అప్రూవర్‌గా దస్తగిరి!

ABN , First Publish Date - 2021-11-27T08:06:12+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ-4గా ఉన్న షేక్‌ దస్తగిరి తరఫున సీబీఐ వేసిన అప్రూవర్‌ పిటిషన్‌ను అనుమతిస్తూ..

అప్రూవర్‌గా దస్తగిరి!

వివేకా హత్యకేసులో పిటిషన్‌కు కడప కోర్టు ఓకే

సాక్షిగా వాంగ్మూలం నమోదుకు ఆదేశం

పులివెందుల కోర్టులో మరోసారి నమోదుకు చాన్స్‌


కడప (రూరల్‌), నవంబర్‌ 26: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ-4గా ఉన్న షేక్‌ దస్తగిరి తరఫున సీబీఐ వేసిన అప్రూవర్‌ పిటిషన్‌ను అనుమతిస్తూ కడప సీనియర్‌ సివిల్‌జడ్జి(సబ్‌కోర్టు) ఎస్‌.కృష్ణన్‌కుట్టి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈమేరకు షేక్‌ దస్తగిరిని ముద్దాయి స్థానం నుంచి సాక్షి స్థానానికి పరిగణించి అతడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని పులివెందుల కోర్టును ఆదేశించారు. దీంతో పులివెందుల కోర్టులో దస్తగిరి వాంగ్మూలాన్ని మరోసారి నమోదు చేసే అవకాశం ఉంది.


శివశంకర్‌రెడ్డిని విచారించిన సీబీఐ

 మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు శుక్రవారం కస్టడీలోకి తీసుకుని విచారించారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సుదీర్ఘంగా విచారించినట్లు తెలుస్తోంది. పులివెందుల కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఈ విచారణ సాగుతోంది. 


గంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌ వాయిదా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దుచేయాలని 20 రోజుల క్రితం నాల్గవ అదనపు జిల్లా కోర్టు(ఫోర్త్‌ ఏడీజే కోర్టు)లో  సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ జరిపి 29వ తేదీకి వాయిదా వేసినట్టు సమాచారం.

Updated Date - 2021-11-27T08:06:12+05:30 IST