ఆక్వా చెరువుతో అశాంతి!

ABN , First Publish Date - 2022-01-24T04:33:58+05:30 IST

సమస్య ఉంది..ఫిర్యాదు చేసినా పట్టించుకోరు.. వినతులిస్తే వినరు.. అధికారులు నిర్లక్ష్యం కారణంగా వందలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఆక్వా చెరువుతో అశాంతి!
మాకు శాంతి లేదు : చెరువును చూపిస్తున్న శాంతినగర్‌ కాలనీ వాసులు

ఆకివీడు శాంతినగర్‌వాసుల ఇబ్బంది
ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు


ఆకివీడు, జనవరి 23 : సమస్య ఉంది..ఫిర్యాదు చేసినా పట్టించుకోరు.. వినతులిస్తే వినరు.. అధికారులు నిర్లక్ష్యం కారణంగా వందలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శాంతినగర్‌ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య పదెకరాల ఆక్వా చెరువు సాగు చేస్తున్నారు. దీని కారణంగా భూగర్భ జలాలు పాడవడం, దోమలు, పాముల బెడద, మరుగుదొడ్లు ట్యాంకులు నిండిపోవడం,వాడకపు నుయ్యిలు కలుషితమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఆ చెరువుకు మురుగు బోదె లేకపోవడం తో ఉప్పునీరు పంట కాల్వలోకి వదిలేస్తున్నారు.ఆ నీరు దుంపగడపకు వెళ్లే కాలువలో కలుస్తోంది. దీంతో తాగునీరు దుర్వాసన వస్తుందని దుంపగడప గ్రామస్థులు వాపోతున్నారు. చెరువులో రసాయనాలు పిచికారీ చేసే సమయంలో సమీపంలోని కుటుంబీకులు ఆక్సిజన్‌ అందక ఆసుప త్రుల పాలవుతున్నారు.  దీనిపై మత్స్యశాఖాధికారికి ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా వచ్చి చెరువు యజమానితో మాట్లాడి వెళ్ళిపోతున్నారని వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉప్పునీటి బోరు వేసినా కనీసం అడిగేవారే లేరు. దీనిపై ఏలూరు స్పందనలో కలెక్టర్‌కు  ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. ఇప్పటికైనా అధికారులు తక్షణ చర్యలు చేపట్టి తమను కాపాడాలని బెవర రమ, లక్ష్మి, చుక్కల ప్రభావతి, బైరి అచ్చాయమ్మ, రెడ్డి అమ్ములు, గంధం ఉమా, వర్ణకవి వీరభద్రరాజు తదితరులు కోరుతున్నారు.


మత్స్యశాఖాధికారి పట్టించుకోవడంలేదు..


శాంతినగర్‌ కాలనీలోని 300 కుటుంబాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా చెరువు సాగుచేస్తుండడంతో దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నాం. ఈ విషయం మత్స్యశాఖాధికారి దృష్టికి తీసుకెళ్లినా చర్యలు శూన్యం. ఈ విష యం ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా  నేటికి న్యాయం జరగలేదు.

– ఓసూరి సత్యనారాయణ, శాంతినగర్‌ కాలనీ

Updated Date - 2022-01-24T04:33:58+05:30 IST