కరోనా నుంచి కోలుకున్న పోలీసులకు అభినందన సభ

ABN , First Publish Date - 2020-08-07T15:07:23+05:30 IST

కరోనా సమయంలో పోలీసులు చేస్తున్న సేవలకు లభించిన గౌరవం గత వందేళ్లలో లభించలేదని, ఇది పోలీసు శాఖకు గర్వకారణమని

కరోనా నుంచి కోలుకున్న పోలీసులకు అభినందన సభ

ప్లాస్మా దానం చేయాలని సీపీ పిలుపు


బోయిన్‌పల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలో పోలీసులు చేస్తున్న సేవలకు లభించిన గౌరవం గత వందేళ్లలో లభించలేదని, ఇది పోలీసు శాఖకు గర్వకారణమని సీపీ అంజనీకుమార్‌ అన్నారు. కరోనా బారిన పడి కోలుకుని తిరిగి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. నార్త్‌జోన్‌ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో కరోనా బారిన పడి కోలుకుని విధులకు హాజరవుతున్న సిబ్బందిలో మనో ధైర్యం నింపేందుకు సికింద్రాబాద్‌ ఇంపీరియల్‌ గార్డెన్‌లో డీసీపీ కల్మేశ్వర్‌ ఆధ్వర్యంలో గురువారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. వైరస్‌ బారిన పడి కోలుకున్న పోలీసు సిబ్బంది మాట్లాడుతూ.. కరోన సోకిన వెంటనే అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఇంట్లో వారికి దూరంగా హోం ఐసొలేషన్‌లో ఉండి మహమ్మారి నుంచి బయటపడ్డామని తెలిపారు. 


ఉన్నతాధికారులు తమకు అన్నివేళలా సహకారం అందించారని చెప్పారు. సీపీ మాట్లాడుతూ.. పోలీసులు కరోనాతో పోరాటం చేస్తున్నారని, విపత్కర పరిస్థితుల్లో మహిళా పోలీసులు కూడా రోడ్లపై ఉంటూ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. అందరూ పరిశుభ్రత, స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రతిరోజూ వ్యాయామం చేయాలన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే ఇతరులకు ప్రాణదానం చేసినట్లవుతుందన్నారు. ఉత్తర మండలంలో 220 మంది పోలీసులకు కరోనా సోకగా.. 182 మంది కోలుకున్నారని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన 125 మందికి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

Updated Date - 2020-08-07T15:07:23+05:30 IST