కరోనాతో ఏఆర్‌ డీఎస్పీ శశిధర్‌ మృతి.. వరంగల్‌లో అలుముకున్న విషాదం

ABN , First Publish Date - 2020-08-11T17:08:03+05:30 IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా రెడ్డికాలనీకి చెందిన ప్రస్తుతం మహబూబాబాద్‌ ఏఆర్‌ డీఎస్పీ ఆర్‌ఎస్‌ శశిధర్‌ (48) సోమవారం కరోనాతో మృతిచెందాడు. ఆయన మృతిపట్ల పలువురు పోలీసు అధికారులు, క్రీడాకారులు

కరోనాతో ఏఆర్‌ డీఎస్పీ శశిధర్‌ మృతి.. వరంగల్‌లో అలుముకున్న విషాదం

వరంగల్‌ అర్బన్‌(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ అర్బన్‌ జిల్లా రెడ్డికాలనీకి చెందిన ప్రస్తుతం మహబూబాబాద్‌ ఏఆర్‌ డీఎస్పీ ఆర్‌ఎస్‌ శశిధర్‌ (48) సోమవారం కరోనాతో మృతిచెందాడు. ఆయన మృతిపట్ల పలువురు పోలీసు అధికారులు, క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో అనేక సంవత్సరాల పాటు ఎంటీవోగా పని చేయడంతో ఆయన మృతిపట్ల సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని నాంపల్లి కేర్‌ హాస్పిటల్‌లో మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. హన్మకొండ రెడ్డికాలనీకి చెందిన శశిధర్‌ మహబూబబాద్‌లో విధులు నిర్వర్తిస్తూ కిట్స్‌ కళాశాల ప్రాంతంలో సొంతింటిని నిర్మించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు.


 1996 బ్యాచ్‌కి చెందిన శశిధర్‌ ఆర్‌ఎ్‌సఐగా బెల్లంపెల్లి, కరీంనగర్‌, సిరిసిల్ల, వరంగల్‌ జిల్లాలలో పని చేశారు. 2018లో డీఎస్పీగా పదోన్నతి పొంది వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ నుంచి  మహబూబబాద్‌కు బదిలీపై వెళ్లారు. కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్‌ సోకడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్టు వెల్లడించారు. ఆయన మృతిపట్ల వరంగల్‌ ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌, అడిషనల్‌ డీసీపీలు భీంరావు, గిరిరాజు, ఏసీపీలు వేముల శ్రీనివాస్‌, బి. సదానందం, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఆర్‌ఐలు శెట్టి శ్రీనివాసరావు, భాస్కర్‌, సతీష్‌, నగేశ్‌లతో పాటు సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.  కాగా, శశిధర్‌ మృతి పట్ల మానుకోట ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-08-11T17:08:03+05:30 IST