Abn logo
Mar 19 2020 @ 03:25AM

సముచిత తీర్పు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సమర్థిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి పెద్ద దెబ్బ. కరోనా విస్తరణ నేపథ్యంలో, కేంద్రప్రభుత్వం దానిని జాతీయవిపత్తుగా ప్రకటించిన కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం మొన్న ఆదివారం ఎన్నికలను ఆరువారాలు వాయిదా వేయడం అధికార పక్షానికి ఆగ్రహం తెప్పించింది. ఎన్నికల కమిషనర్‌పై గవర్నర్‌కు ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశారు. సీఎం అయిన పదినెలలకు మొదటిసారి విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి, ఎన్నికల వాయిదాకు కరోనా ఓ సాకు మాత్రమేనంటూ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయికి తగనిరీతిలో హైకోర్టు న్యాయమూర్తితో సమానహోదా కలిగిన ఎన్నికల కమిషనర్‌కు పలు దురుద్దేశాలు ఆపాదించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎన్నికల సంఘం నిర్ణయాన్నే సమర్థించిన నేపథ్యంలో దానికీ ఏవో ఆపాదనలు చేస్తూ, కొత్త భాష్యాలు చెబుతారేమో చూడాలి.


కరోనా విస్తరణ ప్రమాదం పొంచివున్న స్థితిలో ఎన్నికల సంఘం తీసుకున్న వాయిదా నిర్ణయాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నది సుప్రీంకోర్టు విస్పష్టమైన అభిప్రాయం. వాయిదా కొనసాగించడంతో పాటు, ఎన్నికలు తిరిగి ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించాల్సింది కూడా ఎన్నికల సంఘమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్‌ ఎత్తివేయమనడం ద్వారా అమలులో ఉన్న పథకాలకు ఆటంకం లేకుండా చూస్తూనే, కొత్తపథకాల ప్రకటనకూ, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకూ అడ్డుకట్టవేసింది. ఆరువారాల తరువాత, అప్పటి తీవ్రతను బట్టి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. మొన్న ఆదివారం ఎన్నికల వాయిదా ప్రకటనతో పాటుగా కమిషనర్‌ రమేష్‌కుమార్‌ చెప్పింది కూడా ఇదే. కరోనా హెచ్చరికలను ఉపసంహరించుకున్న మరుసటిరోజునుంచే ప్రక్రియ ఆగినచోటనుంచి తిరిగి ఆరంభమవుతుందనీ, ఏకగ్రీవాలన్నీ యథాతథంగా చెల్లుతాయనీ ఆయన హామీ ఇచ్చారు. ప్రజారోగ్యం దృష్ట్యానే ఎన్నికలు వాయిదావేయవలసి వచ్చిందంటూ కేంద్రం ప్రకటనను, వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలను ఆయన గుర్తుచేశారు. బ్యాలెట్‌ పేపర్‌ వాడుతున్నందున ఓటువేయడానికి అధిక సమయం పడుతుందనీ, ప్రజలు పెద్ద ఎత్తున గూమిగూడటం, బారులు తీరడం వల్ల అధికస్థాయి హ్యూమన్‌ కాంటాక్ట్‌తో ముప్పు ప్రబలుతుందని గుర్తుచేశారు. నిజానికి, ఎన్నికల సంఘం కంటే, న్యాయస్థానాలకంటే ప్రజారోగ్యానికి బాధ్యతపడాల్సిందీ, జాగ్రత్తలు తీసుకోవాల్సిందీ పాలకులే. కానీ, రాజధాని తరలింపు, మండలి రద్దు సహా అనేక అంశాలపై రాష్ట్రం అట్టుడికి పోతున్నా మీడియా ముందుకు రాని ముఖ్యమంత్రి తన తొలి విలేఖరుల సమావేశంలో ఎన్నికల కమిషనర్‌పై కుత్సితమైన విమర్శలు చేశారు. కరోనాపై పోరులో ప్రపంచం తలకిందులైపోతుంటే, పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ సిద్ధాంతం ముందుకు తెచ్చి అప్రదిష్టపాలైనారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఇటువంటి మాటలతో కరోనాను తీసిపారేస్తుంటే, దానికట్టడికి ప్రభుత్వ యంత్రాంగం చొరవచూపగలదా, చురుకుగా వ్యవహరించగలదా? తుడిచేస్తే, కడిగిస్తే కరోనా పోతుందని అంటున్నప్పుడు స్కూళ్ళనుంచి, యూనివర్సిటీల వరకూ సెలవులు ఎందుకు ప్రకటించినట్టు, ఉద్యోగపరీక్షలు ఎందుకు వాయిదావేసినట్టు? ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులకోసమే ఈ ఎన్నికల వెంపర్లాట అనుకున్నప్పటికీ, కేంద్రమే కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో, నిబంధనలు సవరించేట్టు చేసి, నిధులు అందేట్టు చూడటం జగన్మోహన్‌ రెడ్డి బాధ్యత.


ఎన్నికల వాయిదా కరోనాకంటే ప్రమాదకరమైన విపత్తుగా అధికారపక్షం చిత్రీకరించడం విచిత్రం, విషాదం. జగన్మోహన్‌ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ అనేకమంది మంత్రులు సైతం ఎన్నికల కమిషనర్‌ను కులం పేరుతో విమర్శించారు, రాజకీయపక్షపాతాలు అంటగట్టారు. చీఫ్‌ సెక్రటరీని సైతం ఈ రాజకీయ విషవలయంలోకి లాగారు. స్వతంత్ర వ్యవస్థలన్నీ తన ముందు సాగిలబడాలని అనుకోవడం, భిన్నంగా జరిగితే జీర్ణించుకోలేక దుమ్మెత్తిపోయడం అనుచితం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరంభమైననాటినుంచి అధికారపక్షం ఎంత అరాచకంగా ప్రవర్తించిందో ప్రజలకు తెలుసు. గతంలో ఎన్నడూ లేని దుర్మార్గాలను రాష్ట్రం కళ్ళారాచూసింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పదినెలల జనరంజక పాలనతో విజయం తథ్యమని వాదించినవారు ఇంత రచ్చ ఎందుకు చేశారో అర్థంకాదు. ఎన్నికలు ఎటూ వాయిదాపడ్డాయి ఇప్పటికైనా ప్రభుత్వం కరోనామీద దృష్టిపెట్టడం ఉత్తమం.

Advertisement
Advertisement
Advertisement