ఆక్వా చెరువులను సకాలంలో క్రమబద్ధీకరించాలి

ABN , First Publish Date - 2020-02-23T06:43:21+05:30 IST

జిల్లాలో మంచి, ఉప్పునీటి చేపలు, రొయ్యల చెరువుల రిజిస్ట్రేషన్‌ను సకాలంలో

ఆక్వా చెరువులను సకాలంలో క్రమబద్ధీకరించాలి

కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి 


కాకినాడ,ఫిబ్రవరి22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంచి, ఉప్పునీటి చేపలు, రొయ్యల చెరువుల రిజిస్ట్రేషన్‌ను సకాలంలో క్రమబద్ధీకరించడడానికి చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ జిల్లా స్థాయి కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌ టి.మురళీధర్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కోర్టుహాల్లో శనివారం ఆయన అధ్యక్షతన మత్స్యశాఖ జిల్లాస్థాయి కమిటీని నియమించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అనుమతి లేకుండా సాగులోఉన్న చెరువులను గుర్తించి క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముందుకు రాని రైతుల చెరువులకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయించాలని మత్స్యశాఖ జేడీకి సూచించారు. ఆక్వాజోన్‌లో గుర్తించిన 231 దరఖాస్తుదారుల అనుమతులకు ఆమోదించామన్నారు.  గ్రామ సభల ద్వారా ఆమోదం పొంది మండల స్థాయి కమిటీ సిఫార్సుతో వచ్చిన 352 దరఖాస్తులపై  అనుమతుల మంజూరు కు నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే అనుమతు లు పొంది అంగీకార పత్రాలు సమర్పించని 540 మంది రైతులకు వారం రోజులు సమయం ఇస్తున్నామని, గడువులోగా సంబంధిత అంగీకార పత్రాలు సమర్పించకపోతే వారి అనుమతులు తిరస్కరిస్తామని స్పష్టంచేశారు.


ఉప్పునీటి రొయ్యల సాగుకు రిజిస్ట్రేషన్‌ కోసం 29 దరఖాస్తులు, రెన్యూ వల్‌ కోసం 51 దరఖాస్తులను ఆమోదించి కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అఽథారిటీకి పంపుతామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వెనామీ రొయ్యల సాగు చేస్తున్న రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన రామదాసు చెరువు మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్‌ వెల్లడించారు. తిరస్కరించిన 750 దరఖాస్తు దారుల వివరాలను ఏపీఈపీడీసీఎల్‌ కార్యాలయానికి పంపి విద్యుత్‌ నిలిపి వేయడానికి చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ జేడీని ఆయన ఆదేశించారు. సమావేశంలో జేసీ2 జి.రాజకుమారి, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, మత్స్యశాఖ జేడీ జయరావు, జడ్పీ సీఈవో ఎం.జ్యోతి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ ఎ.రామానాయుడు, వ్యవసాయశాఖ డీడీ వీటీ రామారావు, గ్రౌండ్‌ వాటర్‌ డీడీ విజయ్‌కుమార్‌, ఆక్వా రైతు సూర్యారావు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-23T06:43:21+05:30 IST