సముచిత నిర్ణయం

ABN , First Publish Date - 2022-01-14T06:19:53+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా ఎదురైన భద్రతాపరమైన అంశంలో సుప్రీంకోర్టు స్వయంగా విచారణకు సంకల్పించడం స్వాగతించాల్సిన పరిణామం...

సముచిత నిర్ణయం

ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా ఎదురైన భద్రతాపరమైన అంశంలో సుప్రీంకోర్టు స్వయంగా విచారణకు సంకల్పించడం స్వాగతించాల్సిన పరిణామం. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ రెండు వేర్వేరు రాజకీయపార్టీలు అధికారంలో ఉంటూ, అవి రెండూ త్వరలో ఎన్నికలకు పోబోతున్న రాష్ట్రంలో అధికారం కోసం పోరాడుతున్న తరుణంలో వేర్వేరు దర్యాప్తులు నిజం తేల్చగలవా? ఈ అవాంఛనీయఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విడివిడి విచారణలను నిలిపివేసి సర్వోన్నత న్యాయస్థానమే ఒక ఉన్నతస్థాయి విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసి మంచిపని చేసింది. ప్రధాని పర్యటనలో అపశృతికి కారణాలనీ, కారకులనీ ఇందూ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ నిగ్గుతేల్చుతుందని ఆశిద్దాం.


ప్రధాని కాన్వాయ్ నిరసనకారులకు కాస్తంత దూరంగా ఓ వంతెనమీద ఇరవైనిముషాల సేపు నిలిచిపోవడం దిగ్భ్రాంతికరమైన విషయం. ‘ప్రాణాలతో తిరిగిరాగలిగినందుకు మీ ముఖ్యమంత్రికి థాంక్స్’ అని మోదీ పంజాబ్‌లోనే ఓ విసురు విసిరి ఢిల్లీ తిరిగొచ్చేశారు. ఆ తరువాత కాంగ్రెస్, బీజేపీ నాయకుల పరస్పర విమర్శలు పతాకస్థాయికి చేరాయి. పొరుగుదేశంతో చేతులు కలిపి ప్రధాని హత్యకు ఎదుటిపార్టీ కుట్రపన్నిందన్నంత వరకూ పోయారు కొందరు. ప్రధాని భద్రతకు ఏటా ఆరువందలకోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెడుతూ, ఆయన భద్రతకు పూర్తిగా బాధ్యతపడవలసిన అతిశక్తిమంతమైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) ఈ పర్యటన సందర్భంగా సమన్వయంలోనూ, సమయానుకూల కీలక నిర్ణయాల్లోనూ ఎందుకు తప్పటడుగులు వేసిందన్నది ప్రశ్న. స్థానిక పోలీసులనుంచి ఇంటలిజెన్స్ విభాగాల వరకూ సమస్త వ్యవస్థలూ దానికి సహకరిస్తూ, అవసరమైతే ప్రధానిని కాదనడానికీ, పదమనడానికీ విశేషాధికారాలున్న ఈ గ్రూపు ఏ కారణంగా విఫలమైందన్నది నిగ్గుతేలాలి. ప్రధాని భద్రతకు సంబంధించిన అంశం రాజకీయం కావడం కొత్తేమీ కాకపోవచ్చు కానీ, తప్పు ఎదుటివారిమీదకు నెట్టేయడానికి వీలైనరీతిలో ఎవరికివారే దర్యాప్తులు సంధించడం సరికాదు. ఈ అంశాన్ని మరింత కాలం సాగదీసి, ఎన్నికల ముందు లబ్ధిపొందాలన్న ఆలోచనకు సుప్రీంకోర్టు నిర్ణయం బ్రేకు వేసినట్టు కనిపిస్తున్నది.


ఒక్కసీటు కూడా దక్కదనుకొనే రాష్ట్రాల్లో కూడా ఏకంగా అధికారంలోకి వచ్చేయబోతున్న స్థాయిలో బీజేపీ ఎన్నికల యుద్ధం చేస్తుంది. మోదీ షా నాయకత్వంలో ఆ పార్టీ ప్రతీ ఎన్నికలోనూ ప్రదర్శించే పోరాట స్ఫూర్తిని కచ్చితంగా అభినందించాల్సిందే. పంజాబ్‌లో బీజేపీ ప్రత్యక్షంగా వేయగలిగే ప్రభావం ఎంతటిదో తెలియనిదేమీ కాదు. రెండు సీట్లున్న ఈ పార్టీ కెప్టెన్ అమరీందర్‌తోనూ, ఆయన అకాలీదళ్ చీలికవర్గంతోనూ చేతులు కలిపి, కలిసి అధికారంలోకి రావాలనుకుంటున్నారు. పంజాబ్ ఎన్నికలు రాహుల్ ప్రియాంకల రాజకీయ పరిపక్వతకు పరీక్ష. చపలచిత్తుడైన సిద్దూని నమ్మి బలమైన అమరీందర్‌ను గెంటేశారన్న విమర్శలకు దళితుడైన చన్నీ నియమాకం ధీటైన సమాధానమే చెప్పింది. కానీ, ఆ వెంటనే సిద్దూ రాజకీయ డ్రామా పార్టీ పరువు దిగజార్చింది. ఇప్పుడు కూడా సిద్దూ కొత్త సీఎంను నియమించేది కాంగ్రెస్ అధిష్ఠానం కాదు, ప్రజలేనంటూ ఏదో వ్యాఖ్యచేశారు. ఉపరితలంలో ఎంతో చక్కగా కనిపిస్తున్నా, కాంగ్రెస్ అభిమానులు మాత్రం దీనిని అధిష్ఠానం మీద తిరుగుబాటు మాటగానే తీసుకున్నారు. సిద్దూ దూకుడు వ్యాఖ్యలు, ప్రతీ చిన్నవిషయానికీ చన్నీతో గొడవపడటం పార్టీకి మేలు చేయవు. చన్నీని దూరం పెట్టి సర్వం తానేఅయి సిద్దూ వ్యవహరించడం ముప్పైశాతం దళితులను మెప్పించదు. ఈ ఇద్దరి మధ్యా ఇప్పటికైనా సయోధ్య కనిపించపోతే రేపు అధికారంలోకి కూడా రాలేకపోవచ్చు. ప్రస్తుతం ఇరవైస్థానాలు కూడా లేని ఆమ్ ఆద్మీకి పార్టీకి పంజాబ్‌లో మంచి విజయాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా తాను ఎవరిని అనుకుంటున్నదీ చెబుతూనే, ప్రజాభిప్రాయాన్ని కూడా స్వీకరిస్తున్నట్టుగా కనిపించగలరు కేజ్రీవాల్. ఆయన ప్రకటిస్తున్న పథకాలు దళితులు, పేదలు, మహిళలు, మధ్యతరగతిని విశేషంగా ఆకర్షించగలవని అంటున్నారు. ప్రధానంగా రైతులను, దళితులను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలన్నీ ప్రయాస పడుతున్న పంజాబ్‌లో ఎన్నికల ముఖచిత్రం రాబోయే రోజుల్లో ఏ విధంగా మారుతుందో చూడాలి.

Updated Date - 2022-01-14T06:19:53+05:30 IST