త్వరలో తాత్కాలిక వైద్యసిబ్బంది నియామకం

ABN , First Publish Date - 2021-05-17T05:32:55+05:30 IST

అర్జాస్‌ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద కరోనా బాధితులకు ఏర్పాటు చేస్తున్న 500 పడకల ఆస్పత్రిలో పనిచేసేందుకు తాత్కాలిక వైద్య సిబ్బందిని నియమించుకోనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌ తెలిపారు.

త్వరలో తాత్కాలిక వైద్యసిబ్బంది నియామకం
మీడియాతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌

ఆరు నెలలు అవకాశం...

పనిచేసినోళ్లకు వెయిటేజ్‌

మూడు రోజులకోసారి జ్వరాలపై సర్వే

జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌


అనంతపురం వైద్యం, మే 16: అర్జాస్‌ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద కరోనా బాధితులకు ఏర్పాటు చేస్తున్న 500 పడకల ఆస్పత్రిలో పనిచేసేందుకు తాత్కాలిక వైద్య సిబ్బందిని నియమించుకోనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏడీసీసీ బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌లో డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ రమే్‌షనాథ్‌, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, వైద్య కళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సాయిసుధీర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఆస్పత్రిలో పనిచేసేందుకు 50 మంది వైద్యులు, 300 మంది స్టాఫ్‌నర్సులు, 250 మంది ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు, ఇతర శానిటేషన్‌ సిబ్బంది అవసరం అవుతున్నారన్నారు. స్టాఫ్‌నర్సులకు సంబంధించి జిల్లాలో పీహెచ్‌సీల్లో అదనంగా ఉన్న సిబ్బందిని గుర్తించి, నియమిస్తామన్నారు. అందరికీ ఆస్పత్రి వద్దే వసతి కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారన్నారు. గతేడాది ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 2170 మంది వైద్య సిబ్బందిని అవసరం మేరకు నియమించుకోవాలని అనుమతి ఇచ్చిందన్నారు. కేసులు పెరిగిన నేపథ్యంలో అదనంగా మరో 20 శాతం నియామకానికి అవకాశం కల్పించిందన్నారు. ఈ లెక్కన 2715 మంది సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవడానికి అవకాశం ఉందన్నారు. గతంలో వివిధ కేటగిరిల్లో 1799 మందిని నియమించుకున్నామన్నారు. ఇందులో ప్రస్తుతం 1386 మంది వివిధ ఆస్పత్రుల్లో పని చేస్తున్నారన్నారు. ఇంకా 1189 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఇందులో 15 జనరల్‌ మెడికల్‌ ఆఫీసర్లు, ఒక స్టాఫ్‌ నర్సు, 15 మంది ఎంఎన్‌ఓలు గతంలో పనిచేసిన వారు విధుల్లో చేరేందుకు సమ్మతి తెలిపారన్నారు. మిగిలిన 109 స్పెషలిస్ట్‌ డాక్టర్లు, 123 జనరల్‌ మెడికల్‌ ఆఫీసర్లు, 63 స్టాఫ్‌నర్సులు, 186 ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. వీటి కోసం నోటిఫికేషన్‌ ఇచ్చి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు ద్వారా ఎంపిక చేస్తామన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఎస్‌ఎంఎస్‌ ద్వారా నియామకాల సమాచారం పంపుతామన్నారు. స్పెషలిస్ట్‌ డాక్టర్లకు రూ1.50 లక్షలు, జనరల్‌ డ్యూటీ డాక్టర్లకు రూ.70 వేలు, డెంటి్‌స్టలకు రూ.53495 చొప్పున గౌరవ వేతనం ఇస్తామన్నారు. ఆరు నెలలు అవకాశం ఉంటుందనీ, ఆ సమయం వరకు పనిచేస్తే నియామకాల్లో వెయిటేజ్‌ అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో మూడు రోజులకోసారి జ్వరాల సర్వే చేపడుతున్నామన్నారు. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, హోం ఐసోలేషన్‌ కిట్లను అందజేస్తున్నామన్నారు. వారి వివరాలను మెడికల్‌ ఆఫీసర్‌ యాప్‌లో నమోదు చేస్తున్నామన్నారు. సూపరింటెండెంట్‌  డాక్టర్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా సర్వజనాస్పత్రిలో 339 మందికి ఆక్సిజన్‌, 59 మందికి వెంటిలేటర్‌ చికిత్స అందిస్తున్నామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి నేరుగా ఆస్పత్రికి ఎక్కువ మంది రావడం వల్లే చికిత్స అందించలేకపోతున్నామన్నారు. అందుకే ముందుగా 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి, ఆస్పత్రికి రావాలని సూచించారు.


పాజిటివిటీ 7.83 శాతం... మరణాలు 0.80 శాతం..

రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతోపాటు జిల్లాలోనూ కరోనా కేసులు అధికంగా వస్తున్నాయని డీఎంహెచ్‌ఓ తెలిపారు. జిల్లాలో 14.57 లక్షల మందికిపైగా కొవిడ్‌ పరీక్షలు చేయగా అందులో 1.14 లక్షల మందికిపైగా కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఇందులో ప్రస్తుతం 17465 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని చెప్పుకొచ్చారు. పాజిటివ్‌ కేసులతో సంబంధం ఉన్న 6.60 లక్షల మందికిపైగా గుర్తించామన్నారు. ఇందులో ప్రైమరీ కాంటాక్ట్‌ 3.22 లక్షల మంది, సెకెండరీ కాంటాక్ట్‌ 3.38 లక్షలు ఉన్నారన్నారు. జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు 7.83 శాతం ఉండగా మరణాల రేటు 0.80 శాతం ఉందన్నారు.


Updated Date - 2021-05-17T05:32:55+05:30 IST