హాస్యానికి అరదండాలు

ABN , First Publish Date - 2021-11-30T06:29:00+05:30 IST

‘విద్వేషం గెలిచింది, కళాకారుడు ఓడిపోయాడు.. ఇక సెలవు’ అంటూ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్య అభిమానులకు ఆశ్చర్యాన్నీ, ఆవేదననీ కలిగించాయి...

హాస్యానికి అరదండాలు

‘విద్వేషం గెలిచింది, కళాకారుడు ఓడిపోయాడు.. ఇక సెలవు’ అంటూ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్య అభిమానులకు ఆశ్చర్యాన్నీ, ఆవేదననీ కలిగించాయి. ప్రదర్శనలు ఆపవద్దని ఎంతోమంది ఆయనకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. బెంగుళూరు పోలీసులు మునావర్‌ను ‘వివాదాస్పద’ వ్యక్తిగా పేర్కొంటూ, నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చి ఆదివారం కార్యక్రమాన్ని రద్దుచేయించారు. గత నెలలో ముంబైలో ఓ ప్రోగ్రాం జరగాల్సి ఉండగా గుజరాత్ నుండి ముంబై వెళ్ళి మరీ బజరంగ్ దళ్ నేతలు హెచ్చరికలు చేయడంతో ఆగిపోయింది. గడచిన రెండుమాసాల్లో ఇలా కనీసం పన్నెండు ప్రోగ్రాములు రద్దయిపోవడంతో మునావర్ మనసు విరిగిపోయింది.


‘డోంగ్రీ టు నోవేర్’ పేరుతో మునావర్ నిర్వహించబోతున్న ఈ షోను నిలిపివేయాలంటూ పోలీసులు నిర్వాహకులకు రాసిన లేఖలో హిందూ జాగరణ్ సమితి నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలనే పోలీసులు యథాతథంగా ఉటంకించడం విశేషం. మునావర్ ఇతర మతాలను, దేవుళ్ళనూ కించపరుస్తాడనీ, చాలా రాష్ట్రాలు ఆయన ప్రదర్శనలు నిలిపివేశాయని, మధ్యప్రదేశ్‌లో కేసు కూడా పెట్టారనీ, ఇతర రాష్ట్రాల్లోనూ కేసులున్నాయని, ఈ ప్రదర్శన శాంతిభద్రతల సమస్య సృష్టిస్తుందని పోలీసుల వాదన. ఇక్కడ ఫిర్యాదిదారు ఎవరన్నది ముఖ్యం కనుక, మునావర్ గురించి లోతుగా తెలుసుకొని మరీ నిర్ణయానికి రావాల్సిన అవసరం పోలీసులకు లేదు. కానీ, వారు తమ ఆరోపణలకు ఆధారంగా మధ్యప్రదేశ్ కేసును ప్రస్తావించారు కనుక, తాను వేయని జోకులకు కూడా మునావర్ నెలరోజుల జైలు అనుభవించిన ఆ ఘటన ఇప్పుడు చర్చకు వస్తున్నది. ఈ ఏడాది జనవరిలో ఇండర్ లో మునావర్ తన ప్రదర్శన ఆరంభించగానే స్థానిక బీజేపీ నాయకుడొకరు స్టేజి ఎక్కి ప్రదర్శన నిలిపివేయమన్నాడు. ‘నా లక్ష్యం నవ్వించడమే, ఎవరి మనోభావాలూ దెబ్బతీయను..’ అంటూ మునావర్ బతిమలాడుకుంటున్న విడియో ఒకటి అప్పట్లో విస్తృతంగా ప్రచారమైంది. షో ఆరంభించమంటూ కొందరు అరవడం కూడా వినబడుతుంది. దీంతో ఆ నాయకుడు అక్కడనుంచి వెళ్ళిపోయాడు కానీ, ఆ రాత్రికే పోలీసులు మునావర్ మీద మతభావాలు దెబ్బతీస్తున్నాడనీ, కరోనా ప్రమాదాన్ని హెచ్చించాడనీ ఏవో కేసులు పెట్టారు. మునావర్ హిందూ దేవతలు, దేవుళ్ళమీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తాడని ఆ స్థానిక నాయకుడు మీడియాతో చెప్పాడు. మునావర్ హిందూ దేవుళ్ళమీద జోకులు వేశాడనేందుకు తమ దగ్గర ఏ ఆధారాలు లేవనీ, కానీ, అతడు రిహార్సల్స్ చేస్తుండగా తాను చాటుగా కొన్నిమాటలు విన్నానని ఈ ఫిర్యాదిదారుడు తమకు చెప్పాడని పోలీసులు అన్నారు. ఇలా చేయని నేరానికి నెలరోజులు జైలుపాలైన మునావర్ అంతకుముందు స్వరాష్ట్రం గుజరాత్ లో ఏకంగా అమిత్ షా మీదే జోకులు వేసి కేసులు ఎదుర్కొన్నాడు. మరో వ్యంగ్యకళాకారుడు వీర్ దాస్ అమెరికాలో ఇటీవల ఇచ్చిన స్టేజ్ షోను కూడా ఇలాగే వివాదాస్పదం చేశారు. 2014లోనే దేశానికి అసలు సిసలు స్వాతంత్ర్యం వచ్చిందంటూ దశాబ్దాల స్వాతంత్ర్య సంగ్రామాన్ని అవమానించిన కంగనా రౌనత్ అనే నటి ఈ వీర్ దాస్ వ్యాఖ్యలను ‘సాఫ్ట్ టెర్రరిజం’గా అభివర్ణించి కఠినచర్యలు డిమాండ్ చేయడం విశేషం. టూ ఇండియాస్ అంటూ ఈ దేశంలో ఉన్న మంచినీచెడునూ పదునైన వాక్యాల్లో పక్కపక్కనే వ్యగ్యంగా పోల్చిన వీర్ దాస్ మాత్రం దేశద్రోహి అయిపోయాడు.


పాలకులు పలు ‘ఉపా’యాలతో విమర్శను నియంత్రిస్తున్న కాలం ఇది. చివరకు హాస్యాన్ని కూడా భరించలేని స్థితికి వారూ వారి అనుచరగణమూ చేరుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం అన్న ఏక వాక్యంతో హాస్యకళాకారులందరినీ వొణికేట్టు చేస్తున్నారు. టిక్కెట్లు కొనుక్కొని చూస్తున్నవారికి ఈ కమెడియన్ల వ్యాఖ్యలు ఏమాత్రం నచ్చకపోయినా సహించరు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా కళాకారులు నోటిని నియంత్రణలో పెట్టుకోనప్పుడు వారు కచ్చితంగా ప్రజాదరణ కోల్పోతారు. చలోక్తులు విసిరే నోటికి తాళం, చేతులకు సంకెళ్ళు వేసి, హాస్యాన్ని జైల్లో పెడుతున్నారన్న అపఖ్యాతి అంతర్జాతీయంగా రావడం దేశపాలకులకు మంచిది కాదు.

Updated Date - 2021-11-30T06:29:00+05:30 IST