Abn logo
Sep 22 2021 @ 23:12PM

అరకొర మందులే

విజయనగరంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రి

ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు

రిఫరల్‌ ఆస్పత్రుల్లోనూ నిరాశే

విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 22: కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ జిల్లా కేంద్రాసుపత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉంది. కొన్నాళ్లుగా చాలా తక్కువ మోతాదులో వస్తున్నాయి. దీనికి తోడు ఈ ఆసుపత్రికి  వచ్చే రోగులను రిఫర్‌ చేసేందుకు 10 ఆసుపత్రులు కేటాయించారు. కానీ ప్రభుత్వం రిఫరల్‌ ఆసుపత్రులకు నిధులు విడుదల చేయని కారణంగా   అవి రోగులను చేర్చుకోవవడం లేదు. దీంతో ఈఎస్‌ఐ ఆసుపత్రికి వచ్చే రోగుల శాతం గణనీయంగా పడిపోయింది. ఎక్కువ మంది ఇక్కడికి రిఫరల్‌ కోసమే వస్తుంటారు. అవి కూడా నిరాకరిస్తున్న కారణంగా ఓపీ తగ్గింది. కొద్దిరోజులుగా మందులు కూడా రావడం లేదు. యాంటీబయాటిక్‌, విటమిన టాబ్లెట్స్‌, పెయిన కిల్లర్‌ మందులు ఎక్కువగా వస్తుండేవి. కొంత కాలంగా తగ్గాయి. వచ్చే కాస్త మందులూ వారం రోజుల్లోపే పూర్తవుతున్నాయి. ఈ పరిస్థితిలో పక్కనే ఉన్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీల నిల్వలపై ఆధారపడుతున్నారు. జిల్లాలో బొబ్బిలి, నెల్లిమర్ల, గరివిడి, కొత్తవలస మండల కేంద్రాల్లో ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ఉన్నాయి. వీటికి కూడా మందులు కొరత ఉంది.  వాటిలో రోగులు తక్కువగా ఉంటున్న కారణంగా డిస్పెన్సరీల నుంచి విజయనగరంలోని డయగ్నోస్టిక్‌ సెంటర్‌కు మందులు తెప్పించుకుంటున్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత వేధిస్తోంది. అక్కడ 11మంది డాక్టర్లు ఉండాలి. కానీ ముగ్గురితోనే నెట్టుకు వస్తున్నారు. గైనకాలజీ, ఆర్థో తదితర స్పెషలిస్టుల కొరత ఉంది. ఒక వైపు మందుల కొరత, మరో వైపు నిపుణులైన డాక్టర్లు లేక పోవటం, దిగువ స్థాయి సిబ్బంది కొరత ఇలా వివిధ కారణాలతో రోగులకు కనీస వైద్య సేవలు అందడం లేదు.