అప్రమత్తంగా ఉండండి. అండగా మేముంటాం.

ABN , First Publish Date - 2021-11-26T05:54:08+05:30 IST

తమ బతుకులు అన్యాయమైపోయాయంటూ కాళ్లమీద పడి రోదించిన రైతులు.. వరద సహాయక శిబిరాలకు వెళితే మీరు టీడీపీ వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపొందని తరిమేశారయ్యా! అంటూ ప్రజల విన్నపాలు.

అప్రమత్తంగా ఉండండి.   అండగా మేముంటాం.

మీ కోసం చివరి క్షణం వరకు పోరాడుతాం

వరద బాధితులకు చంద్రబాబు భరోసా 

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై నిప్పులు


నెల్లూరు, నవంబరు25(ఆంధ్రజ్యోతి): 

కొట్టుకుపోయిన రోడ్లు.. ఇసుక మేటలుగా మారిన గ్రామాలు. కంటికి కనిపించకుండా పోయిన పొలం గట్లు. కడలి పాలైన కోట్లాది రూపాయల మత్స్య సంపద.. పూడిపోయిన రొయ్యల గుంటలు.. నడుము లోతు మునిగిపోయిన ఇళ్లు.. పాడైన గృహోపకరణాలు.. వరద నుంచి తేరుకుని ఐదు రోజలు గడుస్తున్నా తిండి దొరక్క అల్లాడుతున్న పేదలు... నెల్లూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లోని దృశ్యాలివి. 

తమ బతుకులు అన్యాయమైపోయాయంటూ కాళ్లమీద పడి రోదించిన రైతులు.. వరద సహాయక శిబిరాలకు వెళితే మీరు టీడీపీ వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపొందని తరిమేశారయ్యా! అంటూ ప్రజల విన్నపాలు.

చెరువు తెగిపోయి రోడ్డు మీద పడితే దారిన పోయే ఇద్దరు పిల్లలు ప్రాణభయంతో కరెంటు స్తంభానికి అత్తుకొని ఎనిమిది గంటలు అలాగే అల్లాడి పోయారు సార్‌...ఎంపీడీఓకు, ఎమ్మార్వోకు ఎవరికి ఫోన చేసినా పట్టించుకోలేదు. వీడియోలు తీసి పెట్టండి చూస్తాం అంటూ సలహా ఇచ్చారు సార్‌. చివరికి మేమే 30 వేలు చందాలు వేసుకొని ప్రైవేటు బోటు తెప్పించి కరెంటు ఫోల్‌కు వేలాడుతున్న పిల్లలను కాపాడుకున్నాం.. అంటూ అధికారుల నిర్దయను వివరించిన గంగపట్నం ప్రజలు.

సార్‌... ఇదిగో చూడండి. నేను..నా ఇద్దరు చిన్న పిల్లలు. ఐదు రోజులుగా తిండి దొరకలేదు. ఎవరికైనా చెప్పి కాసింత అన్నం పెట్టించండి సార్‌.. అంటూ చంద్రబాబును ప్రాధేయపడిన వంటరి మహిళ.

కరకట్ట తెగి వరద నీరు ఊరిమీద పడితే మూడు రోజులు బ్రిడ్జిమీదే బతికామయ్యా. మా మొహం చూసిన వాళ్లు లేదు. అంటూ ఆవేదన వ్యక్తం చేసిన గాంధీ గిరిజన కాలనీ వాసులు..

మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల్లో గెలవడం కోసం ఇంటికి పది వేలు ఇచ్చారు సార్‌. ఇప్పుడు వరదనీటిలో పడి ఇంట్లోని సర్వస్వం కొట్టుకుపోతే రెండువేలు ఇచ్చారు. అది కూడా వైసీపీ వాళ్లకు మాత్రమే ఇచ్చారు. వీళ్లు గెలవడానికి పది వేలు. మేము బతకడానికి రెండు వేలా!? ఎక్కడి న్యాయం సార్‌ ఇది అంటూ నెల్లూరు నగర ముంపువాసుల ఆవేదనలు. 

గుండెలు పిండే ఈ సన్నివేశాలు టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆయనతోపాటు పర్యటించిన ప్రతి ఒక్కరి గుండెను పిండేశాయి. 


