రెండు జిల్లాలుగా అరకు

ABN , First Publish Date - 2020-06-27T06:31:39+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటులో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లా గా మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినవస్తున్నాయి....

రెండు జిల్లాలుగా అరకు

కొత్త జిల్లాల ఏర్పాటులో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లా గా మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ ప్రాతిపదికకు కొన్ని మినహాయింపులు అవసరం.అందులో ముఖ్యమైనది అరకు లోక్‌సభ నియోజకవర్గం విషయం. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నుండి తూర్పుగోదావరి లోని రంపచోడ వరం వరకూ పొడవుగా వ్యాపించి ఉన్న ఈ నియోజకవర్గ పరిధి కేవలం ఒక్క జిల్లా గా ఉండేందుకు ఏ మాత్రం అనుకూలం కానిది. జిల్లా కేంద్రమేదైనా ఆ జిల్లా వాసుల్లో ఎక్కువ మందికి దూరమే అవుతుంది. అరకు లోయని కేంద్రంచేస్తే పాలకొండ వాసికి, ఇటు చేస్తే అటు వారికి తమ జిల్లా కేంద్రం చేరుకోవడం కన్నా,రాష్ట్ర రాజధాని చేరడమే అత్యంత సులభతరం అవుతుంది. అప్పుడు కొత్తజిల్లా ఏర్పాటులో అసలు ఉద్దేశమే హాస్యాస్పదంగా తయారౌతుంది. ఒక జిల్లా అన్నది ప్రభుత్వానికి పరిపాలనా సౌలభ్యం,ప్రజలకు అందుబాటు ప్రాతిపదికన ఏర్పడాలి. ఎందుకంటే స్థానిక పాలనకైనా, కేంద్ర, రాష్ట్రాల పాలనకైనా అదే ముఖ్య కేంద్రం. ప్రజలు ప్రభుత్వాన్ని చూసేది, పనితీరుని అంచనా వేసేది జిల్లా ద్వారానే.కరోనా కట్టడిలో జిల్లా యూనిట్ గానే పాలన జరిగింది కాబట్టి కొత్త జిల్లాలు ప్రాక్టికల్‌గా ప్రజలకు చేరువగా ఉండేలా చూసుకోవాలి. అలా చూసినప్పుడు అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిని రెండు జిల్లాలు చెయ్యడం సముచితం. పాలకొండ, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ స్థానాలను ఒక జిల్లా గా,మిగతా నాలుగింటిని మరో జిల్లాగా చెయ్యాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుని, మన్య ప్రాంతం రెండు జిల్లాలుగా అభివృద్ధి చెందేలా చూడాలని కోరుతున్నాను.



 – డా.డి.వి.జి.శంకరరావు

మాజీ ఎంపీ, పార్వతీపురం

Updated Date - 2020-06-27T06:31:39+05:30 IST