Abn logo
Jun 28 2021 @ 00:56AM

అప్పుడే ఎక్కడికి?

సూర్యుడిని వండుకొని, చంద్రుడిని నంజుకొని, 

                     చుక్కలను అద్దుకున్న మేఘాలను కప్పుకొని 

భూమిని ఆకాశాన్ని కాళ్లు చేతులు చేసుకొని 

పెంచుకున్న సంపదనంతా వదిలిపెట్టి ఎక్కడికి పోతున్నారు?


చితాగ్ని కెరటాలు ధరించి ఏ లోకాన్ని ఏలాలనుకుంటున్నారు? 

ఎక్కడ ఏ వజ్రాల గనులున్నాయని 

జీవితానుభవాల పలుగు పార పట్టుకొని పరుగెడుతున్నారు? 


రోగి ఛాతి మీద ఆనించిన హృదయభారమితిని అలాగే వదిలేసి 

ఆఫీసు ఫైలుపై సంతకం పూర్తి కాకముందే బయలుదేరి 

ఎక్కడి పనులు అక్కడే ఆపేసి 

ఈ వయా యమాసుపత్రుల పయనమెక్కడికి? 


అమ్మ నాన్న, తమ్ముడు అన్న, అక్క చెల్లెలు, 

సహచరులు బిడ్డలు, ప్రియుడు ప్రేయసి, 

తోడు నడిచిన, నవ్విన ఏడ్చిన ఏడ్పించిన వారందరిమీద పెంచుకొని దాచుకున్న 

చల్లని వెచ్చని కనుసంద్రాలను ఏ భూమిలో పోసి ఏ వర్షాలు కురిపించాలని 

ఏ పంటలను పండించాలనే భ్రమలతో సాగిపోతున్నారు?


అక్కడి నుంచి మా మీద కూడా చినుకులై మళ్లీ మళ్లీ కురుస్తారా 

మమ్మల్ని కూడా ఈ మురుగు కాల్వల్లోంచి మీ దగ్గరకు చేదుకుంటారా?


మీ చేత, మీ ఓటు చేత పద్మాసనం వేయించి 

మీ శ్వాసలను నడిమధ్యలోనే చిదిమేసి, 

మా మీద మీరు పెట్టుకున్న గాఢ విశ్వాసాన్ని 

పరిపరి వేషాలతో వమ్ము చేసిన మా నిర్వాకాన్ని 

ఆ విధంగానైనా మాకు గుర్తు చేస్తారా, మమ్మల్ని ఎప్పటికైనా క్షమిస్తారా 


మీ రంగు రంగుల కొన ఊపిరి బాధల కుంచెలతో 

మా రాజపీఠాల మీద మమ్మల్ని మనుషులుగా కాక 

దయ్యాలుగానైనా చిత్రించి మా తప్పును మన్నిస్తారా?

నిజం