నెల్లూరు ముంపు ప్రాంతాలను సందర్శించడానికి వచ్చిన చంద్రబాబు ప్రతి ఒక్కరి బాధలను విన్నారు. ముంపునకు గురైనా గుడిసెల్లోకి వెళ్లి బాఽధితులను ఓదార్చారు. చాలా చోట్ల వరద వల్ల బత్తెం కోల్పోయిన పేద కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున రూ. ఐదు వేలు తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.  ఇందుకూరుపేట మండలం పూర్తి చేసుకుని నెల్లూరు నగరం చేరే సరికి రాత్రి 8 గంటలు అయినా బాధిత ప్రజలు ఆయన కోసం వేచి చూశారు. వారి బాధలు ఎన్ని ఉన్నా బాబును ఘనంగా స్వాగతించారు. చంద్రబాబు సెక్యూరిటీ ఆంక్షలను కూడా లెక్క చేయక గిరిజన కాలనీల్లోని ఇరుకు రోడ్లు, చీకటి నిండిన దారుల్లో నడచి కాలనీలు మొత్తం పర్యటించారు.

తెగిపోయిన గంగపట్నం చెరువు, గిరిజనకాలనీలో తెగిన పెన్నా నది కరకట్టలను పరిశీలించారు. అర్ధరాత్రి  11.15 గంటల వరకు వెంకటేశ్వరపురం, భగతసింగ్‌ కాలనీ, టిడ్కో గృహసముదాయాల్లో పర్యటించారు. బాధితులకు ధైర్యం నూరిపోసి, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇసుక స్మగ్లర్ల కారణంగా కరకట్టలు తెగిపోతే బాధిత కుటుంబాల పట్ల ఈ ప్రభుత్వం కనీస కనికరం కూడా లేకుండా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఇంట్లో నిత్యావసర సరుకులు, టీవీ, ఫ్రిడ్జ్‌, గ్రైండర్‌ ఇలా అన్ని గృహోపరకరణాలు నాశనం అయితే ప్రజలకు ముష్టి పడేసినట్లు రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా!? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద కారణంగా ఇళ్లు కూలిపోయిన వారికి ఆరు, ఏడు లక్షలు ఖర్చు చేసి కొత్త ఇళ్లు కట్టించి ఇవ్వాలని, వరద కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికి కనీసం 15వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జగనమోమనరెడ్డి అవినీతి సంపాదనలో ప్రజలు వాటా అడగటం లేదనీ, ప్రభుత్వం వద్ద ఉన్నది ప్రజల డబ్బే.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారి డబ్బు వారికి ఇవ్వాలనే కనికరం కూడా ేదా..!? అని  ప్రశ్నించారు. 


కోతల మంత్రి ఏరీ!?


‘‘రాబోయే మూడు రోజుల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఉన్న కోతల మంత్రి తెగిపోయిన కరకట్టలు తెగిపోయి ఐదు రోజులు అవుతున్నా ఇంకా వాటిని ఎందుకు పూడ్చలేదో సమాధానం చెప్పాలి.’’ చంద్రబాబు కోరారు. మళ్లీ వరదలు వస్తే ఈ ప్రజలు ఏమి కావాలి, ఎక్కడికి వెళ్లాలో ఆలోచించే జ్ఞానం లేదా...అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎప్పుడు ఆపద సంభవించినా అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రజలకు బరోసా ఇచ్చారు. ‘‘హుద్‌హుద్‌ తుఫాన అతలాకుతలం చేస్తే వారం రోజుల్లో ఆ నష్టాన్ని సరిచేశాం. 2015లో నెల్లూరులో ముంపు వస్తే మూడు రోజులు ఇక్కడే కూర్చొని ప్రజలను ఆదుకున్నాం. భవిష్యత్తులో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. కాని ఈ వైసీపీ నాయకులు అవినీతికి కరకట్టలు కూడా కరిగిపోయాయి. వీరి అవినీతి వల్ల వేలాది కుటుంబాలు వీధినపడ్డాయి. సర్వస్వం నష్టపోయాయి. ఈ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకున్నా, పట్టించుకోకున్నా ఆపద సమయాల్లో మీ వెంట తెలుగుదేశం పార్టీ ఉంటుంది. చివరి నిమిషం వరకు మీ కోసం పోరాడుతుంది. ఎవరూ అధైర్యపడవద్దు. మీకు అండగా మేముంటాం. వరద సాయంలో ప్రభుత్వం పక్షపాతం చూపిస్తే న్యాయస్థానానికి ఈడ్చి మీకు న్యాయం జరిగేలా చూస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీకు సాయం చేసేలా చేస్తాం..!’’ అని భరోసా ఇచ్చారు. 


Updated Date - 2021-11-26T05:54:08+05:30 IST