యాగ్‌లాక్‌ పోస్టులు భర్తీ చేయడం లేదని విమర్శించారు. తక్షణమే బ్యాగ్‌లాక్‌ పోస్టులు భర్తీ చేయడంతోపాటు కార్పొరేషన్‌ రుణాలను వెంటనే విడుదల చేయాలన్నారు. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న వారి రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ప్రైవేటురంగంలో కూడా రిజర్వేషన్లు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. పేదలకు భూములు ఇవ్వకపోగా వారు అనుభవిస్తున్న ఇనామ్‌, అసైన్డ్‌ భూములను రైతు మార్కెట్‌ యార్డులు, ప్రకృతి వనాల పేరుతో దుర్మార్గంగా ప్రభుత్వం గుంజుకుంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. కులాంతర వివాహితులకు ఇస్తామన్న పరిహారం మూడేళ్లుగా అందడం లేదన్నారు. ధర్నా అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావును కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు కనకయ్య. జిల్లా కార్యదర్శి బి.శ్యామేల్‌, ఉపాధ్యక్షులు ప్రకాష్‌ కారత్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-22T05:10:43+05:30 IST