డిజిటల్‌ అసిస్టెంట్లకు కరోనా విధులు

ABN , First Publish Date - 2020-04-10T11:54:44+05:30 IST

కొవిడ్‌-19 వ్యాప్తి నివారణలో భాగంగా గ్రామ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్లను ప్రాథమిక, సామాజిక ఆసుపత్రుల్లో

డిజిటల్‌ అసిస్టెంట్లకు కరోనా విధులు

ఆరోగ్య కేంద్రాల్లో నియామకం

సీహెచ్‌సీలకు చేరిన కరోనా పరీక్ష కిట్లు

మాస్కులు, శానిటైజర్లు కరువు 


శృంగవరపుకోట ఏప్రిల్‌ 9: కొవిడ్‌-19 వ్యాప్తి నివారణలో భాగంగా గ్రామ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్లను ప్రాథమిక, సామాజిక ఆసుపత్రుల్లో విధులకు నియమిస్తున్నారు. ఒక్కో ఆసుపత్రిలో నలుగురు వరకు డిజిటల్‌ అసిస్టెంట్లు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ ఆదేశించారు. ఈ మేరకు మండల పరిషత్‌ అధికారులకు జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహక అధికారి సూచించారు. రాష్ట్రంలో  11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతానికి లేవు.  విశాఖలో ఉంటున్న జిల్లా ప్రజలు గ్రామాలకు చేరుకుంటున్నారు. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. అప్పుడు ఇబ్బందులు పడేకంటే ముందే జాగ్రత్త పడితే బాగుంటుందన్న అభిప్రాయంతో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ వీలైనంత మంది ఉద్యోగుల సేవలను వినియోగించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా ఇదే సూచన చేశారు. 


గ్రామ సచివాలయాల డిజిటల్‌ అసిస్టెంట్లు ఇకనుంచి ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే  కరోనా అనుమానిత కేసులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయనున్నారు. జిల్లా కేంద్రాసుపత్రి, పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రుల్లోనూ ఇకనుంచి కరోనా పరీక్షలు విస్తృతంగా జరుగనున్నాయి. ఇందుకు అవసరమయ్యే కిట్లను ఆసుపత్రులకు త్వరలో సమకూర్చనున్నారు. సదుపాయాలను మెరుగుపర్చనున్నారు.


ఇప్పటికే చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ), దంత వైద్యుల్లో ఒకరితో పాటు ల్యాబ్‌ టెక్నిషియన్‌లకు మహారాజా ఆసుపత్రిలో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. కరోనా అనుమానిత కేసుల సంరక్షణకు మూడు రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రతి మండలం, నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ విదేశాలు, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌ చేస్తారు. జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులకు సామాజిక ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తారు. ఈ సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచుతారు. పాజిటివ్‌గా వచ్చిన వారిని జిల్లా కేంద్రంలోని మహారాజ ఆసుపత్రి, కోవిడ్‌-19గా తీర్చిదిద్దిన మిమ్స్‌కు తరలిస్తారు. కోలుకున్న వరకు అక్కడే సంరక్షణ ఉంటుంది.


ఇదిలా ఉండగా అనుమానిత కేసులను పరీక్షించేందుకు తీర్చిద్దిన ప్రభుత్వ సామాజిక ఆసుపత్రులకు వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ), ఎన్‌ 95 మాస్కులు, శానిటైజర్లు అవసరం మేరకు సమకూర్చలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది మాస్కులు, శానిటైజర్లు లేకుండానే పని చేస్తున్నారు. 

Updated Date - 2020-04-10T11:54:44+05:30 IST